డిగ్రీకి ధరఖాస్తులు
బారులు తీరిన విద్యార్థులు
ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్
అధిక ధరలకు విక్రయిస్తున్న ‘ప్రైవేట్’
గుడ్ విల్ను సొమ్ము చేసుకుంటున్న వైనం
వచ్చే వారం టెన్త ఫలితాలు
ఇక పీయూ కళాశాలల వద్ద జాత రే
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో పీయూసీ ఫలితాలు వెలువడడంతో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు అభ్యర్థులు దరఖాస్తుల వేటలో పడ్డారు. ప్రతిష్టాత్మక కాలేజీల్లో ప్రవేశం పొందడానికి అభ్యర్థులు పోటీ పడుతున్నారు. నగరంలో సెయింట్ జోసెఫ్, మౌంట్ కార్మెల్, శేషాద్రిపురం, నేషనల్ కాలేజీ, ఎంఈఎస్ తదితర కళాశాలల్లో దరఖాస్తులను తీసుకోవడానికి అభ్యర్థులు చాంతాడంత క్యూల్లో నిల్చుకోవాల్సి వస్తోంది.
మరో వైపు ప్రవేశ దరఖాస్తుల ధరలు ఎక్కువగా ఉన్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కొన్ని చోట్ల రూ.వంద చొప్పున వసూలు చేస్తుండగా, మిగిలిన చోట్ల అంతకంటే ఎక్కువగానే ఉంది. అయితే తాము కోరుకున్న కళాశాలల్లో చేరాలనుకుంటున్న విద్యార్థులు దరఖాస్తు ధర ఎంతైనా వెనకడుగు వేయడం లేదు.
ప్రవేశ దరఖాస్తుల ధరను ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, ప్రైవేట్ కళాశాలలు ఇష్టం వచ్చినట్లు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. మరో వైపు ఉత్సాహవంతులైన విద్యార్థులు దరఖాస్తులను తీసుకుని అక్కడికక్కడే భర్తీ చేసి సమర్పిస్తున్నారు. వచ్చే వారం ఎస్ఎస్ఎల్సీ ఫలితాలు వెలువడనున్నాయి. అనంతరం దరఖాస్తుల కోసం విద్యార్థుల రద్దీతో పీయూ కళాశాలలు జాతరను తలపించనున్నాయి.