State Road Transport Department
-
రవాణా కార్యాలయం ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి
ములుగు: ములుగు జిల్లా ఏర్పడి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇన్ని రోజులు వాహన రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్స్‌ల విషయంలో ఇప్పటి వరకు ఉమ్మడి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మీదనే ఆధార పడాల్సి వచ్చింది. వాహనదారులకు ఆ కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. జిల్లాకు ప్రత్యేక కోడ్ టీఎస్ 37ను కేటాయిస్తూ రాష్ట్ర రవాణా శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లా కేంద్రంలో కార్యాలయ ఏర్పాటుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇందులో భాగంగా రంగరావుపల్లి సమీపంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఆవరణలో భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. రంగులు అద్ది ముస్తాబు చేశారు. భవనం ముందున్న సుమారు రెండెకరాల ఖాళీ స్థలంలో మట్టిపోసి రోలర్‌తో చదును చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు పూర్తి అయిన తరువాత రాష్ట్ర రవాణా శాఖ, కలెక్టర్ ఆదేశాలతో ఈ నెల చివరి వారంలో ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. స్థానికులకు ఉపాధి రవాణా శాఖ కార్యాలయ ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగనున్నాయి. ఇప్పటికే లిటిల్ ఫ్లవర్ స్కూల్ చుట్టపక్కల అద్దె గదులను వ్యాపారులు వెతుకుతున్నారు. సరైన భవనాలు లేని పక్షంలో డబ్బాలను ఏర్పాటు చేసుకొని ఆన్లైన్ చేసేందుకు చదువుకున్న యువత మొగ్గు చూపుతున్నారు. భూపాలపల్లి నుంచి సిబ్బంది కేటాయింప ములుగు జిల్లాలో ఏర్పాటు కానున్న ఆర్టీఓ కార్యాలయానికి ఇప్పటి వరకు మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్గా శ్రీనివాస్ మాత్రమే పూర్తి బాధ్యతల్లో ఉన్నారు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న విద్యావంతులు, కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియ పూర్తి కాలేదు. తాత్కాలికంగా ప్రస్తుతం భూపాలపల్లిలో నిర్వహిస్తున్న రవాణా శాఖ కార్యాలయం నుంచి సిబ్బందిని కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా బండారుపల్లి సమీపంలో రవాణా శాఖకు కలెక్టర్ రెండు ఎకరాల భూమిని కేటాయించారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. భవన నిర్మాణ పనులు పూర్తి అయ్యేంత వరకు తాత్కాలిక భవనంలో కొనసాగనున్నాయి. తగ్గనున్న దూరభారం.. పెరగనున్న ఆదాయం జిల్లాలోని చిట్టచివరిగా ఉన్న మంగపేట, వాజేడు, వెంకటాపురం(కె), కన్నాయిగూడెం మండలాల వాహనదారులు వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్‌లకు భూపాలపల్లికి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. జిల్లాకు ప్రత్యేక రవాణా శాఖ కార్యాలయం కేటాయించడంతో సుమారు 150 నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారికి ఉపయోగకరంగా మారనుంది. దూరభారం భారీగా తగ్గనుంది. సుధీర్ఘ ప్రయాణం చేయలేక చాలా మంది ఇప్పటి వరకు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోలేని వారంతా ప్రస్తుతం జిల్లా కేంద్రానికి వచ్చి తీసుకోవచ్చు. కార్యాలయం ప్రారంభమైతే వాహనాదారులు లైసెన్స్‌ల కోసం క్యూ కట్టనున్నారు. ఇదే సమయంలో స్లాట్ బుకింగ్, డ్రైవింగ్ లైసెన్స్‌లకు వచ్చే ఆదాయం భారీగా పెరుగనుంది. జిల్లా కేంద్రంలో కార్యాలయం ఏర్పాటు అవుతుందని తెలిసి వాహనదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం.. జిల్లా కేంద్రంలో కార్యాలయం ఏర్పాటుకు ఆదేశాలు వచ్చాయి. జిల్లాకు టీఎస్ 37 కోడ్‌ను కేటాయించారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు మిగిలి ఉన్నాయి. రెండు లేదా మూడు రోజుల్లో సామగ్రి వస్తుంది. పనులు పూర్తి అయ్యాక ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కార్యాలయాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అధికారిక భవనం పూర్తి అయ్యేంత వరకు తాత్కాలికంగా లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ పక్కన అద్దె భవనంలో కార్యాలయాన్ని కొనసాగిస్తాం. – శ్రీనివాస్, జిల్లా రవాణా శాఖ అధికారి -
అజాగ్రత్త.. అతి వేగం
రక్తమోడుతున్న రహదారులు జబ్బార్ ట్రావెల్స్ - 46 మంది సజీవదహనం నేషనల్ ట్రావెల్స్ - ఏడుగురు సజీవ దహనం ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ - ఆరుగురు సజీవ దహనం బెల్గాం జిల్లా హల్కీ క్రాస్ - వాహనం బోల్తా 22 మంది దుర్మరణం బెల్గాం జిల్లా బైలహొంగళ క్రాస్ - వాహనం బోల్తా ఐదుగురు దుర్మరణం మొదటి మూడు ఘటనల్లో ‘వేగం’ మృత్యుపాశం కాగా, తర్వాతి రెండు ఘటనల్లో ‘గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించడం’ ప్రయాణికుల పాలిట మరణశాసనం అవుతోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే రాష్ట్రంలో సగటున రోజుకు 115 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. బెంగళూరు : అతివేగం... అజాగ్రత్త వల్ల రాష్ట్రంలోని రహదారులు రక్తమోడుతున్నాయి. ఇప్పటి వరకూ చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో 55 శాతం అతి వేగం వల్లనే జరిగాయని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ పరిశోధనల్లో తేలింది. మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్‌లోని మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద చోటు చేసుకున్న ఘోర దుర్ఘటన మొదలు తాజాగా హిరియూర్ వద్ద జరిగిన ప్రమాదం వరకూ పరిశీలిస్తే ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. సీట్లు భర్తీ చేసుకునేందుకు నిర్ణీత సమయం కన్నా గంట ఆలస్యంగా ప్రైవేట్ బస్సులు తామున్న ప్రాంతం నుంచి బయలుదేరుతాయి. అయితే ముందుగానే నిర్ణయించిన సమయానికి లక్ష్యాన్ని చేరుకోవాలన్న తొందరలో పరిమితికి మించి వేగంతో వాహనాన్ని డ్రైవర్లు ముందుకు దూకిస్తున్నారు. ఈ వేగమే ప్రయాణికుల పాలిట మృత్యువవుతోంది. అదే సమయంలో డ్రైవర్లు మద్యం మత్తులో ఉండడం కూడా ప్రమాదాలకు కారణమని మరింత లోతైన పరిశోధనల్లో వెలుగు చూస్తోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ జరిగిన మొత్తం ప్రమాదాల్లో మద్యం వల్ల జరిగినవి 30 శాతంగా వెల్లడయింది. ఇలాంటి పరిస్థితి ఎక్కువగా కార్లు, టెంపో ట్రావెల్స్ వల్ల చోటు చేసుకుంటున్నట్లు రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. వాహనాల కొరత.. తక్కువ చార్జీలు ప్రయాణికుల సంఖ్యకు సరిపడ బస్సులను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ రంగ సంస్థ కేఎస్ఆర్టీసీ విఫలమైంది. దీనికి తోడు కేఎస్ఆర్టీసీ బస్సు చార్జీలతో పోలిస్తే ప్రైవేట్ ఆటోలు, టెంపోలలో పది శాతం తక్కువగా వసూలు చేస్తున్నారు. దీంతో చాలా మంది ప్రైవేట్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితి ఎక్కువగా రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతంగా పేర్కొనబడిన ‘హైదరాబాద్-కర్ణాటక’ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతానికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉపాధి కోసం పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రకు వలస పోతుంటారు. ఈ వలసలు సాధారణంగా రాత్రి సమయంలో సాగుతుంటాయి. ఆ సమయంలో కేఎస్ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండటం లేదు. దీంతో ఈ ప్రాంత ప్రజలు ఎక్కువగా టెంపోట్రావెల్స్, ఆటోలను ఆశ్రయిస్తుంటారు. కాసులకు కక్కుర్తి పడుతున్న ప్రైవేటు యాజమాన్యం వాహనం సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కిస్తోంది. అదే సమయంలో తక్కవ వేతనానికి వస్తున్నారనే మిషతో అప్పుడప్పుడే డ్రైవింగ్ నేర్చుకున్న వారిని ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో హై-క అందులోనూ బెల్గాం జిల్లాలో ై‘బెలహొంగళ’ ఘటనలు తరుచుగా జరుగుతున్నాయి. తీరు మారని రవాణాశాఖ రాష్ట్రంలో ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటునే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో మరణాల సంఖ్యకు రెట్టింపుగా ప్రయాణికులు వైకల్యం బారిన పడుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్రవాహనాలది మొదటి స్థానంలో ఉండగా బస్సులు, టెంపోట్రావెల్స్, ఆటోలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇందుకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఏడాది అక్టోబర్ నుంచి తాజా ఘటన వరకూ నిశితంగా పరిశీలిస్తే రాష్ట్రంలో ప్రైవేటు వాహన యజమానులు ఆడిందే ఆట పాడిందే పాటగా తయారవుతోంది. వాహనాల్లో రసాయనాలు, రంగుల డబ్బాలు వంటివి తీసుకువెళ్లకూడదనే నిబంధనలను ప్రైవేటు యాజమాన్యం పూర్తిగా పెడచెవినపెట్టింది. దీంతో ఏసీ బస్సులు ప్రమాదానికి గురైన క్షణాల్లోనే వాహనం మొత్తం తగలబడుతోంది. దీంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంటోందని తెలుస్తోంది. మరోవైపు టూరిస్టు వాహనాలుగా అనుమతి పొంది ప్రైవేటు వాహనాలు నిరంతరాయంగా స్టేజ్ క్యారియర్లుగా పనిచేస్తున్నాయి. మరోవైపు వాహనాల్లో ప్రయాణించే వారి పూర్తి వివరాలు ఏమాత్రం ఉండటం లేదు. అందువల్లే ప్రమాదాలు జరిగినప్పుడు బాధితుడు ఏ ప్రాంతం వారు, ఎక్కడికి వెళ్లాల్సి ఉంది తదితర విషయాలు తెలియడం లేదు. ఈ విషయాలన్నీ తెలిసినా కూడా ప్రభుత్వ అధికారులు సంఘటనలు జరిగినప్పుడు హడావుడిగా దాడులు చేసి కేసులు నమోదు చేసి చేతులు దులుపుకోవడం తప్ప అక్రమార్కుల పై కఠిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.