‘జటాయువు’కు మోక్షమెప్పుడు? | Still In Pending Jatayuvu Project By Telangana | Sakshi
Sakshi News home page

‘జటాయువు’కు మోక్షమెప్పుడు?

Published Fri, Feb 14 2020 3:42 AM | Last Updated on Fri, Feb 14 2020 3:42 AM

Still In Pending Jatayuvu Project By Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘జటాయువు’ ప్రాజెక్టుకు మోక్షం దొరకడం లేదు. అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న రాబందుల సంరక్షణకు ఉద్దేశించిన ‘వల్చర్‌ శాంక్చరీ’ ఏర్పాటు అంశం కాగితాలకే పరిమితమైంది. మూడేళ్ల క్రితమే రాష్ట్ర వన్యప్రాణిబోర్డు సమావేశం ఆమోదం పొందినా ఈ ప్రతిపాదన ముందుకు కదలలేదు. వన్యప్రాణి బోర్డును పునర్‌వ్యవస్థీకరించాక ఇటీవల జరిగిన సమావేశంలోనూ ఈ ప్రతిపాదనపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా అటవీ ప్రాంతం కాగజ్‌ డివిజన్‌లోని గిరెళ్లి, బెజ్జూరు, గూడెం ఫారెస్ట్‌ బ్లాక్‌లు, రెబ్బెన, కర్జెల్లి, బెజ్జూరు, పెంచికల్‌ పేట రేంజ్‌ల పరిధిలోని 39,800 హెక్టార్లలో ‘జటాయువు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం’గా ఏర్పాటు చేయాలని మూడేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అధికారులు పంపించారు. 2013లో బెజ్జూరు రిజర్వ్‌ ఫారెస్ట్‌ బ్లాక్‌ పెంచికల్‌పేట రేంజ్‌లోని పాలరాపుగుట్టపై అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న లాంగ్‌ బిల్లుడ్‌ వల్చర్‌–పొడవు ముక్కు రాబందులు గూళ్లు కట్టుకోవడంతో పాటు సంతానోత్పత్తిని చేపడుతున్నట్టు గుర్తించారు.

పులుల రాకపోకలతో పెరిగిన ప్రాధాన్యం 
కాగజ్‌నగర్‌ డివిజన్‌లోని టైగర్‌ కారిడార్‌లో మహారాష్ట్రలోని తడోబా ఇతర ప్రాంతాల నుంచి పులుల రాకపోకలు పెరిగాయి. వల్చర్‌ శాంక్చరీని కూడా ఏర్పాటు చేస్తే పులులు శాశ్వత ఆవాసంగా ఈ ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశాలు పెరుగుతాయని నిపుణుల అంచనా. ఈ ప్రాంతంలో శాంక్చరీని ఏర్పాటు చేస్తే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు పెరగడం వల్ల వన్యప్రాణుల సంరక్షణతో పాటు పర్యాటక రంగ ఆకర్షణగా టైగర్‌ సఫారీకి ఓ విడిదిగా ఆ ప్రాంతం మారే అవకాశాలున్నాయి.

ఎంతో అనువైన ప్రాంతం.. 
కాగజ్‌నగర్‌ డివిజన్‌ పరిధిలో పెద్ద వాగు, పెన్‌గంగా, ప్రాణహిత నదులను ఆనుకుని ఉండటం ఈ ప్రాజెక్టుకు కలసిరానుంది. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని పెద్దవాగు సంగమం వద్ద అంతరించిపోతున్న పొడవు ముక్కు (గిప్స్‌ ఇండికస్‌) రాబందులకు ఆవాసంగా మారడంతో శాంక్చరీ ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఏర్పడింది. అధికారుల ప్రాథమికంగా వేసిన లెక్కల ప్రకారం ఇక్కడ 20 పెద్దవి, ఏడాది వయసున్నవి 5, చిన్నవి 5.. మొత్తం 30 రాబందులు ఈ గుట్టలపై గూళ్లను ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించారు. అప్పటినుంచి ప్రత్యేకంగా ఓ బర్డ్‌ వల్చర్‌తో పాటు రాబందుల సంరక్షణ కోసం ఒక బృందం విధులు నిర్వహిస్తోంది.

మహారాష్ట్రలోని కమలాపూర్‌ అటవీ ప్రాంతంలోనే ఈ రాబందులు ఎక్కువగా ఆహార సేకరణ చేస్తున్నాయి. మహారాష్ట్ర అటవీశాఖ చేపట్టిన  సంరక్షణ చర్యలతో నాలుగైదు నెలలుగా ఎక్కువగా అటు వైపు వలస వెళ్తున్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మనవైపున్న ప్రాంతంలో ఎన్ని రాబందులు ఉన్నాయనే దానిపై అధికారులు కచ్చితమైన లెక్కలు చెప్పలేకపోతున్నారు. అయితే జఠాయువు ప్రాజెక్టు ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని, వల్చర్‌ శాంక్చరీ ప్రాజెక్టును ప్రభుత్వం తిరస్కరించనందున దానికి త్వరలోనే ఆమోదం లభిస్తుందనే ఆశాభావంతో అటవీశాఖ ఉన్నతాధికారులున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement