బీజేపీ పీఠానికి పోటీ
- రంగంలో న లుగురు నేతలు
- ఢిల్లీలో రాయబారాలు
- 9వ తేదీలోగా ఖరారు
చెన్నై, సాక్షి ప్రతినిధి: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్ష స్థానానికి గతంలో ఎన్నడూ లేని విధంగా పోటీ నెలకొంది. రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు తమదైన శైలిలో రాజకీయం నెరపుతున్నారు. ఏడాది క్రితం వరకు రాష్ట్రంలో బీజేపీ ఒక నామమాత్రపు జాతీయ పార్టీ. ఢిల్లీ నేతలు చెన్నైకి చేరుకున్నపుడు అడపాదడపా మినహా ఎన్నడూ తగిన ప్రాధాన్యత లేని పార్టీ. రాష్ట్ర అధ్యక్షుని స్థానం నుంచి సాధారణ కార్యక ర్తలు దొరికేదే కష్టం. గత ఏడాది రాష్ట్రంలో న రేంద్రమోడీ సుడిగాలి పర్యటనలు సాగించడం ద్వారా పార్టీ చరిష్మానే మార్చివేశారు.
తమిళ ప్రజలను పెద్ద సంఖ్యలో పార్టీవైపు తిప్పుకోగలిగారు. ఇందుకు కొనసాగింపు అన్నట్లుగా కేంద్రంలో బీజేపీ ఒంటరిగా అధికారంలోకి రావడంతో ఇప్పుడు సీను మారింది. అన్ని స్థానాలకు గిరాకీ ఏర్పడింది. పార్టీ పదవులకు గట్టి పోటీ ఏర్పడింది. కేంద్రంలో తమ ప్రభుత్వమేనని గర్వంగా చెప్పుకునే నేతలంతా రాష్ట్ర స్థాయి పార్టీ పదవులకు పోటీ పడుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ కేంద్ర మంత్రిగా మారడంతో ఆయన స్థానంలో అమిత్‌షా అధ్యక్షులయ్యూరు.
రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ కన్యాకుమారి నుంచి ఎంపీగా ఎన్నికై కేంద్రమంత్రి వర్గంలో చోటు దక్కించుకోవడంతో ఇక్కడ ఖాళీ ఏర్పడింది. బీజేపీ సిద్ధాంతాల ప్రకారం ఒక వ్యక్తికి ఒకే పదవి ప్రాతిపదికన పొన్ రాధాకృష్ణన్‌కు వారసుడిని ఎంపిక చేయాల్సిన అవసరం ఏర్పడింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కావస్తుండగా ఇంతవరకు రాష్ట్ర అధ్యక్షుడు ఎవరనేది తేలలేదు. పార్టీ సీనియర్ నేత ఇల గణేషన్ పేరును ప్రతిపాదించగా ఆయన సున్నితంగా తిరస్కరించారు. కేంద్రం మంత్రి పదవి లేదా గవర్నర్ గిరిని ఆయన ఆశిస్తున్నారు. ఇల గణేషన్ అంగీకరించి ఉంటే అధ్యక్ష పదవి ఏకగ్రీవమయ్యేది. ఆయన కాదు అన్న తరువాత అనేకమంది పోటీకి ముందుకు వచ్చారు.
పార్టీ సీనియర్ నేత హెచ్ రాజా, జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సీపీ రాధాకృష్ణన్, నిర్వాహక ప్రధాన కార్యదర్శి మోహన్‌రాజ్ తదితరులు గట్టిగా పోటీపడుతున్నారు. వీరిలో రాజా, తమిళిసైలు పార్టీ అధిష్టానం దృష్టిలో ముందంజలో ఉన్నారు. ఢిల్లీలోని బీజేపీ పెద్దల వద్ద తమకున్న పలుకుబడిని ప్రయోగించి ఎలాగైన రాష్ట్ర పీఠం దక్కించుకోవాలని ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
తమిళనాడుతోపాటూ ఉత్తరప్రదేశ్, అసోం రాష్ట్రాలకు అధ్యక్షుల నియామకంపై ఢిల్లీలో కసరత్తు జరుగుతుండగా, హెచ్ రాజా శుక్రవారం ఢిల్లీ పయనం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్తోపాటూ ఇతర పార్టీ పెద్దల దృష్టిలో తమిళిసైకు కూడా మంచి పేరుంది. దీంతో ఆమె చెన్నై నుంచి చక్రం తిప్పుతున్నారు. ఈనెల 9 వ తేదీలోగా రాష్ట్ర అధ్యక్షుని పేరును ప్రకటించే అవకాశం ఉండటంతో ప్రయత్నాలు ముమ్మరమయ్యూరు.