అజాగ్రత్త.. అతి వేగం
రక్తమోడుతున్న రహదారులు
జబ్బార్ ట్రావెల్స్ - 46 మంది సజీవదహనం
నేషనల్ ట్రావెల్స్ - ఏడుగురు సజీవ దహనం
ఎస్‌ఆర్‌ఎస్ ట్రావెల్స్ - ఆరుగురు సజీవ దహనం
బెల్గాం జిల్లా హల్కీ క్రాస్ - వాహనం బోల్తా 22 మంది దుర్మరణం
బెల్గాం జిల్లా బైలహొంగళ క్రాస్ - వాహనం బోల్తా ఐదుగురు దుర్మరణం
మొదటి మూడు ఘటనల్లో ‘వేగం’ మృత్యుపాశం కాగా, తర్వాతి రెండు ఘటనల్లో ‘గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించడం’ ప్రయాణికుల పాలిట మరణశాసనం అవుతోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే రాష్ట్రంలో సగటున రోజుకు 115 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
బెంగళూరు :
అతివేగం... అజాగ్రత్త వల్ల రాష్ట్రంలోని రహదారులు రక్తమోడుతున్నాయి. ఇప్పటి వరకూ చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో 55 శాతం అతి వేగం వల్లనే జరిగాయని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ పరిశోధనల్లో తేలింది. మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్‌లోని మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద చోటు చేసుకున్న ఘోర దుర్ఘటన మొదలు తాజాగా హిరియూర్ వద్ద జరిగిన ప్రమాదం వరకూ పరిశీలిస్తే ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. సీట్లు భర్తీ చేసుకునేందుకు నిర్ణీత సమయం కన్నా గంట ఆలస్యంగా ప్రైవేట్ బస్సులు తామున్న ప్రాంతం నుంచి బయలుదేరుతాయి. అయితే ముందుగానే నిర్ణయించిన సమయానికి లక్ష్యాన్ని చేరుకోవాలన్న తొందరలో పరిమితికి మించి వేగంతో వాహనాన్ని డ్రైవర్లు ముందుకు దూకిస్తున్నారు.
ఈ వేగమే ప్రయాణికుల పాలిట మృత్యువవుతోంది. అదే సమయంలో డ్రైవర్లు మద్యం మత్తులో ఉండడం కూడా ప్రమాదాలకు కారణమని మరింత లోతైన పరిశోధనల్లో వెలుగు చూస్తోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ జరిగిన మొత్తం ప్రమాదాల్లో మద్యం వల్ల జరిగినవి 30 శాతంగా వెల్లడయింది. ఇలాంటి పరిస్థితి ఎక్కువగా కార్లు, టెంపో ట్రావెల్స్ వల్ల చోటు చేసుకుంటున్నట్లు రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
వాహనాల కొరత.. తక్కువ చార్జీలు
ప్రయాణికుల సంఖ్యకు సరిపడ బస్సులను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ రంగ సంస్థ కేఎస్‌ఆర్‌టీసీ విఫలమైంది. దీనికి తోడు కేఎస్‌ఆర్‌టీసీ బస్సు చార్జీలతో పోలిస్తే ప్రైవేట్ ఆటోలు, టెంపోలలో పది శాతం తక్కువగా వసూలు చేస్తున్నారు. దీంతో చాలా మంది ప్రైవేట్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితి ఎక్కువగా రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతంగా పేర్కొనబడిన ‘హైదరాబాద్-కర్ణాటక’ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతానికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉపాధి కోసం పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రకు వలస పోతుంటారు. ఈ వలసలు సాధారణంగా రాత్రి సమయంలో సాగుతుంటాయి. ఆ సమయంలో కేఎస్‌ఆర్‌టీసీ బస్సులు అందుబాటులో ఉండటం లేదు. దీంతో ఈ ప్రాంత ప్రజలు ఎక్కువగా టెంపోట్రావెల్స్, ఆటోలను ఆశ్రయిస్తుంటారు. కాసులకు కక్కుర్తి పడుతున్న ప్రైవేటు యాజమాన్యం వాహనం సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కిస్తోంది. అదే సమయంలో తక్కవ వేతనానికి వస్తున్నారనే మిషతో అప్పుడప్పుడే డ్రైవింగ్ నేర్చుకున్న వారిని ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో హై-క అందులోనూ బెల్గాం జిల్లాలో ై‘బెలహొంగళ’ ఘటనలు తరుచుగా జరుగుతున్నాయి.
తీరు మారని రవాణాశాఖ
రాష్ట్రంలో ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటునే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో మరణాల సంఖ్యకు రెట్టింపుగా ప్రయాణికులు వైకల్యం బారిన పడుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్రవాహనాలది మొదటి స్థానంలో ఉండగా బస్సులు, టెంపోట్రావెల్స్, ఆటోలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇందుకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఏడాది అక్టోబర్ నుంచి తాజా ఘటన వరకూ నిశితంగా పరిశీలిస్తే రాష్ట్రంలో ప్రైవేటు వాహన యజమానులు ఆడిందే ఆట పాడిందే పాటగా తయారవుతోంది. వాహనాల్లో రసాయనాలు, రంగుల డబ్బాలు వంటివి తీసుకువెళ్లకూడదనే నిబంధనలను ప్రైవేటు యాజమాన్యం పూర్తిగా పెడచెవినపెట్టింది. దీంతో ఏసీ బస్సులు ప్రమాదానికి గురైన క్షణాల్లోనే వాహనం మొత్తం తగలబడుతోంది.
దీంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంటోందని తెలుస్తోంది. మరోవైపు టూరిస్టు వాహనాలుగా అనుమతి పొంది ప్రైవేటు వాహనాలు నిరంతరాయంగా స్టేజ్ క్యారియర్లుగా పనిచేస్తున్నాయి. మరోవైపు వాహనాల్లో ప్రయాణించే వారి పూర్తి వివరాలు ఏమాత్రం ఉండటం లేదు. అందువల్లే ప్రమాదాలు జరిగినప్పుడు బాధితుడు ఏ ప్రాంతం వారు, ఎక్కడికి వెళ్లాల్సి ఉంది తదితర విషయాలు తెలియడం లేదు. ఈ విషయాలన్నీ తెలిసినా కూడా ప్రభుత్వ అధికారులు సంఘటనలు జరిగినప్పుడు హడావుడిగా దాడులు చేసి కేసులు నమోదు చేసి చేతులు దులుపుకోవడం తప్ప అక్రమార్కుల పై కఠిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.