state tourism development department
-
దాల్ సరస్సులా గోదారి
సాక్షి, హైదరాబాద్: ‘శ్రీనగర్‌లోని దాల్ సరస్సును చూడగానే ముందుగా ఆకట్టుకునేవి గట్టున పొడవుగా ఉండే చెట్లు. మంచు కురిసే వాతావరణంలో సుందరంగా ఉండే సరస్సు అందాన్ని ఆ చెట్లు రెట్టింపు చేస్తాయి. ఇప్పుడు అదే తరహా ఎత్తయిన చెట్లను గోదావరి తీరం వెంట పెంచాలి’అని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధిపై ప్రగతి భవన్లో శనివారం సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజీల వల్ల వందల కిలోమీటర్ల మేర గోదావరి నదిలో నిత్యం జలకళ ఉట్టి పడుతుంది. ఏడాది పొడవునా నదుల్లో, కాల్వల్లో నీరు నిల్వ ఉంటుంది. నదికి ఇరు వైపులా దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. నదికి ఇరు వైపులా దాల్ సరస్సులా ఉండే తరహాలో ఆకర్షణీయమైన చెట్లు పెంచవచ్చు. నదిలో బోటింగుకు అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలు, రిజర్వాయర్లు, పంపుహౌస్‌ల వద్ద కావాల్సినంత స్థలం ప్రభుత్వ అధీనంలోనే ఉంది. అక్కడ బృందావన్ గార్డెన్ లాంటి మ్యూజికల్ ఫౌంటెయిన్లు, వాటర్ పార్కులు ఏర్పాటు చేయవచ్చు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకానికి అనువైన ప్రాంతాలను ఎంపిక చేసి పర్యాటక కేంద్రాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి’అని సీఎం పేర్కొన్నారు. అనేక పుణ్యక్షేత్రాలు.. ‘కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు తుపాకులగూడెం, దుమ్ముగూడెం బ్యారేజీలు కూడా నిర్మితమవుతున్నాయి. వీటికి ఆనుకునే బాసర, ధర్మపురి, కాళేశ్వరం, గూడెం సత్యనారాయణస్వామి, కోటి లింగాల, పర్ణశాల, భద్రాచలం లాంటి పుణ్యక్షేత్రాలున్నాయి. రామగుండం, మంచిర్యాల తదితర ప్రాంతాల్లో బొగ్గు గనులున్నాయి. ఓపెన్ కాస్ట్, అండర్ గ్రౌండుల్లో బొగ్గు ఉత్పత్తి ఎలా అవుతుందో, పంపుహౌస్‌ల పనితీరు ఎలా ఉంటుందో పర్యాటకులకు చూపించే వీలుంటుంది. రామగుండం, జైపూర్‌లో విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను కూడా సందర్శనీయ ప్రాంతాలుగా తీర్చిదిద్దవచ్చు. వీటిని దృష్టిలో ఉంచుకుని పర్యాటక కేంద్రాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి’అని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమావేశానికి ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, కార్యదర్శి స్మితా సబర్వాల్, ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్, కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 7న మేడారానికి సీఎం కేసీఆర్ ఈనెల 5 నుంచి ప్రారంభమయ్యే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 7న వెళ్లనున్నారు. జాతర తొలి రోజు సారలమ్మ గద్దెకు రానుండగా, ఆరో తేదీన సమ్మక్క గద్దెకు చేరుకుంటుంది. జాతర చివరి రోజు 8వ తేదీన సమ్మక్క, సారలమ్మలు తిరిగి వనప్రవేశం చేస్తారు. ఈ నెల 7న భక్తులు పెద్ద సంఖ్యలో సమ్మక్క, సారలమ్మ దర్శనం చేసుకుంటారు. అదేరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రత్యేక హెలీకాప్టర్‌లో మేడారం చేరుకుని మొక్కులు చెల్లించుకుంటారు. మన్యంకొండ బ్రహ్మోత్సవాల ఆహ్వానం తెలంగాణ తిరుపతిగా పేరొందిన మహబూబ్‌నగర్ జిల్లా మన్యంకొండ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి ఆహ్వానిం చారు. ఫిబ్రవరి 4 నుంచి 13వరకు జరిగే బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రికను ఇద్దరు మంత్రులు శనివారం సీఎం కేసీఆర్‌కు అందజేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన్యంకొండ శ్రీలక్ష్మిసమేత వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాధాన్యతను వివరించారు. తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక నుంచి లక్షలాది మంది భక్తులు మన్యంకొండ దైవదర్శనానికి వస్తారని వివరించారు. ఆహ్వానపత్రం అందజేసిన వారిలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అళహరి మధుసూధన్ ఉన్నారు. -
108 అమ్మవారి ఆలయాల దర్శనం
ప్యారిస్ : రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ తరపున 108 అమ్మవారి ఆలయాల సందర్శన, ఒక రోజు శక్తి ఆలయాల సందర్శన, ఆడి నెల అమావాస్య సందర్శన వంటి మూడు విధాలైన పర్యాటక ఆలయాల సందర్శనకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏడాదిలో ఆడి నెల అమ్మవారికి ప్రీతి పాత్రమైనది. ఆ నెలంతా అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తుంటా రు. ఈ సందర్భంగా 108 అమ్మవారి ఆలయాల సందర్శన ప్యాకేజీ టూర్ ఆడి నెలలో ప్రతి సోమ, గురువారాల్లో ఉదయం ఆరు గంటలకు చెన్నై నుంచి బయలుదేరి రాష్ట్రం లో ఉన్న ప్రసిద్ధి చెందిన అమ్మవారి ఆలయాలను సందర్శించి ఐదు రోజుల తర్వాత తిరిగి చెన్నైకు చేరుతారు. ఆ రోజుల్లో వైదీశ్వరన్ ఆలయం, తంజావూరు, మదురై, తిరుచ్చి వంటి ప్రాంతాల్లో రాత్రి వేళల్లో బస ఏర్పాట్లు చేశారు. ఈ ప్యాకేజీ చార్జీగా ఒక వ్యక్తి రూ.4,950 (ఇద్దరు బస చేసే విధంగా గది లభ్యమవుతుంది), చిన్నారులకు రూ.4,350 (4 నుంచి 10 వయసు లోపు), ఒంటరి వ్యక్తులకు ప్రత్యేక సౌకర్యంతో*5,950 చార్జీగా వసూలు చేస్తారు. ఈ చార్జీ వాహన రాకపోకలకు, బసకు మాత్రమే అని నిర్వాహకులు వెల్లడించారు. ఒక రోజు శక్తి టెంపుల్ టూర్ ఒక రోజు శక్తి ఆలయాల సందర్శన ప్యాకేజీ కింద మాంగా డు, తిరువేర్కాడు, పూందమల్లి, తిరుముల్లైవాయల్, సెంబులివరం, పంజట్టి, మేలూర్, తిరువొత్తియూర్ వంటి చెన్నై నగర, శివారు ప్రాంతాల్లో ఉన్న అమ్మవారి ఆలయాలను సందర్శించే విధంగా ఏర్పాటు చేశారు. ఇందుకుగాను ఒక వ్యక్తికి సాధారణ బస్సు చార్జీగా రూ.470, ఏసీ బస్సు సౌకర్యంతో రూ.550గా నిర్ణయించారు. ఆడి అమావాస్య ప్యాకేజీ అమావాస్యలన్నింటిలో ఆడిలో వచ్చే అమావాస్యకు పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ రోజు పూర్వీకులకు పిండాలు పెట్టి తర్పణాలు అర్పిస్తే వారి ఆత్మకు శాంతి చేకూరి, వారి వంశస్తులకు మంచి చేకూరుతుందని హైందవుల అపార నమ్మకం. మూడు రోజులు ఆడి అమావాస్య ప్యాకేజీ టూర్ చెన్నై నుంచి ఈ నెల 24వ తేదీ సాయంత్రం 4 గంటలకు బయలుదేరి, తిరుభువనం, దేవిపట్నం, రామర్ పాదం, అనుమాన్ పాదం, రామేశ్వరంలోని అగ్ని తీర్థాలను సందర్శించి 27వ తేదీ ఉదయం చెన్నైకు చేరుకుంటుంది. వివరాలకు పర్యాటక శాఖ అధికారి, తమిళనాడు పర్యాటక అభివృద్ధి శాఖ, వాలాజా రోడ్డు చిరునామాలో కానీ లేక 044 - 25384444, 25383333 నంబర్లను సంప్రదించి తెలుసుకోవచ్చని నిర్వాహకులు వెల్లడించారు. -
ఆకాశంలో హరివిల్లు
న్యూఢిల్లీ: రాష్ట్ర పర్యాటక అభివృద్ధిశాఖ నిర్వహిస్తున్న ఢిల్లీ అంతర్జాతీయ పతంగుల ఉత్సవాన్ని రాష్ట్ర పర్యాటక, న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతి ఢిల్లీహాట్లో శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. మూడు రోజులపాటు నిర్వహించే ఉత్సవంలో రంగురంగుల భారీ పతంగులు కనువిందు చేస్తున్నాయి. ఈ సందర్భంగా మంత్రి భారతి స్వయంగా పతంగులు ఎగురవేశారు. ఆదివారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చాలా మంది స్థానికులు త్రివర్ణ పతంగులను నింగిలోకి పంపించారు. ఢిల్లీవాలాలు కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాజధానిలో చాలా ఏళ్లుగా పతంగుల ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా దేశవిదేశాల నుంచి పతంగుల నిపుణులు (కైట్ ఫ్లయర్స్) ఈ ఉత్సవానికి హాజరయ్యారు. అమెరికాకు చెందిన బార్బరా మీయర్, ఇంగ్లండ్‌కు చెందిన బాబ్, బీరట్‌కు చెందిన సమీ సాహెగ్స్, ఇండోనేషియావాసులు టింటన్, సారీ, దక్షిణ కొరియా నుంచి చో, ఫ్రాన్స్ నుంచి ఆంటోనియా వంటి కైట్ ఫ్లయర్లు ఈ ఉత్సవంలో భారీ పతంగులను ప్రదర్శిస్తున్నారు. వీటి హెక్సాజెన్, స్లెడ్, డెల్టా, బారొంగి వంటి పలు రకాల పతంగులు ఆకాశంలో విహరించనున్నాయి. కేరళ, చెన్నయ్, రాజ్‌కోట్, చండీగఢ్, అహ్మదాబాద్, మంగళూరు, త్రివేండ్రంతోపాటు ఢిల్లీకి చెం దిన కైట్ ఫ్లయర్లు కూడా ఈ ఉత్సవానికి వచ్చారు. సాధారణ గాలిపటాలతోపాటు రాత్రిపూట ప్రదర్శించే నైట్కైట్ ఫ్లయింగ్ మరో ఆకర్షణ. భారీ పతంగులకు ఎల్ఈడీ విద్యుత్ దీపాలను అమర్చి ఎగురవేస్తారు. ఒక్కో భారీ గాలిపటంలో 100 వరకు చిన్న పతంగులు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ పురాతన కళ గురించి వీక్షకులకు తెలియజేసేందుకు వేదిక వద్ద ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేశారు. టిష్యూ పేపర్, ఎలాస్టిక్ పేపర్, వెదురు, వస్త్రం తదితర వ స్తువులతో తయారు చేసిన భారీ పతంగుల వివరాలను ఇక్కడ తెలుసుకోవచ్చు. మూడు రోజులపాటు సాయంత్రం వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలూ ఉంటాయి. సాహిత్య కళాపరిషత్ కళాకారులు జానపద నృత్యాలు మరో ఆకర్షణ. మ్యాజిక్, పప్పెట్ షోలు, బయోస్కోప్, లాం గ్మన్ వంటివి కూడా వినోదం పంచనున్నాయి. పతంగుల తయారీ విధానం గురించి చిన్నారులకు ఇక్కడి నిపుణులు శిక్షణ కూడా ఇస్తున్నారు. దీనికితోడు బాలలకు శనివారం మధ్యాహ్నం పెయిం టింగ్ పోటీలు నిర్వహిస్తారు.