ఆశలు ఆవిరి
పవర్ ప్లాంటు నిర్వహణ మూడేళ్లపాటు స్టీగ్ కంపెనీదే..
ఉద్యోగావకాశాలపై అయోమయం
భూ నిర్వాసితులకు అన్‌స్కిల్డ్ ఉద్యోగాలు.. స్థానికేతరులకు స్కిల్డ్ జాబ్స్
నిర్వాసితులకు మొండిచేయి చూపిన సింగరేణి యాజమాన్యం
ఉద్యోగుల నియామకంలో
దళారుల హవా..!
జైపూర్ : సింగరేణి యాజమాన్యం మరోసారి భూ నిర్వాసితుల ఆశలు ఆవిరి చేసింది. తమ భూములు పోయినా.. తెలంగాణ రాష్ట్రానికి వెలుగులు రావడంతోపాటు తమవారికి ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డారు. పచ్చని పొలాలు కోల్పోయి.. ఉద్యోగాలు వస్తాయకుంటే నిరాశే ఎదురైంది. సింగరేణి యాజమాన్యం జైపూర్‌లో ఏర్పాటు చేస్తున్న పవర్ ప్లాంట్ నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వ రంగ సంస్థ అయిన జెన్కోకు కాకుండా ఎప్పుడైతే జర్మనీకి చెందిన స్టీగ్ అనే ప్రైవేటు కంపెనీకి అప్పగించిందో అప్పటి నుంచి నిర్వాసితులకు భరోసా లేకుండాపోయింది.
2,200 ఎకరాల భూమి సేకరణ
జైపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో సింగరేణి సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 1200 మెగా థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రస్తుతం తుది దశకు చేరాయి. విద్యుత్ ఉత్పత్తికి చివరి మెరుగులు దిద్దుకుంటోంది. వచ్చే నెల ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ పవర్‌ప్లాంటు నిర్వహణ బాధ్యతలను మూడేళ్లపాటు జర్మనీకి చెందిన స్టీగ్ అనే ప్రైవెట్ కంపెనీకి అప్పగించిన విషయం తెలిసిందే. నిర్వహణ బాధ్యతలను ప్రైవెట్ కంపెనీకి అప్పగించడం నిర్వాసితులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. సింగరేణి పవర్‌ప్లాంటులో జైపూర్, పెగడపల్లి, గంగిపల్లి, ఎల్కంటి గ్రామాలకు చెందిన రైతుల నుంచి 2,200 ఎకరాల భూములను సేకరించారు.
భూసేకరణ సమయంలో సింగరేణి అధికారులు పవర్‌ప్లాంటులో శాశ్వత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, ప్లాంటుతో ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. దీనికితోడు వారిలో నమ్మకం కుదిర్చేందుకు భూ నిర్వాసితులకు సింగరేణి యాజమాన్యం విడతల వారీగా హైదరాబాద్‌లోని ఎన్ఏసీ(నేషనల్ అకాడమి ఆఫ్ కన్స్ట్రక్షన్స్)సంస్థలో మూడు నెలలపాటు శిక్షణ కూడా ఇప్పించారు. శిక్షణ ఇప్పించిన యాజమాన్యం అనంతరం నిర్మాణ పనుల్లో ఉపాధి అవకాశాలు కల్పించకుండా మొండిచేయి చూపింది. పవర్‌ప్లాంటు పూర్తయితే ఉద్యోగాలు వస్తాయని కోటి ఆశలతో ఎదురుచూస్తున్న నిర్వాసితులకు మరోసారి అన్యాయం ఎదురైంది.
నిర్వాసితులు 800 మంది..
పవర్‌ప్లాంటు భూ నిర్వాసితులు సుమారు 800 మంది ఉంటారు. స్టీగ్ కంపెనీ మ్యాన్‌పవర్ బాధ్యతలను పవర్‌మెక్ అనే మరో ప్రైవెట్ కంపెనీకి అప్పగించింది. భూ నిర్వాసితులకు ఉపాధి కల్పించడానికి సింగరేణి అధికారులు 700 మంది నిర్వాసితులను గుర్తించి విడతల వారీగా ఇంటర్వూ్యలు నిర్వహించి ఎంపిక చేస్తున్నారు. ఆయితే మూడు విడుతలుగా సుమారు 250 మందిపైగా భూనిర్వాసితులకు నిర్వహణ బాధ్యతలు చేపడుతున్న ఆ ప్రైవెట్ కంపెనీల సమక్షంలో ఇంటర్వూ్యలు నిర్వహించారు. అయితే నిర్వాసితులు అర్హత కలిగి ఉన్నా.. స్కిల్డ్ జాబ్స్ కాకుండా కేవలం అన్‌స్కిల్డ్, సెమీ స్కిల్డ్ జాబ్స్ మాత్రమే కల్పిస్తున్నారు.
కొంత మంది నిర్వాసితులు ఐటీఐ, ఫిట్టర్, పాల్టెక్నిక్, డిప్లొమా, బీటెక్‌తో పాటు టెక్నికల్ అర్హతలు ఉన్నప్పటికీ కేవలం అన్‌స్కిల్డ్ (హౌజ్‌కీపింగ్, హెల్పర్స్) పేరుతో లేబర్ పనులు చేయించారు. దీంతో విధుల్లో చేరిన వారు వారం పది రోజులకే పనులు మానేయాల్సిన దుస్థితి. ప్రైవెట్ కంపెనీలు డబ్బులకు కక్కుర్తిపడి భూ నిర్వాసితులకు కష్టమైన పనులు కల్పిస్తూ ఇతర ప్రాంతాలకు చెందిన స్థానికేతరులకు సులభమైన ఉద్యోగాలు కల్పిస్తున్నారన్న ఆరోపణల జోరుగా వినిపిస్తున్నాయి. భూములు సేకరించిన సమయంలో భూ నిర్వాసితులకు అన్నివిధాలా న్యాయం చేస్తామని చెప్పిన సింగరేణి యాజమాన్యం ప్రైవెట్ కంపెనీకి అప్పగించి చేతులు దులుపుకోవడం ఆందోళన కలిగించే విషయం. ఆ ప్రైవేట్ కంపెనీల నిర్వాహకులు భూనిర్వాసితుల పట్ల పొమ్మనలేక పొగ బెట్టినట్లు వ్యవహరించడం గమనార్హం.
దళారుల హవా..
పవర్ ప్లాంటులో ముందు నుంచీ దళారీల హవా కొనసాగుతోంది. కొంత మంది దళారీలు ప్రైవేట్ కంపెనీల అధికారులతో కుమ్మక్కై కరీంనగర్ జిల్లా గోదావరిఖని, ఎన్టీపీసీ, శ్రీరాంపూర్, మంచిర్యాల, బెల్లంపల్లి తదితర ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా.. పవర్‌ప్లాంటులో పనిచేస్తున్న వారు కూడా అత్యధికులు బయటివారే కావడం గమనార్హం.
అర్హతలను బట్టి అవకాశాలు..
పవర్ ప్లాంట్ భూ నిర్వాసితులకు అర్హతను బట్టి తప్పకుండా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ప్రస్తుతం ప్రాజెక్టు ప్రారంభ దశలో ఉంది. మున్ముందు అవకాశాల ప్రకారం నిర్వాసితులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం.
– సుధాకర్ రెడ్డి, ఎస్టీపీపీ జీఎం