ఎల్ఎండీ దిగువకు 3వేల క్యూసెక్కుల నీరు విడుదల
దిగువకు ఒక తడి.. ఒక టీఎంసీ మాత్రమే
ఎల్ఎండీ ఎగువకు ఎగువకు ఆరు తడులు
ఎస్సారెస్పీ సీఈ శంకర్
తిమ్మాపూర్: లోయర్ మానేరు డ్యాం(ఎల్ఎండీ) నుంచి కాకతీయ కాలువ ద్వారా దిగువకు నీటి విడుదలను 3వేల క్యూసెక్కులకు పెంచినట్లు ఎస్సారెస్పీ చీఫ్ ఇంజినీర్(సీఈ) శంకర్ తెలిపారు. ఎల్ఎండీ ప్రధాన కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదలను బుధవారం పరిశీలించారు. ఎల్ఎండీ దిగువకు వెయ్యి క్యూసెక్కులు వదిలితే నీరు వేగంగా వెళ్లడం లేదన్నారు. దీంతో 3వేల క్యూసెక్కులకు పెంచి, గురువారం 2వేలకు, ఆ తరువాత వెయ్యి క్యూసెక్కులకు పరిమితం చేస్తామని చెప్పారు. మొత్తంగా ప్రస్తుతం ఒక తడి కోసం ఒక టీఎంసీ మాత్రమే నీటిని దిగువకు విడుదల చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు 0.4టీఎంసీలు విడుదల చేయగా ఇంకా 0.6టీఎంసీలు విడుదల చేయాల్సి ఉందన్నారు. ఆ తరువాత ఎల్ఎండీలోకి ఇన్ఫ్లో ఉంటేనే ప్రభుత్వం నిర్ణయం మేరకు మిగతా తడులకు విడుదల ఉంటుందని వివరించారు. రైతులు గమనించి పంటలు ప్రస్తుతం సాగు చేయవద్దని, వేసిన పంటలనే కాపాడుకోవాలని కోరారు. ఎస్సారెస్పీ నుంచి ఎల్ఎండీ వరకు ఆయకట్టుకు ఈ నెల 23న రెండో తడి నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. ఎనిమిది రోజుల ఆన్, ఏడు రోజుల ఆప్ పద్ధతిన ఈనెల 31తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. డిస్ట్రిబ్యూటరీల్లో చెట్లపొదలు, పూడిక ఉంటే ఉపాధి హామీ కింద తొలగించుకునేందుకు డ్వామా అధికారులతో మాట్లాడి అనుమతులు తీసుకోవాలని సూచించారు. సీఈ వెంట ఈఈ శ్రీనివాస్, డీఈఈ సత్యనారాయణ ఉన్నారు.