state wildlife board
-
‘జటాయువు’కు మోక్షమెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: ‘జటాయువు’ ప్రాజెక్టుకు మోక్షం దొరకడం లేదు. అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న రాబందుల సంరక్షణకు ఉద్దేశించిన ‘వల్చర్ శాంక్చరీ’ ఏర్పాటు అంశం కాగితాలకే పరిమితమైంది. మూడేళ్ల క్రితమే రాష్ట్ర వన్యప్రాణిబోర్డు సమావేశం ఆమోదం పొందినా ఈ ప్రతిపాదన ముందుకు కదలలేదు. వన్యప్రాణి బోర్డును పునర్వ్యవస్థీకరించాక ఇటీవల జరిగిన సమావేశంలోనూ ఈ ప్రతిపాదనపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అటవీ ప్రాంతం కాగజ్ డివిజన్లోని గిరెళ్లి, బెజ్జూరు, గూడెం ఫారెస్ట్ బ్లాక్‌లు, రెబ్బెన, కర్జెల్లి, బెజ్జూరు, పెంచికల్ పేట రేంజ్‌ల పరిధిలోని 39,800 హెక్టార్లలో ‘జటాయువు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం’గా ఏర్పాటు చేయాలని మూడేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అధికారులు పంపించారు. 2013లో బెజ్జూరు రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ పెంచికల్‌పేట రేంజ్‌లోని పాలరాపుగుట్టపై అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న లాంగ్ బిల్లుడ్ వల్చర్–పొడవు ముక్కు రాబందులు గూళ్లు కట్టుకోవడంతో పాటు సంతానోత్పత్తిని చేపడుతున్నట్టు గుర్తించారు. పులుల రాకపోకలతో పెరిగిన ప్రాధాన్యం కాగజ్‌నగర్ డివిజన్లోని టైగర్ కారిడార్‌లో మహారాష్ట్రలోని తడోబా ఇతర ప్రాంతాల నుంచి పులుల రాకపోకలు పెరిగాయి. వల్చర్ శాంక్చరీని కూడా ఏర్పాటు చేస్తే పులులు శాశ్వత ఆవాసంగా ఈ ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశాలు పెరుగుతాయని నిపుణుల అంచనా. ఈ ప్రాంతంలో శాంక్చరీని ఏర్పాటు చేస్తే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు పెరగడం వల్ల వన్యప్రాణుల సంరక్షణతో పాటు పర్యాటక రంగ ఆకర్షణగా టైగర్ సఫారీకి ఓ విడిదిగా ఆ ప్రాంతం మారే అవకాశాలున్నాయి. ఎంతో అనువైన ప్రాంతం.. కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలో పెద్ద వాగు, పెన్‌గంగా, ప్రాణహిత నదులను ఆనుకుని ఉండటం ఈ ప్రాజెక్టుకు కలసిరానుంది. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని పెద్దవాగు సంగమం వద్ద అంతరించిపోతున్న పొడవు ముక్కు (గిప్స్ ఇండికస్) రాబందులకు ఆవాసంగా మారడంతో శాంక్చరీ ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఏర్పడింది. అధికారుల ప్రాథమికంగా వేసిన లెక్కల ప్రకారం ఇక్కడ 20 పెద్దవి, ఏడాది వయసున్నవి 5, చిన్నవి 5.. మొత్తం 30 రాబందులు ఈ గుట్టలపై గూళ్లను ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించారు. అప్పటినుంచి ప్రత్యేకంగా ఓ బర్డ్ వల్చర్‌తో పాటు రాబందుల సంరక్షణ కోసం ఒక బృందం విధులు నిర్వహిస్తోంది. మహారాష్ట్రలోని కమలాపూర్ అటవీ ప్రాంతంలోనే ఈ రాబందులు ఎక్కువగా ఆహార సేకరణ చేస్తున్నాయి. మహారాష్ట్ర అటవీశాఖ చేపట్టిన సంరక్షణ చర్యలతో నాలుగైదు నెలలుగా ఎక్కువగా అటు వైపు వలస వెళ్తున్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మనవైపున్న ప్రాంతంలో ఎన్ని రాబందులు ఉన్నాయనే దానిపై అధికారులు కచ్చితమైన లెక్కలు చెప్పలేకపోతున్నారు. అయితే జఠాయువు ప్రాజెక్టు ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని, వల్చర్ శాంక్చరీ ప్రాజెక్టును ప్రభుత్వం తిరస్కరించనందున దానికి త్వరలోనే ఆమోదం లభిస్తుందనే ఆశాభావంతో అటవీశాఖ ఉన్నతాధికారులున్నారు. -
ఛనాకా–కొరట బ్యారేజీకి క్లియరెన్స్
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ తూర్పు, పశ్చిమ ప్రాంతాలకు సంబంధిం చిన ప్రాణహితలో భాగంగా చేపట్టిన తమ్మిడిహెట్టి బ్యారేజీ, ఛనాకా–కొరట బ్యారేజీ సాగునీటి ప్రాజెక్టులకు మహారాష్ట్ర వన్యప్రాణి బోర్డు క్లియరెన్స్‌లు ఇచ్చింది. నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు గత కొన్ని నెలలుగా మహారాష్ట్రతో జరుపుతున్న సంప్రదింపుల ఫలితంగా ఈ కీలక నిర్ణయం వెలువడింది. ఈ రెండు బ్యారేజీల వల్ల వన్యప్రాణులకు ఎలాంటి హాని ఉండదని మహారాష్ట్ర తెలిపింది. ఛనాకా–కొరట బ్యారేజీని పెన్‌గంగ నదిపై నిర్మిస్తున్నారు. 51 వేల ఎకరాలకు సాగు నీరందించే ఈ ప్రాజెక్టుకు తిప్పేశ్వర్ వన్యప్రాణి కేంద్రం నుంచి అనుమతి లభించింది. ప్రాణహిత నదిపై 2 లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో నిర్మిస్తున్న తమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు చాప్రాల్ వన్యప్రాణి కేంద్రం అనుమతిచ్చింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అధ్యక్షతన బుధవారం ముంబైలో ఆ రాష్ట్ర వన్యప్రాణి బోర్డు సమావేశమైంది. సమావేశంలో మహారాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ మునిగంటివార్, రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ భగవాన్, తెలంగాణ నుంచి ఆదిలాబాద్ సీఈ భగవంతరావు, డిప్యూటీ ఫారెస్ట్ కన్జర్వేటర్ శ్రీనివాస్, పెన్‌గంగ ఎస్ఈ అమ్జద్ హుస్సేన్ పాల్గొన్నారు. ఛనాకా–కొరట, తమ్మిడిహెట్టి బ్యారేజీలపై సీఈ భగవంతరావు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రజెంటేషన్‌పై సంతృప్తి వ్యక్తం చేస్తూ, వీటి నిర్మాణంతో వన్యప్రాణి కేంద్రాలపై ప్రభావముండదని తేల్చిన మహారాష్ట్ర వన్యప్రాణి మండలి.. జాతీయ వన్యప్రాణి బోర్డుకు సిఫారసు చేసింది. ఆ నిర్ణయం పట్ల హరీశ్‌రావు బుధవారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. -
డీఆర్డీవోకు 158 హెక్టార్లు
రాష్ట్ర వన్యప్రాణి బోర్డు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: క్షిపణి ప్రయోగ కేంద్రం (మిసైల్ లాంచింగ్ సెంటర్) ఏర్పాటు కోసం కృష్ణా వన్యప్రాణి అభయారణ్యంలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)కు 158 హెక్టార్లు కేటాయించాలని రాష్ట్ర వన్యప్రాణి బోర్డు సిఫార్సు చేసింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన రాష్ట్ర వైల్డ్‌లైఫ్ బోర్డు సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. అవి ఏమిటంటే... కొల్లేరు అభయారణ్యంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి స్థానంలో అదే పొడవు, వెడల్పుతో కాంక్రీటు ఓవర్‌బ్రిడ్జి నిర్మాణం నెల్లూరు జిల్లాలోని పెంచల నరసింహస్వామి అభయారణ్యంలో నీటి సరఫరా పైపులైన్, బావి ఏర్పాటుకు ఎకరా కేటాయింపు నాగార్జునసాగర్ నుంచి హైదరాబాద్ వరకూ రోడ్డు వెంబడి ఆఫ్టికల్ ఫైబర్ కేబుల్ ఏర్పాటు రోళ్లపాడు అభయారణ్యం విస్తరణ చిలుకూరు వద్ద మృగవని జాతీయ పార్కుకు కంచె ఏర్పాటు హైదరాబాద్‌లోని పక్షుల పార్కులో ఆక్రమణల తొలగింపు కవాల్ టైగర్ రిజర్వ్‌కు ఫీల్డ్ డెరైక్టర్ నిర్మాణాలకు సంబంధించి అధ్యయనం చేసి ప్రతిపాదనలు పంపాలని అటవీశాఖ అధికారులకు సీఎం ఆదేశం విషప్రయోగం చేసే వారిపై కఠిన చర్యలు విషప్రయోగం చేసి వన్యప్రాణులను చంపేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో సీఎం కిరణ్ ఆదేశించారు. వన్యప్రాణుల వల్ల రైతుల పంటలకు, పశువులకు నష్టం వాటిల్లితే తక్షణమే నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించేలా రెవెన్యూ అధికారులను ఆదేశించాలన్నారు. ఈ సమావేశంలో మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, బోర్డు సభ్యులు ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి తదితరులు పాల్గొన్నారు.