‘పర్యావరణ మిత్ర’ పాఠశాలలకు అవార్డు ప్రదానం
భానుగుడి(కాకినాడ), న్యూస్‌లైన్ : కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర సర్వశిక్షా అభియాన్, రాష్ట్ర పర్యావరణ విద్యాశాఖ సహకారంతో జరిగిన రాష్ట్రస్థాయి పర్యావరణ మిత్ర అవార్డుల పోటీలలో 2012-13కు కాజులూరు మండలం శీలలంక పాఠశాల, 2013-14 విద్యాసంవత్సరానికి తుని మండలం ఎన్.సూరవరం జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలను అవార్డులను వరించాయి. ఈ పథకంలో ఏటా ప్రతి జిల్లా నుంచి ఒక పాఠశాలను ఎంపిక చేసి ఆర్సిలర్ మిట్టల్ (లక్ష్మీ శ్రీనివాస్మిట్టల్) సహకారంతో అవార్డును ప్రదానం చేస్తున్నారు.
నీటి సంరక్షణ, వ్యర్థాలను రీసైక్లింగ్ ప్రాసెస్ చేసి వాడడం, శక్తి వనరులను సంరక్షించడం, తక్కువ స్థాయిలో వాడడం, మొక్కలు పెంచడం, పండగలను విద్యార్థులకు పరిచయం చేసి సంస్కృతి, సంప్రదాయాల మీద అవగాహన కల్పిం చడం వంటి ఐదు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఏడాదికి జిల్లాకు ఒక పాఠశాలను ఎంపిక చేసి, పాఠశాలలో ఉత్సాహంగా పనిచేసిన ఉపాధ్యాయులను సత్కరిస్తారు. ఆమేరకు శనివారం హైదరాబాద్‌లో సర్వశిక్షాఅభియాన్ రాష్ట్రకార్యాలయంలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో సర్వశిక్షాఅభియాన్ రాష్ట్రప్రాజెక్టు అధికారి వి. ఉషారాణి, రాష్ట్ర పర్యావరణ విద్యాకేంద్రం నిర్వహణాధికారి ఇందిరాప్రకాష్ అవార్డుల ను ప్రదానం చేశారు.
గ్రామస్తులను చైతన్యపరచిన కాజులూరు మండలం శీలలంక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పర్వతిన వెంకటనారాయణ, తుని మండలం ఎన్.సూరవరం జెడ్పీ హైస్కూల్ విద్యార్థులను పర్యావరణం వైపు నడిపించిన హెచ్ఎం కోటిపర్తి దాలినాయుడు ‘ పర్యావరణ మిత్ర’ అవార్డును, రూ. పదివేల నగదును అందుకున్నారు. వారిని డీఈఓ కేవీ శ్రీనివాసులురెడ్డి, ఎస్ఎస్ఎ పీఓ వెన్నపు చక్రధరరావు, నేషనల్ గ్రీన్ కోర్ జిల్లా కన్వీనర్ సత్తి వెంకటరెడ్డి
అభినందించారు.