నా అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి! | Star India launches new brand 'Star Maa' | Sakshi
Sakshi News home page

నా అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి!

Published Sun, Feb 12 2017 10:50 PM | Last Updated on Tue, Sep 5 2017 3:33 AM

నా అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి!

నా అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి!

‘‘సుమారు పదేళ్లు చిత్ర పరిశ్రమకీ, వినోదానికీ దూరంగా ఉన్న మాట వాస్తవమే. రీ–ఎంట్రీలో ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారు? గతంలో చూపిన ప్రేమాభిమానాలు చూపిస్తారా? అనే మీమాంస నాలో ఉండేది. ‘ఖైదీ నంబర్‌ 150’ విజయంతో నా అనుమానాలన్నీ పటాపంచలు అయ్యాయి. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు జీవితాంతం రుణపడి ఉంటాను’’ అన్నారు మెగాస్టార్‌ చిరంజీవి. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ‘స్టార్‌మా’ కొత్త లోగోను ఆవిష్కరించారాయన. ఇన్నాళ్లు ప్రేక్షకుల్ని అలరించిన ‘మాటీవీ’ ఇక నుండి ‘స్టార్‌మా’గా అలరించనుంది.

ఈ రోజు రాత్రి 9.30 గంటలకు ప్రారంభం కానున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’తో ఛానల్‌ లోగో మారనుంది. ఈ షోతో బుల్లితెరపై ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మాట్లాడుతూ – ‘‘గతంలో సినిమా ఒక్కటే ప్రేక్షకులకు వినోదం. ఇప్పుడు టీవీ ప్రోగ్రామ్‌లూ సినిమాలకు సమాంతరంగా వినోదం అందిస్తున్నాయి. ‘ఖైదీ నంబర్‌ 150’ తర్వాత ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’తో ప్రేక్షకులకు చేరువయ్యే ఛాన్స్‌ వచ్చింది. ఈ షో మరో లెవల్‌కి వెళ్లడానికి నా ఇమేజ్‌ దోహదపడుతుంది. అలాగే ప్రేక్షకులకు మరింత దగ్గర కావడంతో పాటు విభిన్న వ్యక్తులను కలిసే అవకాశం నాకు లభించింది’’ అన్నారు.

ఈ షోలో సినీ ప్రముఖులు ఎవరైనా పాల్గొంటున్నారా? అని చిరంజీవిని అడగ్గా... ‘‘నాగార్జున, వెంకటేశ్‌లు వస్తున్నారు. ఈరోజు నాగార్జున ఎపిసోడ్‌ చిత్రీకరిస్తున్నాం. మహిళా దినోత్సవం సందర్భంగా రాధికా శరత్‌కుమార్, సుమలత వస్తారు’’ అని చెప్పారు. మరి, షోకి బాలకృష్ణను కూడా ఆహ్వానిస్తారా? అని ప్రశ్నించగా... ‘‘తప్పకుండా! నా స్నేహితుడు వస్తే సంతోషమే కదా. నిర్వాహకులకు బాలయ్యను ఆహ్వానించమని చెబుతా’’ అన్నారు చిరంజీవి.  సోమ, మంగళ, బుధ, గురు వారాల్లో రాత్రి 9.30 నుంచి 10.30 గంటల మధ్య ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గేమ్‌షో ప్రసారం కానుంది. ఈ కార్యక్రమంలో స్టార్‌ ఇండియా సౌత్‌ సీఈఓ కెవిన్‌ వాజ్, స్టార్‌ మా బిజినెస్‌ హెడ్‌ అలోక్‌ జైన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement