stationery market
-
రూ. 5వేలు పెట్టుబడితో రూ. 750 కోట్ల వ్యాపార సామ్రాజ్యం - తయారైందిలా..!
జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఎన్నో సాహసాలు చేయాల్సి ఉంటుంది. అలాంటి సాహసాలు చేసినప్పుడే నలుగురికి ఆదర్శమవవుతారు, సమాజం మిమ్మలి గుర్తిస్తుంది. ఇలా సాహసాలు చేసినవారిలో ఒకరు 'దేవేందర్ కుమార్ జైన్'. కేవలం ఐదు మందితో రూ. 5వేలు పెట్టుబడితో ప్రారంభమై ఈ రోజు కోట్లు గడిస్తున్నారు. ఈయన విజయం వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? ప్రస్తుతం ఆయన ఆదాయం ఎంత అనే మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. నోయిడాలో ఉన్న స్టేషనరీ ఉత్పత్తుల తయారీ సంస్థ 'లక్సర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్' గురించి అందరూ వినే ఉంటారు. 1963లో ప్రారంభమైన ఈ కంపెనీ కేవలం రూ. 5000 పెట్టుబడితో మొదలైంది. అప్పట్లో ఇందులో ఉన్న ఉద్యోగులు కేవలం ఐదు మంది మాత్రమే. ప్రస్తుతం ఈ సంస్థ 95 దేశాల్లో ఉంది, ఇందులోని ఉద్యోగుల సంఖ్య సుమారు నాలుగు వేల కంటే ఎక్కువ. సుమారు ఆరు దశాబ్దాలు పూర్తి చేసుకున్న ఈ కంపెనీ ఆదాయం ఏకంగా రూ. 750 కోట్లు (2023 మార్చి నాటికి). ఇప్పుడు వార్షక ఆదాయం రూ. 1000 కోట్లకు పెంచాలనే లక్ష్యంతో కంపెనీ కృషి చేస్తోంది. 1975లో మొదటిసారి ఈ కంపెనీ ఫైబర్ టిప్ టెక్నాలజీని ప్రవేశపెట్టి, 1976 నాటికి మార్కర్లు, హైలైటర్ వంటి వాటిని ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. 1980లో కంపెనీ అంతర్జాతీయ వ్యాపారంలో భాగంగా జపనీస్ బ్రాండ్ పైలట్ పంపిణీదారుగా నిలిచింది. ఆ తరువాత లక్సర్ కంపెనీ 1986లో ప్రపంచ వినియోగదారులపై ద్రుష్టి కేంద్రీకరించి అనేక కొత్త ఉత్పత్తులను తయారు చేయడం ప్రారంభించింది. ఇందులో పర్మినెంట్ మార్కర్, ఫ్లోర్ సెంట్ హైలైటర్ వంటి ఉన్నాయి. ఇవన్నీ ఆధునిక కాలంలో మంచి అమ్మకాలను పొందాయి. (ఇదీ చదవండి: డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని కొత్త ఎలక్ట్రిక్ బైక్ - ధర రూ. 55,555 మాత్రమే!) లక్సర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ తరువాత దశలో డ్రాయింగ్, స్కెచింగ్ వంటి వాటికోసం కూడా కొత్త ఉత్పత్తులను తీసుకువచ్చింది. కంపెనీ తన ఉత్పత్తులలో నానో టెక్నాలజీ ఉపయోగించి ఉత్పత్తులను తయారు చేయడం మొదలుపెట్టింది. వీటికి కంపెనీ 'నానో క్లీన్' అని పేరు పెట్టింది. (ఇదీ చదవండి: రూ. 32,999 ఫోన్ కేవలం రూ. 2,999కే సొంతం చేసుకోండిలా..!) రూ. 5000తో ప్రారంభమైన కంపెనీ పెన్నులు, స్టేషనరీ దగ్గర మాత్రమే ఆగిపోకుండా వివిధ రంగాల్లో కూడా తనదైన ముద్ర వేసింది. ఇందులో లక్సర్ గ్రూప్ హాస్పిటల్, రియల్ ఎస్టేట్, రిటైల్, నానో క్లిప్ టెక్నాలజీ వంటి ఉన్నాయి. ఇవన్నీ కూడా కంపెనీ అభివృద్ధికి దోహదపడ్డాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలను తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సలహాలను మాతో పంచుకోండి. -
కుడి ఎడమైతే.. పొరపాటు లేదోయ్!
అవసరం.. దాని నుంచి వచ్చిన ఆలోచన.. కొత్త ఆవిష్కరణలకు దారితీస్తుంది. మిగతా విద్యార్థులకంటే తన కొడుకు ఎందుకు ఆలస్యంగా రాస్తున్నాడనే ఓ తండ్రి ఆవేదన.. ఆలోచన నుంచి వచ్చిందే ‘ది లెఫ్ట్ హ్యాండ్ షాప్’. ఏమిటి దీని ప్రత్యేకత పెన్నో, పెన్సిలో కావాలంటే ఏదైనా స్టేషనరీ దుకాణానికి వెళ్లి ఠక్కున కొనుక్కుంటాం. మరిఎడమ చేతివాటం ఉన్నవారికి..? వారు ఏ పని చేసినా ఎడమ చేతినే ఎక్కువగా ఉపయోగిస్తారు.. అలాంటివారికి అనువైన వస్తువులు చాలా అరుదుగా దొరుకుతాయి. మరి వారి పరిస్థితేంటి.. అడ్జస్ట్ అవాల్సిందేనా.. అవసరం లేదు ‘లెఫ్ట్‌హ్యాండ్’వస్తువులు కూడా ఆన్లైన్లో లభిస్తున్నాయి. లెఫ్ట్‌హ్యాండ్ పెన్, లెఫ్ట్‌హ్యాండ్ పెన్సిల్, లెఫ్ట్‌హ్యాండ్ కత్తెర, స్కేళ్లు ఇలా చాలా వస్తువులు సులువుగా ఆన్లైన్ వేదికగా కొనేసుకోవచ్చు. మొత్తం జనాభాలో 10 శాతం ఎడమచేతి వాటం ఉన్నవారున్నారని ఓ అంచనా. ఇప్పుడిప్పుడే వారికోసం స్టేషనరీ, ఇతర వస్తువులు తయారు చేస్తున్నారు. ఈ వస్తువులకు డిమాండ్ కూడా పెరుగుతోంది. విదేశీ వస్తువులే ఆన్లైన్ మార్కెట్లో ఎక్కువగా ఉండటంతో ధర ఎక్కువగా ఉంటోంది. దీంతో దేశీయంగా ఆయా వస్తువులు తయారు చేస్తున్నారు. ఏమిటి తేడా లెఫ్ట్‌హ్యాండ్ కత్తెరకు బ్లేడ్లు రివర్స్‌లో ఉంటాయి. పైన ఉండే బ్లేడ్ ఎప్పుడూ ఎడమచేతి వైపు ఉంటుంది. పెన్నును ప్రత్యేకంగా డిజైన్ చేశారు. పెన్కు ఉండే నిబ్ చివర రౌండ్‌గా ఉండి మధ్యలో కట్ అయి ఉంటుంది. దీని వల్ల ఇంక్ సులభంగా ఫ్లో అవుతూ రాయడానికి అనువుగా ఉంటుంది. అలాగే షార్ప్‌నర్‌లో పెన్సిల్‌ను ఉంచి అపసవ్వ దిశలో తిప్పాలి. 15 సెం.మీ, ఆరు ఇంచులు ఉన్న స్కేలులో సంఖ్యలు కుడి నుంచి ఎడమకు ఉంటాయి. ఇలా ప్రతీ వస్తువు ఎడమచేతి వాటానికి అనువుగా తయారు చేస్తున్నారు. ఎలా మొదలైంది పుణేకు చెందిన పవిత్తర్ సింగ్ స్కూల్లో మిగతా విద్యార్థులకంటే తన కొడుకు ఆలస్యంగా రాయడాన్ని గమనించాడు. పెన్సిల్‌తోనే కాదు పెన్తోనూ ఇలానే రాస్తున్నాడు. తన కొడుకుది ఎడమ చేతివాటం కాబట్లే ఇలా రాస్తున్నాడని అర్థం చేసుకున్నాడు. అంతే ఆ వస్తువుల కోసం ఆన్లైన్లో వెతికాడు. అయితే ధర ఎక్కువగా ఉంది. ఒక్కో పెన్ను రూ.1,500 , షార్ప్‌నర్ రూ.600 వరకు ధరలు ఉన్నాయి. దీంతో ఎడమచేతి వాటం వారు ఉపయోగించే వస్తువుల కోసం ఆయన‘ది లెఫ్ట్‌హ్యాండ్ షాప్’పేరుతో దేశంలోనే తొలికంపెనీ ప్రారంభించారు. ‘మై లెఫ్ట్’బ్రాండ్ పేరుతో స్కూల్ స్టేషనరీ, క్రికెట్‌కు సంబంధించిన వస్తువులను విక్రయించడం మొదలు పెట్టారు. రూ.99కే స్కూల్ స్టేషనరీ కిట్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఆన్లైన్, సోషల్ మీడియా ద్వారా ఈ వస్తువులను విక్రయిస్తున్నారు. ఎడమ, కుడిచేతి వాటం కలిగిన ఇద్దరూ ఉపయోగించేలావస్తువుల తయారీపై తాజాగా దృష్టి పెట్టినట్లు సింగ్ తెలిపారు. ఫ్రాన్స్‌కు చెందిన ఓ కంపెనీ కూడా సింగ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. వాట్సాప్, ఫేస్‌బుక్‌ల ద్వారా ప్రచారం ఈ తరహా వస్తువులపై అవగాహన కలిగించేందుకు మహారాష్ట్రలో ఎడమ చేతి వాటం ఉన్న పిల్లల తల్లిదండ్రులు 160 మంది వరకు కలసివాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. ఫేస్బుక్ గ్రూప్‌లు, లెఫ్ట్ హ్యాండర్స్ క్లబ్‌లు ఏర్పాటు చేసుకుని వీటి గురించి విçస్తృతంగా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. -
పిల్లల స్టేషనరీ మార్కెట్‌పై షాచిహాత దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ స్టేషనరీ వ్యాపారంపై జపాన్‌కు చెందిన షాచిహాత దృష్టిసారించింది. ‘ఆర్ట్‌లైన్’ బ్రాండ్ నేమ్‌తో పెన్నులు, పెన్సిల్స్, కలరింగ్, క్రేయాన్స్‌లతో పాటు ఆఫీస్ స్టేషనరీ వస్తువులను అందిస్తున్నట్లు షాచిహాత తెలిపింది. ఇప్పటికే చెన్నైలో ఉన్న యూనిట్‌తో పాటు, గోవా, ఉత్తరాది రాష్ట్రాల్లో మరో రెండు తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు షాచిహాత ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ అనూప్ రాణా తెలిపారు. కొత్త యూనిట్లు, డీలర్ల ఏర్పాటు కోసం రానున్న రెండేళ్లలో రూ. 30 కోట్లు వ్యయం చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాణా ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. దేశీయ స్టేషనరీ వ్యాపారం ఏటా 10 శాతం చొప్పున పెరుగుతూ ప్రస్తుతం రూ.12,000 కోట్లుగా ఉందని, ఇందులో పుస్తకాలు మినహా మిగిలిన వ్యాపారం విలువ సుమారు రూ.4,000 కోట్లుగా ఉందన్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల స్టేషనరీకి, క్రేయాన్స్, కలరింగ్ మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోందని, ఇందులో దక్షిణ భారతదేశం ముందంజలో ఉందన్నారు. వ్యాపార విస్తరణలో భాగంగా ఈ ఏడాది డిస్ట్రిబ్యూటర్ల సంఖ్యను 70 నుంచి 200కి పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. వచ్చే మూడేళ్లలో రూ.200 కోట్ల వ్యాపారాన్ని నమోదు చేయగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. జపాన్‌తో పోలిస్తే ఇక్కడ తయారీ వల్ల 25 శాతం వ్యయం కలిసొస్తుందని, అందుకనే ఇక్కడ నుంచే మిగిలిన దేశాలకు కూడా ఎగుమతులు చేయనున్నట్లు రాణా వివరించారు. ఈ రూ. 200 కోట్ల ఆదాయంలో 40 శాతం ఎగుమతుల నుంచే వస్తుందన్నారు. వచ్చే ఐదేళ్లలో దేశీయ స్టేషనరీ మార్కెట్లో 15 శాతం వాటాను కైవసం చేసుకోవాలన్నది షాచిహాత లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాణా తెలిపారు.