సబ్సిడీ సిలిండర్లు నాకొద్దు: సీఎం
రాజకీయ నాయకులు ఒక్కొక్కళ్లు ఏడాదికి కొన్ని వందల రాయితీ సిలిండర్లను వాడుతుంటారు. అయితే.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మాత్రం అందుకు భిన్నంగా, ఆదర్శంగా వ్యవహరించారు. తనకు సబ్సిడీ సిలిండర్ వద్దని.. దాన్ని తిరిగిచ్చేశారు. రాయితీ లేని గ్యాస్ సిలిండర్లనే తాను ఉపయోగిస్తానని చెప్పారు. తనతో పాటు సహచర మంత్రులు కూడా అందరూ రాయితీ లేని గ్యాస్ సిలిండర్లనే ఇళ్లలో వాడుకోవాలని దేవేంద్ర ఫడ్నవిస్ పిలుపునిచ్చారు.
అల్పాదాయవర్గాలు, మధ్యతరగతి కోసం ఇస్తున్న సబ్సిడీని ఉన్నతాదాయ వర్గాల వాళ్లు కూడా వినియోగించుకోవడం వల్ల ప్రభుత్వాలపై సబ్సిడీ భారం పెరిగిపోతోందని ఇటీవల ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే. దాంతో ఫడ్నవిస్ తనంతట తాను స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకుని ఆదర్శంగా నిలిచారు.