ప్రేమపాశం
కూనారం(కాల్వశ్రీరాంపూర్) :
ప్రేమించానంటూ వెంటపడ్డాడు.. నీవు లేనిదే నేను లేనన్నాడు... తీరా పెళ్లి విషయమొచ్చేసరికి బయట బాగా కట్నమొస్తోందని, నిన్ను చేసుకోలేనని తెగేసి చెప్పడంతో మనస్తాపం చెందిన ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది. పెద్దపల్లి మండలం మూలసాలకు చెందిన మామిడి కుమార్, కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామానికి చెందిన మాసపత్రి సరిత(22) బంధువులు. ఒకరినొకరు ఇష్టపడ్డ వీరు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
బంధువులే కావడంతో ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న కుమార్‌కు ఇటీవల సంబంధాలు రాగా, కట్నం భారీగా వస్తుందనే ఆశతో కుమార్ తల్లిదండ్రులు సరితతో పెళ్లికి నిరాకరించారు. సరితనే పెళ్లి చేసుకుంటానని మొదట పట్టుబట్టిన కుమార్ తర్వాత తల్లిదండ్రుల ఒత్తిడికి తలొగ్గి మాట మార్చాడు. ప్రజాప్రతినిధి అయిన తన బాబాయి అండగా ఉంటానని చెప్పడంతో పెళ్లి చేసుకోనని కుమార్ సోమవారం ఉదయం ఫోన్లో సరితతో తేల్చిచెప్పాడు. దీంతో మనస్తాపం చెందిన సరిత ఇంట్లోకి వెళ్లి గడియపెట్టుకుని ఉరేసుకుంది. కుటుంబసభ్యులు ఇరుగుపొరుగువారి సహాయంతో తలుపులు పగలగొట్టగా అప్పటికే ఆమె ప్రాణాలు విడిచింది.
విషయం బయటకు పొక్కకుండా కుమార్ బంధువులు విఫలయత్నం చేశారు. గుండెపోటుతో చనిపోయినట్లు నమ్మించాలని మృతురాలి తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చారు. అయితే కుమార్ పెళ్లికి నిరాకరించడంతోనే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని సరిత తండ్రి రాజయ్య పొత్కపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుమార్‌తోపాటు, అతడి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ బుచ్చినాయుడు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.