వ్యవసాయ రుణాలు 30 వేల కోట్లు?
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది వ్యవసాయ రుణాలు రూ.30 వేల కోట్లకు పైగా నిర్ధారిస్తూ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) నిర్ణయించినట్లు తెలిసింది. అందులో పంటరుణాలు రూ. 23 వేల కోట్లు, దీర్ఘకాలిక వ్యవసాయ, అనుబంధ రుణాలు రూ.7 వేల కోట్లు ఉండొచ్చని బ్యాంకు వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు ఎస్ఎల్బీసీ ప్రత్యేక సమావేశం మంగళవారం సచివాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర రుణ పరపతి ప్రణాళికను విడుదల చేయనున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉండగా ఆయన పాల్గొనడం లేదు. వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి తదితరులు హాజరుకానున్నారు. 2015-16 సంవత్సరానికి వ్యవసాయ రుణాలు రూ.35,179 కోట్లు అంచనా వేస్తూ నాబార్డు ప్రతిపాదనలు తయారుచేసింది.
అందులో పంట రుణాలు రూ.25,779 కోట్లు, దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు రూ.9,400 కోట్లు ఉండాలని విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు జిల్లా స్థాయిలో నిర్ణయాలు తీసుకొని బ్యాంకర్లకు అందజేయాలని ఆదేశించింది. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీలు సమావేశమై వ్యవసాయ రుణాలపై ప్రతిపాదనలు పంపాయి. నాబార్డు పంపిన ప్రతిపాదనల కంటే తక్కువ వ్యవసాయ రుణ ప్రణాళికను జిల్లా కలెక్టర్లు నివేదించడం విశేషం.