
సాక్షి, హైదరాబాద్: ‘శ్రీనగర్‌లోని దాల్ సరస్సును చూడగానే ముందుగా ఆకట్టుకునేవి గట్టున పొడవుగా ఉండే చెట్లు. మంచు కురిసే వాతావరణంలో సుందరంగా ఉండే సరస్సు అందాన్ని ఆ చెట్లు రెట్టింపు చేస్తాయి. ఇప్పుడు అదే తరహా ఎత్తయిన చెట్లను గోదావరి తీరం వెంట పెంచాలి’అని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధిపై ప్రగతి భవన్‌లో శనివారం సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజీల వల్ల వందల కిలోమీటర్ల మేర గోదావరి నదిలో నిత్యం జలకళ ఉట్టి పడుతుంది.
ఏడాది పొడవునా నదుల్లో, కాల్వల్లో నీరు నిల్వ ఉంటుంది. నదికి ఇరు వైపులా దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. నదికి ఇరు వైపులా దాల్ సరస్సులా ఉండే తరహాలో ఆకర్షణీయమైన చెట్లు పెంచవచ్చు. నదిలో బోటింగుకు అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలు, రిజర్వాయర్లు, పంపుహౌస్‌ల వద్ద కావాల్సినంత స్థలం ప్రభుత్వ అధీనంలోనే ఉంది. అక్కడ బృందావన్ గార్డెన్ లాంటి మ్యూజికల్ ఫౌంటెయిన్‌లు, వాటర్ పార్కులు ఏర్పాటు చేయవచ్చు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకానికి అనువైన ప్రాంతాలను ఎంపిక చేసి పర్యాటక కేంద్రాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి’అని సీఎం పేర్కొన్నారు.
అనేక పుణ్యక్షేత్రాలు..
‘కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు తుపాకులగూడెం, దుమ్ముగూడెం బ్యారేజీలు కూడా నిర్మితమవుతున్నాయి. వీటికి ఆనుకునే బాసర, ధర్మపురి, కాళేశ్వరం, గూడెం సత్యనారాయణస్వామి, కోటి లింగాల, పర్ణశాల, భద్రాచలం లాంటి పుణ్యక్షేత్రాలున్నాయి. రామగుండం, మంచిర్యాల తదితర ప్రాంతాల్లో బొగ్గు గనులున్నాయి. ఓపెన్ కాస్ట్, అండర్ గ్రౌండుల్లో బొగ్గు ఉత్పత్తి ఎలా అవుతుందో, పంపుహౌస్‌ల పనితీరు ఎలా ఉంటుందో పర్యాటకులకు చూపించే వీలుంటుంది. రామగుండం, జైపూర్‌లో విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను కూడా సందర్శనీయ ప్రాంతాలుగా తీర్చిదిద్దవచ్చు. వీటిని దృష్టిలో ఉంచుకుని పర్యాటక కేంద్రాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి’అని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమావేశానికి ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, కార్యదర్శి స్మితా సబర్వాల్, ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్, కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
7న మేడారానికి సీఎం కేసీఆర్
ఈనెల 5 నుంచి ప్రారంభమయ్యే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 7న వెళ్లనున్నారు. జాతర తొలి రోజు సారలమ్మ గద్దెకు రానుండగా, ఆరో తేదీన సమ్మక్క గద్దెకు చేరుకుంటుంది. జాతర చివరి రోజు 8వ తేదీన సమ్మక్క, సారలమ్మలు తిరిగి వనప్రవేశం చేస్తారు. ఈ నెల 7న భక్తులు పెద్ద సంఖ్యలో సమ్మక్క, సారలమ్మ దర్శనం చేసుకుంటారు. అదేరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రత్యేక హెలీకాప్టర్‌లో మేడారం చేరుకుని మొక్కులు చెల్లించుకుంటారు.
మన్యంకొండ బ్రహ్మోత్సవాల ఆహ్వానం
తెలంగాణ తిరుపతిగా పేరొందిన మహబూబ్‌నగర్ జిల్లా మన్యంకొండ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి ఆహ్వానిం చారు. ఫిబ్రవరి 4 నుంచి 13వరకు జరిగే బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రికను ఇద్దరు మంత్రులు శనివారం సీఎం కేసీఆర్‌కు అందజేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన్యంకొండ శ్రీలక్ష్మిసమేత వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాధాన్యతను వివరించారు. తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక నుంచి లక్షలాది మంది భక్తులు మన్యంకొండ దైవదర్శనానికి వస్తారని వివరించారు. ఆహ్వానపత్రం అందజేసిన వారిలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అళహరి మధుసూధన్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment