రాహుల్ నుంచి అమితాబ్ వరకు...
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమం ట్విటర్లో అధికారిక ఖాతాలకు ఇచ్చే బ్లూ టిక్‌ను మన దేశంలో చాలా మంది ప్రముఖులు కోల్పోయారు. సబ్స్క్రిప్షన్ చెల్లించకపోవడంతో భారత్‌లో రాహుల్ గాంధీ నుంచి అమితాబ్ బచ్చన్ వరకు రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖుల అకౌంట్ల నుంచి బ్లూ టిక్‌లను తొలగించారు. ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఆదాయాన్ని పెంచుకోవడానికి బ్లూటిక్ కావాలంటే సబ్స్క్రిప్షన్ ఫీజు కట్టాలన్న నిబంధన తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.
అలా డబ్బులు చెల్లించని వారి ఖాతాల నుంచి బ్లూటిక్‌లను తొలగించే కసరత్తు ట్విటర్ ప్రారంభించింది. దీంతో వేలాది మంది సెలబ్రిటీలు బ్లూటిక్‌ను కోల్పోయారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, సోదరి ప్రియాంకా గాంధీ, యోగి ఆదిత్యనాథ్, మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, నితీష్ కుమార్ సహా పలువురు సీఎంలు, బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అలియా భట్, అనుష్క శర్మ తదితరులు బ్లూ టిక్ కోల్పోయిన వారి జాబితాలో ఉన్నారు.
బ్లూ టిక్ కోల్పోయిన అంతర్జాతీయ ప్రముఖుల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఉన్నారు. ట్విటర్లో బ్లూ టిక్ స్టేటస్ సింబల్‌గా మారింది. బ్లూటిక్కు వెబ్‌లో రూ.650, మొబైల్ ఫోన్లలో ఉండాలంటే నెలకి రూ.900 ఫీజుగా నిర్ణయించారు. ఏడాదికి ఒకేసారి కడితే రూ6,800 డిస్కౌంట్ రేటు పెట్టారు. దీనిపై గందరగోళం నెలకొనడంతో కొన్నాళ్లు దీనిని నిలిపివేశారు. ఇప్పుడు మళ్లీ బ్లూ టిక్లపై దృష్టి సారించారు.
డబ్బులు కట్టినా.. ఏమిటిది ?
బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌కి వింత అనుభవం ఎదురైంది. సబ్స్క్రిప్షన్ కట్టినప్పటికీ ఆయన ఖాతా నుంచి బ్లూ టిక్‌ను తొలగించారు. దీనిపై అమితాబ్ ఫన్నీగా ట్వీట్ చేశారు. ‘‘హే ట్విటర్ బ్రో, వింటున్నావా ? నేను ఇప్పటికే డబ్బులు కట్టాను. నా పేరు ముందు ఆ బ్లూ టిక్ మళ్లీ పెట్టు. దాని వల్ల అది నేనేనని ప్రజలు గుర్తిస్తారు’’ అని ట్వీట్ చేశారు. నటుడు ప్రకాశ్ రాజ్ బై బై బ్లూ టిక్ అంటూ ఒక హ్యాష్ ట్యాగ్‌ను జోడించారు. బ్లూ టిక్ లేకపోయినా తన జీవన ప్రయాణంలో సంగతులు, తన మదిలో భావాలు అందరితో పంచుకుంటానని స్పష్టం చేశారు.