టాటా స్టీల్ యూకే ప్లాంట్ల విక్రయానికి బ్రేక్!
దీర్ఘకాల పరిష్కారం కోసం చర్చలు జరపనున్న బ్రిటన్ వ్యాపార మంత్రి
లండన్ : టాటా స్టీల్.. యూకేలోని స్టీల్ ప్లాంట్ల విక్రయాలను వాయిదావేసే అవకాశాలున్నాయి. వేల్స్‌లోని భారీ ప్లాంట్ పోర్ట్ తాల్బొట్ ప్లాంట్ విక్రయంతో సహా యూకేలోని ఇతర ప్లాంట్ల విక్రయాన్ని టాటా స్టీల్ తాత్కాలికంగా ఆపివేసే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ వార్తా సంస్థ బీబీసీ వెల్లడించింది. టాటా స్టీల్ యూకే ప్లాంట్ల సమస్యలకు సంబంధించి దీర్ఘకాల పరిష్కారం నిమిత్తం బ్రిటన్ వ్యాపార మంత్రి సాజిద్ జావీద్ టాటా స్టీల్ ప్రతినిధులతో చర్చలు జరపడానికి ముంబై రానుండడం దీనికి ప్రధాన కారణమని బీబీసీ వివరించింది. బీబీసీ కథనం ప్రకారం.., శుక్రవారం జరగబోయే నెలవారీ బోర్డ్ మీటింగ్‌లో యూకే స్టీల్ ప్లాంట్ల విక్రయాన్ని తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు కంపెనీ యాజమాన్యం ప్రకటించే అవకాశాలున్నాయి..
ప్రత్యేక ఉక్కు ఉత్పత్తుల వ్యాపారానికి సంబంధించిన హర్టెపూల్, రోటర్‌డామ్, స్టాక్స్బ్రిడ్జ్ ప్లాంట్ల విక్రయాలను టాటా స్టీల్ విక్రయించవచ్చు. ఇతర ప్లాంట్ల విక్రయాన్ని టాటా స్టీల్ అటకెక్కించవచ్చు. స్టీల్ ధరలు పెరగడం, యూరోపియన్ యూనియన్ నుంచి ఇంగ్లాండ్ వైదొలగడంపై అనిశ్చితి, చర్చల కోసం యూకే వ్యాపార మంత్రి సాజిద్ జావీద్ ముంబై వచ్చి, టాటా చైర్మన్ సైరస్ మిస్త్రీతో చర్చలు జరపనుండడం.. తదితర అంశాలు దీనికి కారణాలు. అయితే టాటా స్టీల్ యూకే ప్లాంట్లను కొనుగోలు చేయడానికి భారత సంతతి వ్యాపార వేత్త సంజీవ్ గుప్తాకు చెందిన లిబర్టీ హౌస్ ముందంజలో ఉందని ఐటీవీ న్యూస్ వెల్లడించింది. కాగా ఈ పరిణామాలపై టాటా స్టీల్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
జాతీయం చేసే అవకాశాలు...!
బ్రెగ్జిట్ తదనంతరం అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ, టాటా స్టీల్ యూకే ప్లాంట్లు అమ్ముడయ్యే అవకాశాలున్నాయని యూకే చిన్న వ్యాపారాల మంత్రి అన్నా సొబ్రి గత వారం పేర్కొన్నారు. అయితే ఈ స్టీల్ ప్లాంట్లను జాతీయం చేసే ప్రతిపాదన ఇంకా సజీవంగానే ఉందని వివరించారు. యూరోపియన్ యూనియన్‌లో సభ్యదేశంగా ఇంగ్లండ్‌కు ఉక్కు పరిశ్రమను జాతీయకరణ చేసే వీలు లేదనే ప్రచారం పూర్తిగా అపోహమాత్రమేనని ఆమె వివరించారు.
టాటా స్టీల్ కంపెనీకి యూకేలోని పోర్ట్ తాల్బొట్, రోటర్‌డామ్, కోర్బి, షాటన్, టీసైడ్ ప్లాంట్లలలో దాదాపు 15 వేలమంది కార్మికులు పనిచేస్తున్నారు. చైనా స్టీల్ ఉత్పత్తుల వెల్లువ కారణంగా టాటా స్టీల్ యూకే వ్యాపారానికి రోజుకు 10 లక్షల పౌండ్ల నష్టం వస్తోంది. దీంతో యూకేలోని ప్లాంట్లను విక్రయించాలని టాటా స్టీల్ నిర్ణయించింది. బిడ్లను ఆహ్వానించింది. సంబంధిత ప్రక్రియ కొనసాగుతోంది. కోరస్ నుంచి ఈ ప్లాంట్లను చేజిక్కించుకున్నపుపడు సంక్రమించిన బ్రిటిష్ స్టీల్ పెన్షన్ ఫండ్ టాటా స్టీల్ కంపెనీకి గుదిబండగా మారింది. స్టీల్ ప్లాంట్ల విక్రయానికి ఈ ఫండ్ ఒక అడ్డంకిగా మారింది. ఈ ఫండ్‌లో 1,30,000 మంది సభ్యులుండగా, 70 కోట్ల పౌండ్ల లోటు ఉంది. యూకే ప్లాంట్ల విక్ర యం వాయిదా నేపథ్యంలో టాటా స్టీల్ షేర్ బీఎస్ఈలో 5% క్షీణించి రూ.318 వద్ద ముగిసింది.