ఆటోలో మెగాస్టార్!
⇒ మీలో ఎవరు కోటీశ్వరుడులో సత్తాచాటిన ఆటోడ్రైవర్
⇒ కానిస్టేబుల్‌గానూ ఎంపిక
⇒ రూ.3.60లక్షలు సొంతం చేసుకున్న మేడ్చల్ యువకుడు
మేడ్చల్: మెున్నటివరకు అతనొక సాధారణ యువకుడు. రెక్కాడితే గానీ డొక్కాడని. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా అర్ధాంతరంగా చదువు ఆగిపోవడంతో తండ్రిలాగే ఆటో డ్రైవర్ అవతారం ఎత్తాడు. అయితే తాను ఆందరిలా జీవించకూడదని ఏదైనా సాధించాలని నిర్ణయించుకున్నాడు.అందుకు తగినట్లుగా కృషి చేశాడు. ఓ వైపు ఆటో నడుపుతూనే ఇంటర్మీడియట్ పూర్తి చేసి పోలీస్ ఉద్యోగం కోసం సాధన చేశాడు కొంత కాలం ఇంటికి దూరంగా నగరంలో ఉంటూ కోచింగ్ తీసుకున్నాడు. ఇటీవల జరిగిన పోలీస్ కానిస్టేబుల్ పరీక్షల్లో ఉత్తీర్ణుడై ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అతడికి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ రూపంలో జాక్‌ఫాట్ తగిలింది. ఈ కార్యక్రమం నాల్గవ సెషన్‌లో పాల్గొన్న సతీష్ మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు అందుకున్నాడు.
అతడే ఆధారం
మేడ్చల్ మండలం పూడూర్ గ్రావూనికి చెందిన తాళ్ళపల్లి సత్యనారాయణ, శారద దంపతులకు కుమారుడు సతీష్‌గౌడ్(26), కుమార్తె సౌజన్య ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన సతీష్ చిన్నతనం నుంచే బతుకుపోరాటంలో రాటుదేలాడు. పేపర్ బాయ్‌గా, చిట్ ఫండ్స్‌లో కలెక్షన్ బాయ్‌గా పనిచేస్తూ 10వ తరగతి పూర్తి చేశాడు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా చదువుకు స్వస్తి చెప్పి ఆటో డ్రైవర్‌గా జీవితాన్ని ఆరంభించాడు. నగరంలో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పొషిస్తూనే ఇంటర్ పూర్తి చేశాడు. అంతలో చెల్లెలు సౌజన్య పెళ్లి చేయడం, అనారోగ్యంతో తండ్రి మరణంతో కుటుంబ భారం అతడిపైనే పడింది.
కలిసొచ్చిన కోటీశ్వరుడు....
పోలీస్ ఉద్యోగం సాధించాలనే తపనతో కఠోర శ్రమ చేసి అన్ని పరీక్షల్లో అర్హత సాధించి శిక్షణ కోసం ఎదురు చూస్తున్న సతీష్‌కు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమం ద్వారా అదృష్టం తలుపుతట్టింది. చిరంజీవి నేతృత్వంలో ప్రారంభంకానున్న నాలుగో సెషన్‌లో పాల్గొనేందుకు ఎస్‌ఎంఎస్ ద్వారా వారు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం పంపాడు. అనంతరం అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఆడిషన్స్‌లో మంచి మార్కులతో అర్హత సాధించాడు. కార్యక్రమంలో ఇద్దరి తర్వాత హాట్ సీట్‌కు చేరుకున్నాడు.
రూ.3.60లక్షలు సొంతం
హాట్ సీట్‌కు చేరుకున్న సతీష్ పలు ప్రశ్నలకు చకచకా సమాధానాలు చెప్పి రూ.1.60 లక్షలు గెలుచుకున్నాడు. పేద కుటుంబానికి చెందిన సతీష్‌ను ప్రొత్సహించేందుకు గాను చిరంజీవి స్వయంగా రూ.2 లక్షలు అందజేశారు.
సతీష్ ఆటోలో ఆటో జానీ
హాట్ సీట్‌కు చేరుకున్న సతీష్ చిరంజీవిని తమ ఆటోలో ఎక్కాలని కోరడంతో అందుకు అంగీకరించిన మెగాస్టార్ తాను కూడా ఆటో ఎక్కి చాలా రోజులైందని చెబుతూ సతీష్ ఆటో ఎక్కాడు. మెగాస్టార్ చిరంజీవి తన ఆటోలో ఎక్కడం సంతోషంగా ఉందని సతీష్ పేర్కొన్నాడు. ఈ సందర్బంగా అతను చిరంజీవికి ఆటో డ్రైవర్ యూనిఫామ్( చొక్కా)ను బహుమతిగా అందజేశారు.
ఆనందంగా ఉంది : సతీష్
ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న నాకు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో అవకాశం రావడం ఆనందంగా ఉంది. చిరంజీవి నా ఆటోలో ఎక్కడం ఎప్పటికి మరిచిపోలేను. కార్యక్రమం ద్వారా గెలుచుకున్న డబ్బుతో అప్పులు తీరుస్తా శుక్రవారం విడుదలైన కానిస్టేబుల్ పరీక్షా ఫలితాల్లో అర్హత సాధించడం ఆనందంగా ఉంది. పోలీస్ ఉద్యోగం చేతపట్టి కుటుంబాన్ని మరింత బాగా చూసుకుంటా.