ఎల్ఎండీ నుంచి నీరు విడుదల
కార్పొరేషన్ : వరంగల్ నగర ప్రజలకు మంచినీటి కబురు. తాగునీటి అవసరాలు తీర్చేందుకు కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం(ఎల్ఎండీ) నుంచి ప్రతీ రోజు రెండు దఫాలుగా నీటిని విడుదల చేయాలని ఇంజినీర్లు నిర్ణయించారు. ఈ మేరకు గురువారం ఉదయం 9-30 గంటలకు 500 క్యూసెక్కులు, సాయంత్రం 6 గంటలకు మరో 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన ఇరిగేషన్ అధికారులు శుక్రవారం తెల్లవారుజామున మరో 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నీరు వరంగల్ నగరానికి శుక్రవారం సాయంత్రం వరకు చేరుకునే అవకాశం ఉందని బల్దియా ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు. పది రోజుల పాటు నీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వారు వివరించారు.
వరంగల్ నగరపాలక సంస్థ సమ్మర్ స్టోరేజీలలోని ధర్మసాగర్ డెడ్ స్టోరేజీకి మారింది. భద్రకాళి, వడ్డేపల్లి చెరువుల్లో నీరు చాల తక్కువగా ఉంది. దీంతో జిల్లా కలెక్టర్, బల్దియా ప్రత్యేకాధికారి కిషన్, కమిషనర్ సువర్ణ పండాదాస్, వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు కొండాసురేఖ, దాస్యం వినయ్‌భాస్కర్ ఎల్ఎండీ నుంచి ఒక టీఎంసీ(1,000 ఎంసీఎఫ్‌టీలు) నీరు విడుదల కోసం ప్రయత్నాలు చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరిష్‌రావు చొరవ చూపడంతో ఎట్టకేలకు ప్రయత్నాలు ఫలించాయి. అయితే ఎల్ఎండీ ఇంజినీర్లు మాత్రం 500 ఎంసీఎఫ్‌టీల నీరు మాత్రమే విడుదల చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. నీటిని విడుదల చేసిన సందర్భంగా డ్యామ్ వద్ద బల్దియా ఈఈలు సుచరణ్, నిత్యాం నదం, నందకిశోర్, ఏఈలు భాస్కర్‌రావు, ప్రభువర్ధన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
కెనాల్ నీటిపై నిఘా
కాకతీయ కెనాల్ నుంచి నగరానికి వచ్చే నీటిని మధ్యలో మళ్లించకుండా నిరంతరం పర్యవేక్షించేందుకు మూడు ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేశారు. 65 కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ కెనాల్ వెంట నిఘా బృందాలు రాత్రింబ వళ్లు కాపుకాస్తాయి. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఒక బృందం, రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు మరో బృందం నిరంతరం పెట్రోలింగ్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా లీకేజీలు ఏర్పడినా, నీటిని మళ్లించే ప్రయత్నం జరిగినా వెంటనే నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు. ఈనెల 24వ తేదీ వరకు బృందాలు విధులు నిర్వర్తించనున్నారు.
పంపింగ్‌కు ఏర్పాట్లు పూర్తి :ఎస్ఈ ఉపేంద్రసింగ్
ఎల్ఎండీ నుంచి నీరు విడుదల అయినందున సమ్మర్ స్టోరేజీల్లో నింపేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎస్ఈ ఉపేంద్రసింగ్ తెలిపారు. భద్రకాళి, వడ్డేపల్లి చెరువులను సామర్థ్యం మేరకు నింపేందుకు మోటార్లు సిద్ధం చేశామని చెప్పారు. శుక్రవారం సాయంత్రం నాటికి నీరు చేరుతుందని, పది రోజుల పాటు విడుదలయ్యే ఈ నీటిని పొదుపుగా వాడుకుంటామన్నారు. ఒక్కపక్క సమ్మర్ స్టోరేజీలకు పంపింగ్ చేస్తూనే మరోవైపు కేయూసీ, దేశాయిపేట, వడ్డేపల్లి ఫిల్టర్బెడ్ల ద్వారా నీటిని శుద్ధిచేసి నగర ప్రజలకు సరఫరా చేస్తామని పేర్కొన్నారు. ఈనెల 13 నుంచి నగరంలో తాగునీటి సరఫరా జరుగుతుందని వివరించారు.