‘నేపాల్’ కోసం కాంగ్రెస్ విరాళాల సేకరణ
- రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ముఖ్య నాయకులు
- కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఒక నెల జీతం విరాళం
- వెల్లడించిన ఎమ్మార్సీసీ అధ్యక్షుడు సంజయ్
ముంబై: నేపాల్ భూకంప బాధితుల సహాయార్థం రాష్ట్ర కాంగ్రెస్ నేతలు విరాళాలు సేకరణ మొదలుపెట్టారు. రాష్ట్రంలోని 20 నగరాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. లోఖండ్వాలా, కాందివలిలో విరాళాల సేకరణను ముంబై రీజనల్ కాంగ్రెస్ కమిటీ(ఎమ్మార్సీసీ) అధ్యక్షుడు సంజయ్ నిరుపం నిర్వహించారు. ములుండ్, ఘాట్కోపర్, మలాబార్ హిల్, జుహు, దక్షిణ మధ్య ముంబైలో విరాళాల సేకరణకు మంచి స్పందన వచ్చినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్నేతలు, కార్యకర్తలు కూడా తమ పరిధిలో విరాళాలు సేకరిస్తున ్నట్లు ఆయన పేర్కొన్నారు.
ముంబైలోని మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక నెల పెన్షన్ను విరాళంగా ప్రకటిస్తారని, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఒక నెల జీతాన్ని ఇస్తారని ఆయన తెలిపారు. నేపాల్ బాధితులకు ఎమ్మార్సీసీ సభ్యులు ఒక్కొక్కరు రూ. పదివేలు విరాళంగా ఇస్తున్నారని ఆయన వెల్లడించారు. ఇంకా ఎంతో మంది దుస్తులు దానం చేసేందుకు ముందుకు వస్తున్నారని, అయితే డబ్బు సేకరించే పనిలో ప్రస్తుతం నిమగ్నం అయినట్లు ఆయన చెప్పారు. ‘మాకు అందిన సమాచారం ప్రకారం నేపాల్ బాధితులకు దుప్పట్లు, మందుల అవసరం ఎక్కువగా ఉంది. మేం వాటినే సరఫరా చేయాలనుకుంటున్నాం. సహాయాన్ని ఎలా పంపించాలనే విషయంపై ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)తో చర్చిస్తాం’ అని ఆయన చెప్పారు.