ఒక్క ఓటమి.. సీఎం కుర్చీ దూరం
తుమకూరు: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తిని రేపుతున్న నియోజకవర్గాల్లో తుమకూరు జిల్లాలోని కొరటగెరె ఒకటి. గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి ప్రత్యర్థులుగా బరిలో దిగిన కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్, కొరటగెరె జేడీఎస్ ఎమ్మెల్యే సుధాకర్లాల్లు ఈసారి కూడా ప్రత్యర్థులుగా ఎన్నికల బరిలో దిగనుండడంతో కొరటగెరె ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2013 ఎన్నికల్లో ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవాలనే లక్ష్యంతో పరమేశ్వర్ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు.కొరటగెరె నియోజకవర్గంలో విజయం తమదేనన్న ధీమాతో నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారు. దీంతో జేడీఎస్ అభ్యర్థి సుధాకర్లాల్ 18 వేల ఓట్ల మెజారిటీతో అనూహ్యంగా విజయం సాధించారు. ఈ ఓటమి పరమేశ్వర్ ఆశలను చిదిమేసింది. చేతికి అందిన ముఖ్యమంత్రి పీఠాన్ని నోటికి అందకుండా చేసింది. దీంతో కొరటగెరె నియోజకవర్గంలో విజయంతో పాటు కలలు కన్న ముఖ్యమంత్రి పీఠం కూడా దూరమవడంతో ఎమ్మెల్సీ కోటాలో హోంమంత్రి పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సుమారు ఏడాది కిదంట ఆ పదవిని కూడా వదులుకున్నారు.
పట్టు పెంచుకుంటున్న పరమేశ్వర్
పరమేశ్వర్ ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి ప్రత్యర్థి సుధాకర్లాల్పై ప్రతీకారం తీర్చుకోవాలని ఆయన కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా గత ఎన్నికల్లో చేసిన తప్పును పునరావృతం చేయకుండా గత రెండు నెలలుగా కొరటగెరెలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. హోంమంత్రిగా ఉండగా కొరటగెరె నియోజకవర్గం అభివృద్ధి కోసం పరమేశ్వర్ ప్రభుత్వం నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో నిధులు విడుదల చేయించడంలో సఫలీకృతులయ్యారు. నియోజకవర్గంలో ఏకలవ్య పాఠశాల, కేఎస్ఆర్పీ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయగలిగారు. తరచూ పల్లె నిద్రలతో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.
త్రిముఖ పోటీ కలకలం
అయితే గత ఎన్నికల్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత తమ పార్టీలో లేకపోవడంతో బీజేపీ అభ్యర్థిని బరిలో దించకపోవడంతో కేవలం కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య మాత్రమే పోటీ నెలకొంది. అయితే ఈసారి కాంగ్రెస్,జేడీఎస్‌లతో పాటు ఎస్సీ వర్గానికి చెందిన బీజేపీ నేత హుచ్చయ్య పోటీలో ఉంటారని వార్తులు వస్తుండడంతో కొరటగెరెలో త్రిముఖ పోటీ తప్పదనే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇతర వర్గాలూ ప్రధానమే
ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 1.97లక్షలు ఉండగా అందులో ఎస్సీ, ఎస్టీ వర్గాల ఓట్లు 60వేలు ఉండగా లింగాయత్‌లు ఓట్లు 40వేలు, ఒక్కళిగల ఓట్లు 30వేలు ఉన్నాయి. ఇక ముస్లింలు, కురుబలు, గొల్ల సామాజిక వర్గానికి చెందిన ఓట్లు సుమారు 50వేల వరకూ ఉండగా, మిగిలిన వర్గాల ఓట్లు పదివేల లోపు ఉన్నాయి. త్రిముఖ పోటీ భయంతో ముగ్గురు నేతల తమ సామాజిక వర్గాల ఓట్లతో పాటు గెలుపోటములపై ప్రభావం చూపగలిగే లింగాయత్, ఒక్కళిగల ఓటర్లపై కూడా దృష్టి సారించారు.