ఆ సీడీలో ఉన్నా.. మాజీ సీఎం అంగీకారం!
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ ఆదివారం ఓ స్టింగ్ ఆపరేషన్ విషయమై సంచలన అంగీకారం చేశారు. ఉత్తరాఖండ్‌లో రాజకీయ సంక్షోభానికి కారణమైన కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నట్టు భావిస్తున్న స్టింగ్ ఆపరేషన్ సీడీలో తాను ఉన్న విషయం వాస్తవమేనని ఆయన అంగీకరించారు.
ఇప్పటివరకు ఈ స్టింగ్ ఆపరేషన్ ఓ బూటకమని కొట్టిపారేస్తూ వచ్చిన రావత్ తొలిసారి ఈ సీడీలో తాను ఉన్నానని అంగీకరించారు. అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా ఎమ్మెల్యేలను కొనేందుకు ఓ జర్నలిస్టుతో అప్పటి సీఎం రావత్ ఒప్పందం కుదుర్చుకున్నట్టు వెలుగులోకి వచ్చిన ఓ స్టింగ్ ఆపరేషన్ కలకలం రేపింది. ఓ ప్రైవేటు న్యూస్ చానెల్ ఎడిటర్ ఈ స్టింగ్ ఆపరేషన్‌ను నిర్వహించారు. ఈ సీడీ కాపీలను కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు మీడియాకు పంపారు.
స్టింగ్ ఆపరేషన్‌కు పాల్పడిన జర్నలిస్టుతో తాను సమావేశమైన విషయం వాస్తవమేనని రావత్ తాజాగా స్పష్టం చేశారు. 'ఓ జర్నలిస్టుతో సమావేశం కావడం నేరమా? అప్పటికీ సాంకేతికంగా అనర్హత పడిన ఓ ఎమ్మెల్యేతో నేను మాట్లాడటం తప్పా? రాజకీయాల్లో మేం ఏదైనా చానెల్‌ను నిషేధించామా' అని రావత్ ఆదివారం డెహ్రాడూన్‌లో విలేకరులతో అన్నారు.
రావత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొమ్మిదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎదురుతిరగడం, అసెంబ్లీలో బలపరీక్షకు ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశించడం, అంతకుముందే కేంద్ర ప్రభుత్వం ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించడంతో ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.