అన్ని కమిషన్లలో ఖాళీలు త్వరలో భర్తీ: కేంద్రం
న్యూఢిల్లీ: దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కమిషన్లలోని ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించింది. కమిషన్లలోని ఖాళీల భర్తీ ఆలస్యమవడంపై లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ కె.సురేశ్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి ప్రతిపక్ష సభ్యులందరూ మద్దతునిచ్చారు. నియామకాలు ఆలస్యమవడాన్ని విమర్శిస్తూ వారందరూ కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టారు.
దీనికి లోక్సభలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి తేవర్చంద్ గెహ్లాట్ సమాధానమిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కమిషన్లలో కొత్త సభ్యుల నియామకం చేపట్టలేకపోయామని, ప్రస్తుతం వాటిని వీలైనంత త్వరగా చేపడుతామని హామీనిచ్చారు. అంతేకాకుండా ఓబీసీ కమిషన్కు చట్టబద్దత కల్పించేందుకు త్వరలో బిల్ కూడా తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈ అంశం గురువారం రాజ్యసభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.