Summer coaching
-
వేసవి శిక్షణ
వేసవి సెలవుల్ని సద్వినియోగపరచండి. విద్యార్థులకు ఆటపాటలపై శిక్షణ ఇవ్వండి. పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేయండి. మజ్జిగ.. తినుబండరాలు అందజేయండి.. అంటూ గ్రంథాలయాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. సెలవులు గడిచిపోతున్నాయి. శిక్షణ శిబిరాలు సాగుతున్నాయి. గ్రంథాలయ నిర్వాహకుల జేబులు ఖాళీ అవుతున్నాయి. ఇంతవరకు పైసా కూడా ప్రభుత్వం విదల్చలేదు. రెండు నెలలుగా వేతనాల్లేక.. అప్పులతో శిబిరాలను నిర్వహించలేక గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయ నిర్వాహకుల ఆవేదనకు అక్షర రూపమిది. రామభద్రపురం (బొబ్బిలి): వేసవి సెలవులు సద్వినియోగం కావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసింది. వీటిని ఏప్రిల్ 25 నుంచి జూన్ 7 వరకు 45 రోజుల పాటు నిర్వహిస్తారు. శిక్షణ శిబిరాల్లో 5 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న విద్యార్థులు పాల్గొంటారు. రోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. ప్రతిపాదనలే.. పైసల్లేవ్ శిబిరాల్లో విద్యార్థులతో పుస్తకాలు చదివించాలి. కథలు చెప్పించాలి. చిత్రలేఖనం, సంగీతం, నృత్యం, ఆటపాటలు, స్టేజి డ్రామాలకు శిక్షణ ఇప్పించాలి. అటలు, పాటలు, నృత్యం, కథల పోటీలు నిర్వహించాలి. విజేతలకు బహుమతులు ఇవ్వాలి. శిక్షణ పొందేవారికి మజ్జిగ, తినుబండారాలు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. శిబిరాల నిర్వహణకు ఒక్కొక్క కేంద్ర గ్రంథాలయానికి రూ.25 వేలు, ద్వితీయ శ్రేణి గ్రంథాలయాలకు రూ.12 వేలు, తృతీయ శ్రేణి గ్రంథాలయాలకు రూ.10 వేలు, గ్రామీణ ప్రాంత గ్రంథాలయాలకు రూ.8 వేల చొప్పున నిర్వహణ ఖర్చులు ఇవ్వాలని నిర్ణయించినా ఇప్పటి వరకు పైసా కూడా మంజూరు చేయలేదు. దీంతో గ్రంథాలయ నిర్వహకులు సొంత నిధులు ఖర్చు పెట్టి శిబిరాలను నిర్వహించాల్సి వస్తోంది. రోజుకు రూ.300 నుంచి రూ.400 వరకు ఖర్చవుతోందని సిబ్బంది చెబుతున్నారు. రెండు నెలలుగా వేతనాల్లేవ్ జిల్లా వ్యాప్తంగా పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో 42 శాఖా గ్రంథాలయాలను నిర్వహిస్తున్నారు. వీటిలో శాశ్వత సిబ్బంది 38 మంది, ఔట్ సోర్సింగ్ సిబ్బంది 12 మంది, తాత్కాలిక సిబ్బంది 9 మంది పనిచేస్తున్నారు. వీరందరికి మార్చి, ఏప్రిల్ వేతనాలు ఇంత వరకూ ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణకు నానా పాట్లు పడుతున్నారు. విద్యుత్, పేపర్, స్వీపర్ ఖర్చులు కూడా రెండు నెలలుగా అందక పోవడంతో సొంత నిధులు వెచ్చించాల్సి వస్తోందని గ్రంథాలయ నిర్వాహకులు వాపోతున్నారు. అప్పులు చేస్తున్నాం ప్రభుత్వం గ్రంథాలయాల్లో వేసవి శిక్షణ శిబిరాల నిర్వహణకు నిధులు విడుదల చేయక పోవడంతో సొంత నిధులు ఖర్చు చేస్తున్నాం. రెండు నెలలుగా వేతనాలు, విద్యుత్, పేపర్ బిల్లులు చెల్లించలేదు. ప్రతి నెలా అప్పు చేయాలంటే ఇబ్బందిగా ఉంది. – కృష్ణమూర్తి, నిర్వాహకుడు,శాఖా గ్రంథాలయం -
చదువులహీట్..!
ఒంగోలు, కారంచేడు: జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని వెనుకబడిన విద్యార్థులను మెరుగు పరచడం కోసం ‘జ్ఞానధార’ అనే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీని కోసం వేసివి సెలవులను ఉపయోగించుకోవాలనే ఆదేశాలు అందాయి. అయితే దీని అమలుపై సందేహాలెన్నో నెలకొన్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో వెనుక బడిన విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. 5వ తరగతి చదివే వారు మొత్తం 5082 మంది ఉన్నారు. 9వ తరగతి చదివే విద్యార్థులు 17672 మంది ఉన్నట్లు అంచనా. వీరందరికీ ఈ నెల 7వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెసిడెన్సియల్ పాఠశాలల ద్వారా తరగతులు నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే బాలురు, బాలికలకు ప్రత్యేకంగా భోజన, వసతి గృహాలను ఏర్పాటు చేసింది. వీరంతా వచ్చే విద్యా సంవత్సరంలో 6వ తరగతి, 10వ తరగతిలోకి ప్రవేశించనున్నారు. మిగిలిన విద్యార్థులతో పోల్చుకుంటే వీరు కొంత వెనుబడి ఉండటంతో చదవడం, రాయడంతో పాటు తోటి విద్యార్థులతో పోటీ పడేలా తయారు చేయడం ఈ కార్యక్రమ లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. గత విద్యా సంవత్సరంలో నిర్వహించిన పరీక్షల్లో సీ, డీ గ్రేడ్లు వచ్చిన వారిని గుర్తించిన వారిని మాత్రమే ఎంపిక చేశారు. జిల్లా వ్యాప్తంగా 68 సెంటర్లు ఎంపిక చేయగా ఆ తర్వాత 99 సెంటర్లకు పెంచారు. ఆసక్తి చూపని తల్లిదండ్రులు.. జ్ఞానధార తరగతులకు తమ పిల్లలను పంపేందుకు వారి తల్లిదండ్రులు అంతగా ఆసక్తి కనబర్చడం లేదు. సంవత్సరమంతా చదివినా వారిలో నైపుణ్యం పెరగనప్పుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసే ఈ తరగతుల్లో ఎంత వరకు మెరుగు పడుతుందని ప్రశ్నిస్తున్నారు. వేసవిలో కూడా ఆటవిడుపు లేకుంటే ఎలా అని మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు. నెల రోజుల పాటు పిల్లలను హాస్టల్‌కు పంపి ఎలా ఉండాలనుకొనే వారు కూడా ఉన్నారు. ఇలాంటి కారణాలతో ఈ కార్యక్రమం అంతగా సక్సెస్ కాకపోవచ్చని తల్లిదండ్రులు, అయ్యవార్లు అభిప్రాయపడుతున్నారు. అయితే పిల్లలను ప్రత్యేక తరగతులకు తీసుకువచ్చే బాధ్యత ఉపాధ్యాయులదే అని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడంతో తికమకపడుతున్నారు. ఒక్క పర్చూరు నియోజకవర్గంలోనే 770 మంది బాలురు, 768 మంది బాలికలు కలిపి మొత్తం 1538 మంది వెనుకబడిన విద్యార్థులున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం జిల్లాలో వేడి గాలులు, ఎండలు ఎక్కువయ్యాయి. పశ్చిమ ప్రకాశంలో ఉష్ణోగ్రతలు దంచి కొడుతున్నాయి. ఇలాంటి పరిస్థి«తుల్లో విద్యార్థులకు ఏర్పాటు చేసే వసతులు ఎలా ఉంటాయో అని తల్లిదండ్రులు అందోళన చెందుతున్నారు. వారికి అవసరమైన భోజన, వసతులతో పాటు ప్రధానంగ తాగునీటి ఎద్దడి లేకుండా చూడాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు. పగడ్బందీగా నిర్వహించాలి: 9, 14 సంవత్సరాల బాలికలను వేసవి తరగతులకు పంపడానికి తల్లిదండ్రులు సంకోచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బాలికలకు రక్షణ లేకుండా పోయింది. ఎక్కడ చూసినా చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని బాలికల తల్లులు వారిని బైటకు పంపాలంటే చాలా భయపడుతున్నారు. కార్యక్రమం సక్సెస్ అవ్వాలంటే వారి కోసం ఏర్పాటు చేసే రెసిడెన్సియల్‌కు పటిష్ట భద్రత ఉండాలి. బాలికల కోసం ఏర్పాటు చేసే క్యాంపస్‌లో మహిళా సిబ్బంది, ఉపాధ్యాయులనే నియమిస్తే తల్లిదండ్రులకు భరోసాగా ఉంటుంది.- రావి పద్మావతి ఉపాధ్యాయురాలు.. -
బియ్యం లేవట..
ఖమ్మంరూరల్: ఆటలు, నృత్యాలు, హార్స్ రైడింగ్, స్పోకెన్ ఇంగ్లిష్, భావ వ్యక్తీకరణ, వ్యక్తిత్వ వికాసం తదితర అంశాల్లో గురుకుల పాఠశాలల విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చేందుకు సొసైటీలు బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. వేసవి శిక్షణ శిబిరాల్లో వారిని మెరికల్లా మారుస్తూ.. సమాజంలో ఉన్నత స్థితికి చేరేలా నిష్ణాతులైన వారిచే ప్రత్యేక శ్రద్ధపెట్టి తీర్చిదిద్దుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. శిక్షణ పొందుతున్న విద్యార్థులకు భోజనం అందించే విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు నానా తంటాలు పడుతున్నారు. బియ్యం కేటాయింపుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు ప్రత్యేక శిబిరాల నిర్వహణ తలకు మించిన భారమవుతోంది. శిబిరాల కోసం అవసరమయ్యే బియ్యం కోటా ఇవ్వలేమని పౌరసరఫరాల శాఖ తేల్చి చెప్పడంతో గురుకుల సొసైటీలు ఆందోళన చెందుతున్నాయి. సొసైటీలు ప్రతి సంవత్సరం సమ్మర్ క్యాంపు(వేసవి శిబిరం)లో భాగంగా వివిధ సొసైటీల ఆధ్వర్యంలో నడుస్తున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల పాఠశాలల్లో చురుకైన, ఆసక్తి ఉన్న విద్యార్థులను ఎంపిక చేసి.. క్రీడలు, డ్యాన్స్‌లు, హార్స్ రైడింగ్, స్పోకెన్ ఇంగ్లిష్, భావ వ్యక్తీకరణ, వ్యక్తిత్వ వికాసం వంటి 27 అంశాల్లో శిక్షణ ఇస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు విషయాలపై అవగాహన కల్పిస్తుండటంతో విద్యార్థులకు వసతితోపాటు భోజన సదుపాయం కూడా గురుకుల సొసైటీలు సమకూర్చాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రత్యేకంగా బియ్యం కోటా ఇవ్వాలని పౌరసరఫరాల శాఖను కోరగా.. తాము ఇవ్వలేమని చెప్పడంతో విద్యార్థులకు భోజనం ఎలా అందించాలని సొసైటీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. క్యాంపుల్లో 1,200 విద్యార్థులు ఇదిలా ఉండగా.. జిల్లాలో 14 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఒక డిగ్రీ కళాశాల ఉంది. డిగ్రీ కళాశాలలో వార్షిక పరీక్షలు నిర్వహిస్తున్నందున అక్కడ వేసవి శిబిరం నిర్వహించే అవకాశం ఉండదు. మిగిలిన 13 గురుకుల పాఠశాలల్లో క్యాంపులు ఏర్పాటు చేయాలని సొసైటీలు భావించినా.. బియ్యం కొరతతో ఏర్పాటు చేయలేకపోతున్నారు. మొత్తం 14 గురుకులాల్లో 5,089 మంది విద్యార్థినీ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రస్తుతం వేసవి శిబిరాల్లో భాగంగా ఎనిమిది చోట్ల క్యాంపులు నిర్వహిస్తున్నారు. 1,200 విద్యార్థులు శిబిరంలో పాల్గొంటున్నారు. వీరికి వసతితోపాటు భోజనం ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకోసం 7.5 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం ఇవ్వాలని సొసైటీలు ప్రతిపాదనలు చేశాయి. అయితే ప్రత్యేక బియ్యం కోటాపై ప్రభుత్వం కూడా ఎటువంటి సూచనలు చేయలేదని, కోటా విడుదల సాధ్యం కాదని పౌరసరఫరాల శాఖ తేల్చి చెప్పింది. దీంతో సొసైటీలు సర్దుబాటు ప్రయత్నాల్లో తలమునకలయ్యాయి. గత విద్యా సంవత్సరం కేటాయించిన కోటాలో పాఠశాలలవారీగా మిగులు బియ్యం ఏమైనా ఉన్నాయా.. ఇంకా వేరేవిధంగా బియ్యా న్ని ఎలా సమకూర్చుకోవాలనే ప్రయత్నాల్లో అధికారులు నిమగ్నమయ్యారు. అలా మిగిలి ఉన్న బియ్యాన్ని క్యాంపులోని పిల్లలకు సర్దుబాటు చేయాలా.. లేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలా.. అని ఆలోచిస్తున్నాయి. కాగా.. నెలరోజుల క్యాంపు నిర్వహణకు మొత్తం 7.5 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉన్నట్లు సొసైటీ అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం బియ్యం ఇవ్వాలని పౌరసరఫరాల శాఖకు ప్రతిపాదించారు. అయితే బియ్యం పంపిణీ చేస్తేనే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని, లేదంటే ఆకలి కేకలు తప్పేట్లు లేదని ఉపాధ్యాయులు అంటున్నారు. -
అతడిది అదో టైపు!
హైదరాబాద్‌లో పాతబస్తీలోని తలాబ్‌కట్ట దగ్గర నివసించే మహమ్మద్ ఖుర్షీద్ హుస్సేన్ రెండు గిన్నిస్ రికార్డులు అందుకున్నారు. రెండూ టైప్ చేయడంలోనే. 2012వ సంవత్సరం ఫిబ్రవరి రెండవ తేదీన ఇంగ్లిష్ అక్షరమాలను 3.43 సెకన్లలో టైప్ చేయడంలో మొదటి రికార్డు సాధించారు. అది మాత్రం చేత్తోనే. ఆ తర్వాత మరింత సృజనాత్మకంగా మరేదైనా చేయాలనిపించడంతో ఇలా ముక్కుతో టైప్ చేశాడు. ‘‘అప్పుడు నాకు ఏడేళ్లు. సమ్మర్ కోచింగ్ క్యాంపులో చేర్చింది మా అమ్మ. అక్కడ శిక్షకులు, సీనియర్ స్టూడెంట్స్ నేను టైప్ చేసే వేగం చూసి ఆశ్చర్యపోయేవారు. ప్రాక్టీస్ చేస్తే రికార్డు సాధించవచ్చు అని చెప్పారు. అప్పుడు పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. మా అమ్మకు పిల్లలు చురుగ్గా ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకంలో ఉండడం ఇష్టం. ఆమె రోజూ పేపర్ చదివి, పిల్లలు సాధించిన విజయాల వార్తలను మాకు చూపించేది. అలా నాకు కూడా ఏదో ఒక ప్రత్యేకత సాధించాలనిపించింది. నాకు బాగా వచ్చిన టైప్‌లోనే ప్రయత్నిద్దామనుకున్నాను’’ అని వివరించారీ యువకుడు. టైప్ చేయడంలో వేగం పెంచుకోవడానికి ఖుర్షీద్ కఠోరమైన సాధన చేశాడనే చెప్పాలి. రోజుకు ఎనిమిది గంటల సాధన చేయడంలో స్నేహితులు, కాలేజ్ యాజమాన్యం, తండ్రి అందరూ అతడికి సహకరించారు. బిటెక్ చదువుతున్న సమయంలో ‘కెఎమ్ఐటి’ కాలేజ్ యాజమాన్యం మధ్యాహ్నం నుంచి ఖుర్షీద్ టైప్ ప్రాక్టీస్ చేసుకోవడానికి అనుమతిచ్చింది. టైప్ మొదలు పెట్టగానే టైమ్ రికార్డు చేయడానికి స్నేహితులు సహకరించేవారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ పని తండ్రి అక్బర్ హుస్సేన్ చేసేవారు. ఇంటివద్ద రాత్రి ఏడు నుంచి పదకొండు వరకు సాధన చేసేవారు. ‘‘ఒక్కోసారి రాత్రి ఒంటిగంట అయినా ప్రాక్టీస్ ఇక చాలంటే వినేవాడు కాదు. నేను రికార్డు బ్రేక్ చేస్తాను పాపా... అని మొండిగా సాధన చేస్తుంటే ఖుర్షీద్‌తోపాటు కూర్చుని టైమ్ రికార్డు చేసేవాడిని. మామూలు కీబోర్డు రెండు వందలకు వస్తుంది. టీవీఎస్ కీబోర్డు అయితే సౌకర్యంగా ఉంటుందంటే పదిహేను వందలు పెట్టి కొన్నాను. కొన్నిసార్లు ఆర్థికంగా సర్దుబాట్లు చేసుకుని మరీ డబ్బు సిద్ధం చేశాను. బాబు గిన్నిస్ రికార్డు సాధించాడనే ఆనందం కంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించి విజయుడైనందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు తండ్రి అక్బర్. ఖుర్షీద్ చక్కటి క్రికెట్ క్రీడాకారుడు కూడా. గౌతమ్ మోడల్ స్కూల్లో క్రికెట్ జట్టుకి కెప్టెన్. పదవ తరగతిలో తల్లిదండ్రుల హెచ్చరికతో పుస్తకాలకే పరిమితమయ్యాడు. ‘‘క్రికెట్లో రాణించాలంటే చదువును పక్కన పెట్టి మరీ ప్రాక్టీస్ చేయాలి. పైగా చాలా ఖర్చవుతుంది. అంత ఖర్చుని భరించడం మాకు కష్టమే. దాంతో ఖుర్షీద్‌ని క్రికెటే కెరీర్ కావాలనుకుంటున్నావా, చదువు మీద ఆసక్తి ఉందా లేదా... అని అడిగితే చదువును పక్కన పెట్టడానికి ఇష్టపడలేదు. దాంతో ఖుర్షీద్ క్రికెట్ ప్రాక్టీస్ పాఠశాల స్థాయిలోనే ఆగిపోయింది. బాబు బెంగపెట్టుకోకూడదనే ఉద్దేశంతో... దేశమంతటా నీ పేరు తెలియాలంటే ఇంకా చాలా మార్గాలున్నాయని చెప్పాను. అలా తన దృష్టి రికార్డుల మీదకు మళ్లింది’’ అంటారు ఖుర్షీద్ తల్లి దిల్నాజ్ బేగం. ముక్కుతో టైప్ చేసే క్రమంలో జటిలమైన ఇబ్బందులనే ఎదుర్కొన్నాడు ఖుర్షీద్. టైప్ రైటర్ మీద సాధన చేయడంతో ముక్కు టైప్‌రైటర్ కీస్ మధ్యలో నలిగి, ముక్కు దూలానికి గాయమై రక్తం కారింది. వైద్యం చేసిన డాక్టర్ మందలించారు కూడా. ఆ సందిగ్ధ సమయంలో అమ్మ ఇచ్చిన ప్రోత్సాహమే నన్ను ముందుకు నడిపించింది. ‘‘దేశానికి రికార్డు తీసుకురావడంలో అయిన గాయం ఇది. రికార్డు వస్తే ప్రపంచ రికార్డుల జాబితాలో ఇండియా పేరు మరోసారి నమోదవుతుంది. గాయం నీ ఒక్కడిదే. రికార్డు దేశానిది. ప్రాక్టీస్ అపేసి నీ మనసు కష్టపెట్టుకుని, అసంతృప్తి చెందడం కంటే కొంత విరామం తీసుకుని గాయం తగ్గిన తర్వాత ప్రాక్టీస్ కొనసాగించు...’’ అని చెప్పింది. అంతటితో ఆగిపోలేదు. ‘‘ఖురాన్ చెప్పిన సూక్తులను విశ్వసించు. అవి నీలో ఆత్మవిశ్వాసం సడలకుండా మానసిక ధైర్యాన్నిస్తాయి...’’ అని కూడా చెప్పింది. అలాగే రికార్డు సాధనకు దేహదారుఢ్యం కూడా చక్కగా ఉండాలని శిక్షణ ఇప్పించింది. రోజూ ఉదయం కనీసం మూడు కిలోమీటర్ల దూరం పరుగెత్తడం, ఆ తర్వాత జిమ్‌లో వ్యాయామం తప్పనిసరి చేసింది’’ అని తన విజయంలో అడుగడుగునా ఉన్న తల్లి పాత్రను గుర్తు చేసుకున్నారు ఖుర్షీద్. ఈ ఏడాది బి.టెక్. పూర్తి చేసిన ఖుర్షీద్ పైచదువుల కోసం అమెరికా వెళ్తున్నారు. ఎంఎస్ చేయడానికి చికాగోలోని వాల్పరాసియో యూనివర్శిటీలో సీటు వచ్చింది. రానున్న ఆగస్టు ఐదవ తేదీ అమెరికా వెళ్లే విమానం ఎక్కనున్నారు. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసంతోపాటు ఇండియాకు మరిన్ని రికార్డులు సాధించడమే తన లక్ష్యం అంటారు. తల్లి తనకు పేపర్లలో వచ్చిన ప్రముఖులను ఆదర్శంగా చూపించేది. అలాంటిది తమ్ముళ్లిద్దరికీ తాను రోల్‌మోడల్ కావడం గర్వంగా ఉందంటారు. - వాకా మంజులారెడ్డి ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ హ్యావ్ చాలెంజ్డ్ మి టు టైప్ దిస్ సెంటెన్స్ యూజింగ్ మై నోస్ ఇన్ ద ఫాస్టెస్ట్ టైమ్’ ఈ వాక్యాన్ని ఇంగ్లిష్‌లో అక్షర దోషాలు, విరామ దోషాలు లేకుండా టైప్ చేయాలి. ఈ వాక్యాన్ని ఆరేళ్ల కిందట దుబాయ్‌లో ఓ అమ్మాయి ఒక నిమిషం 33 సెకన్ల సమయంలో టైప్ చేసి రికార్డు సృష్టించింది. 103 వర్ణాలున్న ఇదే వాక్యాన్ని 47.44 సెకన్ల సమయంలో టైప్ చేసి రికార్డును బ్రేక్ చేశాడు ఓ భారతీయుడు. ఆ కుర్రాడే -ఖుర్షీద్ హుస్సేన్. టైప్‌తో పరిచయం ఉన్న ఎవరికైనా... ఈ వాక్యాన్ని టైప్ చేయడానికి అంత సమయం తీసుకున్నారా? దానికి ప్రపంచ రికార్డు దక్కడమా అనే సందేహం వచ్చి తీరుతుంది. ఇది అలవోకగా చేతివేళ్లతో టైప్ చేయడంలో పోటీ కాదు. ముక్కుతో టైప్ చేయడంలో రికార్డు. గాయం నీ ఒక్కడిదే. రికార్డు దేశానిది. ప్రాక్టీస్ అపేసి నీ మనసు కష్టపెట్టుకుని, అసంతృప్తి చెందడం కంటే కొంత విరామం తీసుకుని గాయం తగ్గిన తర్వాత ప్రాక్టీస్ కొనసాగించు... అని అమ్మ దిల్నాజ్ బేగం చెప్పిన మాటలు ఖుర్షీద్‌కు స్ఫూర్తినిచ్చాయి. టైపింగ్‌లో రెండు గిన్నిస్ రికార్డులు సాధించిన తొలి భారతీయుడు ఖుర్షీద్ 2012లో చేతితో 3.43 సెకన్లలో ఇంగ్లిష్ అక్షరమాల టైప్‌చేయడం ఈ ఏడాది ముక్కుతో టైపింగ్‌లో రికార్డ్.