బిగ్‌బాస్ షో విన్నర్‌గా రేవంత్.. ఎవరెవరు ఏయే స్థానాల్లో ఉన్నారంటే?
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ విన్నర్‌గా రేవంత్ నిలిచారు. రన్నరప్‌గా శ్రీహాన్ నిలిచారు. ఈ గ్రాండ్ ఫినాలేలో మాజీ కంటెస్టెంట్ల డ్యాన్సులతో పాటు హీరోయిన్స్ స్పెషల్ డ్యాన్సులతో కనువిందు చేశారు. ఈ గ్రాండ్ ఫినాలేలో నిఖిల్, ధమాకా టీమ్ రవితేజ, శ్రీలీల, సీనియర్ హీరోయిన్ రాధ స్టేజీపై సందడి చేశారు.
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బిగ్‌బాస్ 6 తెలుగు గ్రాండ్ ఫినాలే వైభవంగా జరిగింది. వాల్తేరు వీరయ్య బాస్ పార్టీ సాంగ్‌తో కింగ్ నాగార్జున అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. ఇక వచ్చీ రావడంతో కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్‌ను ఆత్మీయంగా పలకరించాడు నాగ్. అనంతరం మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా బయటకు వచ్చేసిన శ్రీసత్యతో ముచ్చటించాడు. మరికాసేపట్లో పెళ్లి పెట్టుకుని పెళ్లికూతురి గెటప్‌లో గ్రాండ్ ఫినాలేకు వచ్చిన నేహా చౌదరిని చూసి అవాక్కయ్యాడు. ఈ షో ముగిసిన వెంటనే అందరూ మండపానికి వచ్చేసి తనను ఆశీర్వదించాలని కోరింది నేహా.
బిగ్‌బాస్ మినీ అవార్డులు..
తర్వాత టాప్ ఫైనలిస్టులతో అవార్డుల పంపిణీ చేపట్టాడు నాగ్. అందులో భాగంగా ఐదు అవార్డులు ప్రవేశపెట్టాడు. మొదటగా బెస్ట్ చెఫ్ అవార్డు మెరీనాకు ఇవ్వాలన్నాడు రేవంత్. అందరికీ వంట చేసి పెడుతూనే గేమ్ ఆడేదని చెప్పాడు. దీంతో ఆ అవార్డును మెరీనాకు అందించాడు హోస్ట్. తర్వాత బెస్ట్ డ్యాన్సర్ అవార్డును ఫైమాకు ఇవ్వాలన్నాడు ఆదిరెడ్డి. ఆమె స్టేజీపైకి రాగానే చేతికి ముద్దు పెడతానంటూ ఆటపట్టించాడు నాగ్. దెబ్బకు హడలిపోయిన ఫైమా.. మీరు ముద్దులు ఇస్తే నాకు నిద్ర పట్టడం లేదంటూ దూరం జరిగింది. అనంతరం కీర్తి.. స్లీపింగ్ స్టార్ అవార్డును శ్రీసత్యకు ఇవ్వాలనడంతో నాగ్ దాన్ని ఆమెకు బహుకరించాడు. రోహిత్.. రాజ్ బెస్ట్ గేమర్ అని చెప్పడంతో అతడికి పురస్కారం ఇచ్చాడు నాగ్. శ్రీహాన్.. బెస్ట్ లవర్ బాయ్ అవార్డుకు అర్జున్ కల్యాణ్ పేరును సూచించాడు. దీంతో అతడు స్టేజీపై వచ్చి అవార్డు అందుకున్నాడు.
తర్వాత యంగ్ హీరో నిఖిల్ గెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. హౌస్‌లోకి వెళ్లి టాప్-5 కంటెస్టెంట్స్‌లో ఒకరైన రోహిత్‌ను ఎలిమినేట్ చేసి తనతో పాటు బయటకు తీసుకొచ్చేశాడు. ధమాకా హీరోహీరోయిన్లు రవితేజ, శ్రీలీల స్టేజీపైకి వచ్చి జింతాత స్టెప్పుతో ఓ ఊపు ఊపారు. ఇంతలో ఆదిరెడ్డి ఎలిమినేట్ అయిపోయాడు. తర్వాత అతడు టాప్ 3 కంటెస్టెంట్ల గురించి మాట్లాడుతూ.. 'కీర్తి బిగ్‌బాస్ షోలో కనిపించడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆత్మహత్యలు ఆగుతాయి. అన్ని కష్టాల్లో ఉన్న ఆమె అంత ధైర్యంగా ముందుకెళ్లడం చాలామందికి ఇన్స్పిరేషన్. రేవంత్‌లో 20 తప్పులు ఉంటే 40 పాజిటివ్‌లు ఉంటాయి. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెను వదిలి వచ్చి హౌస్‌లో గేమ్ ఆడటం అంటే మామూలు విషయం కాదు. నాకంటే ఆ ముగ్గురు బాగా ఆడారు. కాబట్టి వాళ్లకంటే ముందే ఎలిమినేట్ అయినందుకు సంతోషంగా ఉంది' అన్నాడు.
తర్వాత రవితేజ హౌస్‌లోకి వెళ్లి టాప్ 3 కంటెస్టెంట్లకు సూట్‌కేసు ఆఫర్ చేశాడు. ప్రైజ్‌మనీలో నుంచి పది శాతం మీ సొంతమని ఊదరగొట్టినా ఎవరూ పట్టించుకోలేదు. దాన్ని ముప్పై శాతానికి పెంచినా సరే వద్దే వద్దన్నట్లుగా సైలెంట్‌గా ఉండిపోయారు. దీంతో రవితేజ చేసేదేం లేక కీర్తి చేయి పట్టుకుని బయటకు తీసుకొచ్చాడు. ఇక హౌస్‌లో రేవంత్, శ్రీహాన్ మాత్రమే మిగిలారు. ఈసారి వారి కోసం నాగార్జున రంగంలోకి దిగాడు.
గోల్డెన్ బ్రీఫ్‌కేసుతో హౌస్‌లోకి వెళ్లాడు. రూ.25 లక్షలున్న బ్రీఫ్‌కేసును ఎవరు సొంతం చేసుకుంటారని అడిగాడు. ఇద్దరూ వద్దనేసరికి ఆఫర్‌ను రూ.30 లక్షలకు పెంచాడు. ఆరోహి, కీర్తి, అభినయ, మెరీనా, రోహిత్, సుదీప మినహా మిగతా అందరూ శ్రీహాన్ సూట్‌కేసు తీసుకోవడమే మంచిదని చెప్పారు. అందరి అభిప్రాయం అడిగిన తర్వాత ఇద్దరూ సూట్‌కేసు తీసుకోవడానికి ససేమీరా అన్నారు. దీంతో నాగ్ ఆ డబ్బును రూ.40 లక్షలకు పెంచాడు. మొదట్లో సూట్‌కేసు తీసుకోవద్దన్న శ్రీహాన్ తండ్రి చివరికి తీసుకోమని చెప్పాడు. తండ్రి మాట విన్నాక శ్రీహాన్ అమ్మానాన్న కోసం తీసుకుంటున్నానన్నాడు.
ఇద్దరినీ స్టేజీపైకి తీసుకొచ్చాక రేవంత్‌కు ట్రోఫీ బహుకరించడంతో పాటు పది లక్షల చెక్, 605 గజాల సువర్ణభూమి ప్లాట్‌ను అందించారు. చివరగా అందరికీ దిమ్మతిరిగిపోయే న్యూస్ చెప్పాడు నాగ్. బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారి ఇద్దరూ విన్నర్స్ అయ్యాడన్నాడు. అదెలాగంటే ట్రోఫీ అందుకుని రేవంత్ గెలిచాడని, కానీ ప్రేక్షకుల ఓట్లు శ్రీహాన్‌కే ఎక్కువ వచ్చాయని ట్విస్ట్ ఇచ్చాడు. ఏదేమైనా ట్రోఫీ అందుకుంది రేవంత్ కాబట్టి అతడిని అఫీషియల్ విన్నర్‌గా ప్రకటించాడు.