అమెరికాలోని ఓ బ్యాంకులో కొందరిని బందీలుగా చేసుకున్న ఓ ఉన్మాదిని పోలీసులు కాల్చిచంపారు. సెయింట్ జోసెఫ్‌లోని టెన్సాస్ స్టేట్ బ్యాంక్ శాఖలో ఈ ఘటన జరిగింది. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో(స్థానిక కాలమానం ప్రకారం) యెమన్ జాతీయుడైన ఫయాద్ అబ్దో అహ్మద్ అనే యువకుడు ముగ్గురిని బందీలుగా చేసుకున్నాడని లూసియానా స్టేట్ పోలీస్ సూపరింటెండెంట్ మైక్ ఎడ్మన్‌సన్ తెలిపారు.
‘అతడు మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. అహ్మద్‌కు మనుషులను బాధించడమంటే ఇష్టం. దీనికి సంబంధించి రాసుకున్న కొన్ని నోట్స్ అతడి అపార్ట్‌మెంట్‌లో లభ్యమయ్యాయి. బ్యాంకు దోపిడీ ఉద్దేశం లేదు. కావాలనే పథకం ప్రకారమే దాడి చేశాడు. పిచ్చిపిచ్చి డిమాండ్లు పెట్టాడు. తన బుర్రలో ఏదో పరికరం ఉందని.. దాన్ని తొలగించాలని కోరాడు. ఇద్దరు మహిళలు, ఓ పురుషుడిని బందీలుగా చేసుకున్నాడు. అందులో ఓ మహిళను విడిచిపెట్టాడు. అర్ధరాత్రి దాటేదాకా ఈ డ్రామా కొనసాగింది. మిగిలిన ఇద్దరినీ చంపేస్తానని బెదిరించడంతో మేం వెంటనే భవనంలోకి దూసుకెళ్లాం. దీంతో అతడు బందీలపై కాల్పులు జరిపాడు. మేం అహ్మద్‌ను మట్టుపెట్టాం’ అని వివరించారు. గాయపడిన ఇద్దరిలో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.