'భర్త నుంచి రక్షణ కల్పించండి'
- భర్తకు భయపడి ఆశ్రయ కేంద్రానికి చేరిక
నెల్లూరు: మద్యం మత్తులో భార్యను వేధిస్తున్న భర్త.. ఆమె పుట్టింటికి వెళ్లిపోవడంతో కత్తితో పొడిచి చంపబోయాడు. జిల్లాలోని మాచర్లవారిపాలెం గణపతినగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పట్రా రామయ్య, కృష్ణమ్మల కుమార్తె అయిన విజయమ్మకు అదే గ్రామానికి చెందిన గా సుబ్రహ్మణ్యంతో పదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లులు. అయితే మద్యానికి బానిసైన సుబ్రమణ్యం గత కొంత కాలం నుంచి భార్యను వేధిస్తువస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 17వ తేదీన సుబ్రహ్మణ్యం భార్యపై గొడవతో గొడవపడ్డాడు. ఇక చేసేదేమి లేక అదే రోజు రాత్రి విజయమ్మ పిల్లల్ని తీసుకొని స్థానికంగా ఉన్న పుట్టింటికి వెళ్లింది.
దీంతో కోపోద్రేకుడైన సుబ్రహ్మణ్యం మరుసటి రోజు కత్తి తీసుకొని పుట్టింటిలో ఉన్న విజయమ్మపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో భయాందోళనకు గురైన విజయమ్మ, ఆమె తల్లిదండ్రులు ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకొన్నారు. ఆ తర్వాత రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించారు. ఎప్పటికైనా భర్త నుంచి తనకు ప్రాణహాని ఉంటుందని, పోలీసులు రక్షణ కల్పించే వరకూ ఊళ్లో ఉండలేనంటూ నెల్లూరులో గల నిరాశ్రయుల ఆశ్రయ కేంద్రంలో ఉంటోంది విజయమ్మ.