ఉత్పత్తి ఊహించనంత
డిమాండ్ కన్నా లభ్యత డబుల్
- 2022 నాటికి రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి..
- లభ్యత 20,359 మెగావాట్లు.. డిమాండ్ 11,967 మెగావాట్లే..
- థర్మల్ విద్యుత్ పూర్తిగా బ్యాకింగ్ డౌన్
- పునరుత్పాదక విద్యుత్ సరఫరా.. రాష్ట్ర విద్యుత్ రంగంపై నీతి ఆయోగ్
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్ర విద్యుదుత్పత్తి సామర్థ్యంతో పోలిస్తే డిమాండ్ చాలా తక్కువగా ఉండనుంది. 2021–22 నాటికి రాష్ట్ర గరిష్ట విద్యుత్ డిమాండ్ 11,967 మెగావాట్లకు చేరుతుంది. అయితే విద్యుదుత్పత్తి ప్లాంట్ల స్థాపిత సామర్థ్యం మాత్రం దానికి రెట్టింపుగా 20,359 మెగావాట్లకు చేరుకోనుంది. దీంతో థర్మల్ విద్యుదుత్పత్తిని బ్యాకింగ్ డౌన్ చేసి పునరుత్పాదక విద్యుత్‌తో రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చాల్సిన విచిత్ర పరిస్థితి ఉత్పన్నం కానుంది’అని నీతిఆయోగ్ పేర్కొంది.
2022 నాటికి రాష్ట్ర విద్యుదుత్పత్తి స్థాపిత సామర్థ్యం 20,359 మెగావాట్లకు పెరగనుండగా, అందులో థర్మల్ విద్యుత్ 10,797 మెగావాట్లు, జల విద్యుత్ 2,916 మెగావాట్లు, సౌర విద్యుత్ 4,457 మెగావాట్లు, పవన విద్యుత్ 2,000 మెగావాట్లు, ఇతర విద్యుత్ 189 మెగావాట్ల వాటాలుంటాయని తెలిపింది. రాష్ట్రంలో దాదాపు 9 శాతం మిగులు విద్యుత్ ఉండనుందని పేర్కొంది. రాష్ట్ర విద్యుత్ రంగంపై తాజాగా రూపొందించిన రాష్ట్ర కార్యాచరణ ప్రణాళిక–2022లో నీతి ఆయోగ్ ఈ కీలక విషయాలను పొందుపరిచింది.
2 లక్షల మిలియన్ యూనిట్ల డిమాండ్ దిశగా..
మరో 15 ఏళ్ల తర్వాత రాష్ట్ర వార్షిక విద్యుత్ అవసరాలు 1,99,731 మిలియన్ యూనిట్ల (ఎంయూ)కు పెరగనున్నాయి. రోజువారీ విద్యుత్ డిమాండ్ కూడా సగటున 28,752 మెగావాట్లకు పెరగనుంది.
పునరుత్పాదక విద్యుత్‌కు భవిష్యత్తు..
రాష్ట్ర విద్యుదుత్పత్తి సామర్థ్యంలో పునరుత్పాదక విద్యుత్ వాటా 2029–30 సంవత్సరంలో 27.32 శాతానికి పెరగనుంది. పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం 14,748 మెగావాట్లకు పెరగనుండగా, సౌర విద్యుత్ ప్లాంట్లు 12,558 మెగావాట్లు, సౌరేతర విద్యుత్ ప్లాంట్లు 2,190 మెగావాట్లు ఉండనున్నాయి. మొత్తం 24,636 ఎంయూల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి కానుండగా, అందులో 20,902 ఎంయూల సౌర విద్యుత్, 4,029 ఎంయూల ఇతర పునరుత్పాదక విద్యుత్ ఉండనుంది.
నీతి ఆయోగ్ నివేదికలోని ఇతర ప్రధానాంశాలు..
► మరో రెండేళ్లలో 2,500 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం అందుబాటులోకి రానుంది. అందులో అధిక భాగం సౌర విద్యుత్ ప్లాంట్లే..
► ఈ ఏడాది 300 మెగావాట్ల పవన విద్యు త్ ప్లాంట్లు ఉత్పత్తి ప్రారంభించనున్నాయి.
► సంప్రదాయ వ్యవసాయ విద్యుత్ పంపుసెట్ల స్థానంలో సౌర విద్యుత్ పంపు సెట్ల ఏర్పాటు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇప్పటి వరకు 70 వేల సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేసింది.
► రానున్న సంవత్సరాల్లో ఎన్టీపీసీ దశల వారీగా రాష్ట్రంలో 1,600 మెగావాట్లు, 2,400 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్లను నిర్మించనుంది.
► 2018 ముగిసేలోగా రాష్ట్ర విద్యుదుత్పత్తి సామర్థ్యం 25,000 మెగావాట్లకు పెరగనుంది.