వైభవంగా ముగిసిన భద్రకాళి బ్రహ్మోత్సవాలు
చివరి రోజు వైభవంగా సుదర్శన ప్రతిష్ట, చక్రస్నానం
హన్మకొండ కల్చరల్ : వరంగల్‌లోని శ్రీభద్రకాళి ఆలయంలో కొనసాగుతున్న భద్రకాళీభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశారుు. చివరిరోజు ఉదయం 5 గంటల నుంచి నిత్యాహ్నికం, చతుస్థానార్చన, గణపతి పూజలు చండీహవనం, చూర్ణోత్సవం నిర్వహించారు. 11గంటలకు అమ్మవారిని యోగలక్ష్మీగా అలంకరించి శరభవాహనంపై ఊరేగిం చారు. మధ్యాహ్నం 12 గంటలకు మహాపూర్ణాహుతి, ఒంటి గంటకు బలిహరణ జరిపారు.. ధ్వజారోహణం చేశారు. జిల్లా మేదరి సంఘం, కురుమ సంఘం సౌజన్యంతో ప్రసాదాల వితరణ జరిగింది. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, ముఖ్యార్చకులు చెప్పెల వెంకటనాగరాజుశర్మ, అర్చకులు టక్కరసు సత్యం, సుధాకరశర్మ, సంఖ్యా శాస్త్ర నిపుణులు మల్లావజ్జుల రామకృష్ణశర్మ, దత్తసాహిత్శర్మ , వేదవిద్యార్థులు శ్రీభద్రకాళి శరణం మమః అంటూ అస్త్రబేరాన్ని తలపై మోస్తూ భద్రకాళి చెరువులోకి వెళ్లి వైభవంగా సుదర్శన చక్రస్నానం నిర్వహిం చారు. ఆలయంలో జరిగే ఉత్సవాల్లో అవబృధస్నానం నిర్వహిస్తుండడం సాధారణం. మొదటిసారిగా సుదర్శన ప్రతిష్టతోపాటు చక్రస్నానం నిర్వహించడం విశేషం.
వైభవంగా పుష్పయాగం..
సాయంత్రం 7గంటలకు అమ్మవారిని మోక్షలక్ష్మీగా అలంకరించి పుష్పరథంపై ఊరేగించారు. పలుప్రాంతాల నుండి తెప్పించిన కిలోల కొద్దీ పసుపు, ఎరుపు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు భద్రకాళి శేషు అధ్వర్యంలో నారింజ రంగు గులాబీలు, కనకాంబరాలు, మల్లెలు, లిల్లీలు, వివిధ రంగుల చామంతులతో శోభాయమానంగా పుష్పయాగం నిర్వహించారు. ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ కట్టా అంజనీదేవి, సీనియర్ ఉద్యోగులు కూచన హరినాథ్, అద్దంకి విజయ్, వెంకటయ్య, కృష్ణ, రాము, చింతశ్యాం పర్యవేక్షించారు. పుష్పయాగంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, పార్లమెంటరీ సెక్రటరీ దాస్యం వినయ్‌భాస్కర్, రేవతి దంపతులు, బ్రాహ్మణసంఘం రాష్ట్ర అధ్యక్షులు వెన్నంపల్లి జగన్మోహన్శర్మ, జిల్లా అర్బన్ అధ్యక్షులు వల్లూరి పవన్‌కుమార్ , ఆర్యవైశ్యప్రముఖులు అయితాగోపినాధ్ పాల్గొన్నారు. ఉదయం జరిగిన పూజా కార్యక్రమాల్లో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ జేసీ రఘునాధ్, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, నర్సింగరావు దంపతులు పాల్గొన్నారు.