డస్కీ బ్యూటీ..
సిస్టరాఫ్ డిస్కోశాంతి
‘నాపేరు సుచిత్రా ఆనందన్’ అని పరిచయం చేసుకునే ఆమెని చూస్తే నిన్నటి తరం ఐటమ్ బాంబ్ డిస్కో శాంతి చెల్లెలు అని చెబితే నమ్మడం అంత సులభం కాదు. జఫా, రుషి లాంటి సినిమాల ద్వారా ఇప్పుడిప్పుడే తెరపై మెరుస్తోన్న ఈ డస్కీ బ్యూటీ రియల్ స్టార్ శ్రీహరికి స్వయానా మరదలు అనే విషయం చాలా మందికి తెలియదు. ఓ రెస్టారెంట్ ప్రారంభానికి వచ్చిన ఈ బ్లాక్ బ్యూటీని సిటీప్లస్ పలకరించింది. ఈ సందర్భంగా సుచిత్ర చెప్పిన సంగతులు ఆమె మాటల్లోనే.. - సత్యబాబు
మాది పూర్తిగా సినీ నేపథ్యం ఉన్న కుటుంబం అనేది తెలిసిందే కదా. నాన్న, ఇద్దరు అక్కలు.. ఇలా ఇంట్లో అంతా సినీనటులే. ఏడుగురు తోబుట్టువుల్లో ముగ్గురు ఆడపిల్లలం ఉన్నాం. నేను చివరి దాన్ని. మాస్ కమ్యూనికేషన్స్‌లో మాస్టర్స్ చేశాను. సినీరంగంపై ఎప్పుడూ ఆసక్తి లేదు. జర్నలిస్ట్ కావాలనుకున్నా. అయితే నా కలర్ నచ్చిన ఓ డీజే ఫ్రెండ్ ఫొటోగ్రాఫర్‌కి పరిచయం చేయడం, నేను మోడల్‌గా మారడం జరిగిపోయాయి. అలా పూణెలో చదువుతున్నప్పుడే, కాలేజ్ డేస్‌లోనే మోడల్నయ్యాను. చెన్నైలో వందకు పైగా మోడలింగ్ అసైన్మెంట్స్లో పాల్గొన్నాను. చెట్టినాడ్ శారీస్ వంటివి బాగా పేరు తెచ్చాయి. అయితే సినిమా రంగంలో ఈ కలర్‌కి ఇంకా అంత క్రేజ్ రాలేదనుకోండి.
సిస్టర్ ఒప్పుకోలేదు..
నేను సినిమాల్లోకి రావడం శాంతికి మొదట్లో ఇష్టం లేదు. ఎందుకంటే మా ఇంట్లో ఆడపిల్లలు ఎవరూ టెన్త్ క్లాస్ దాటలేదు. అందుకే అందరూ నేను చదవాలని కోరుకున్నారు. నేను డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఓకే అంది. చిన్నప్పుడు కొంతకాలం భరతనాట్యం నేర్చుకున్నా గానీ అక్క అంత మంచి డ్యాన్సర్‌ని కాదు.
నిజానికి అక్కలా డ్యాన్స్ చేయాలంటే బాబోయ్.. చాలా కష్టం. అప్పట్లో అమీర్‌పేటలో అక్క డ్యాన్స్ స్కూల్ పెట్టింది కదా అప్పుడు కొన్ని నెలలు తన దగ్గర ట్రైనింగ్ అయ్యా. అయితే ఇటీవల కన్నడ సినిమా గణపలో ఐటమ్ సాంగ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి ఆఫర్లు వస్తే ఐటమ్ సాంగ్స్ చేయడానికీ అభ్యంతరం లేదు.
అక్కకి తోడుగా..
ఎంతో ప్రేమించే భర్తను కోల్పోయిన అక్కకు ధైర్యం చెప్పేందుకు మా కుటుంబం అంతా చెన్నై నుంచి వచ్చేశాం. తనతోనే ఉంటున్నాం. ఇక్కడ ఏమైనా ఇబ్బంది కలిగించే జ్ఞాపకాలు గుర్తొస్తే చెన్నై తీసుకెళ్తున్నాం. తనకు తోడుగా ఉండాలనే కోరికతోనే సినిమా ఆఫర్లపై ఇప్పటిదాకా సీరియస్‌గా ఆలోచించలేదు.
ఇక దృష్టి పెట్టాలి. జనవరిలో నేను నటించే తమిళ సినిమా ప్రారంభం అవుతోంది. నాగార్జున, కమల్, అర్జున్ వంటి సీనియర్ హీరోలతో నటించాలని ఉంది. అక్క కొడుకులు శశాంక్, మేఘాంశ్ చాలా కష్టపడుతున్నారు. సినిమాల్లో తమను తాము నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. శశాంక్ ఆప్పుడే షార్ట్ ఫిల్మ్స్ కూడా తీస్తున్నాడు. వారిద్దరూ బావ పేరు నిలబెడతారనే విషయంలో సందేహం లేదు.