హేట్సాఫ్ టు సాక్షి
సాక్షి, రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరానికి చెందిన సవితాల సుబ్బలక్ష్మి పేరు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైంది. బీకామ్ కంప్యూటర్స్ పూర్తి చేసిన ఆమె ఒక ప్రై వేట్ సంస్థలో చిరుద్యోగి. తండ్రి వేణుగోపాలకృష్ణ మరణంతో తల్లితో కలసి ఉంటున్నారు. సుబ్బలక్ష్మికి మొదటినుంచీ ’సాక్షి’ దినపత్రిక అంటే ఇష్టం. అందులోనూ ఫ్యామిలీ పేజీల్లో ప్రచురితమయ్యే వెజ్, నాన్‌వెజ్ కర్రీల వివరాలు చదివి, ఆ క్లిప్పింగులను భద్రపరిచేవారు. ఈవిధంగా 2010 అక్టోబర్ నుంచి 2018 డిసెంబర్ వరకూ ’సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన వంటకాలకు సంబంధించిన క్లిప్పింగులను పదిలపరచి, బైండింగ్ చేయించారు.
ఈ సేకరణకు గానూ ఆమె పేరు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైంది. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ కార్యాలయంలో ఆయన చేతుల మీదుగా ఆమె ఆదివారం వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ’సాక్షి’ దినపత్రికలో ప్రచురితమవుతున్న ’వింతలు – విచిత్రాలు’ శీర్షికకు సంబంధించిన క్లిప్పింగులను కూడా పదిలపరిచానని, త్వరలో మరో మూడు బుక్ ఆఫ్ రికార్డుల్లో తన పేరు నమోదు కానున్నదని సుబ్బలక్ష్మికి తెలిపారు. పరోక్షంగా తనకు గుర్తింపు తీసుకువచ్చిన ’సాక్షి’కి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.