అతడిది అదో టైపు! | Hyderabad Man sets new world record for typing with his NOSE | Sakshi
Sakshi News home page

అతడిది అదో టైపు!

Published Thu, Jun 26 2014 10:29 PM | Last Updated on Sat, Sep 2 2017 9:26 AM

అతడిది అదో టైపు!

అతడిది అదో టైపు!

హైదరాబాద్‌లో పాతబస్తీలోని తలాబ్‌కట్ట దగ్గర నివసించే మహమ్మద్ ఖుర్షీద్ హుస్సేన్ రెండు గిన్నిస్ రికార్డులు అందుకున్నారు. రెండూ టైప్ చేయడంలోనే. 2012వ సంవత్సరం ఫిబ్రవరి రెండవ తేదీన ఇంగ్లిష్ అక్షరమాలను 3.43 సెకన్లలో టైప్ చేయడంలో మొదటి రికార్డు సాధించారు. అది మాత్రం చేత్తోనే. ఆ తర్వాత మరింత సృజనాత్మకంగా మరేదైనా చేయాలనిపించడంతో ఇలా ముక్కుతో టైప్ చేశాడు.

‘‘అప్పుడు నాకు ఏడేళ్లు. సమ్మర్ కోచింగ్ క్యాంపులో చేర్చింది మా అమ్మ. అక్కడ శిక్షకులు, సీనియర్ స్టూడెంట్స్ నేను టైప్ చేసే వేగం చూసి ఆశ్చర్యపోయేవారు. ప్రాక్టీస్ చేస్తే రికార్డు సాధించవచ్చు అని చెప్పారు. అప్పుడు పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. మా అమ్మకు పిల్లలు చురుగ్గా ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకంలో ఉండడం ఇష్టం. ఆమె రోజూ పేపర్ చదివి, పిల్లలు సాధించిన విజయాల వార్తలను మాకు చూపించేది. అలా నాకు కూడా ఏదో ఒక ప్రత్యేకత సాధించాలనిపించింది. నాకు బాగా వచ్చిన టైప్‌లోనే ప్రయత్నిద్దామనుకున్నాను’’ అని వివరించారీ యువకుడు.

టైప్ చేయడంలో వేగం పెంచుకోవడానికి ఖుర్షీద్ కఠోరమైన సాధన చేశాడనే చెప్పాలి. రోజుకు ఎనిమిది గంటల సాధన చేయడంలో స్నేహితులు, కాలేజ్ యాజమాన్యం, తండ్రి అందరూ అతడికి సహకరించారు. బిటెక్ చదువుతున్న సమయంలో ‘కెఎమ్‌ఐటి’ కాలేజ్ యాజమాన్యం మధ్యాహ్నం నుంచి ఖుర్షీద్ టైప్ ప్రాక్టీస్ చేసుకోవడానికి అనుమతిచ్చింది. టైప్ మొదలు పెట్టగానే టైమ్ రికార్డు చేయడానికి స్నేహితులు సహకరించేవారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ పని తండ్రి అక్బర్ హుస్సేన్ చేసేవారు.

ఇంటివద్ద రాత్రి ఏడు నుంచి పదకొండు వరకు సాధన చేసేవారు. ‘‘ఒక్కోసారి రాత్రి ఒంటిగంట అయినా ప్రాక్టీస్ ఇక చాలంటే వినేవాడు కాదు. నేను రికార్డు బ్రేక్ చేస్తాను పాపా... అని మొండిగా సాధన చేస్తుంటే ఖుర్షీద్‌తోపాటు కూర్చుని టైమ్ రికార్డు చేసేవాడిని. మామూలు కీబోర్డు రెండు వందలకు వస్తుంది. టీవీఎస్ కీబోర్డు అయితే సౌకర్యంగా ఉంటుందంటే పదిహేను వందలు పెట్టి కొన్నాను. కొన్నిసార్లు ఆర్థికంగా సర్దుబాట్లు చేసుకుని మరీ డబ్బు సిద్ధం చేశాను. బాబు గిన్నిస్ రికార్డు సాధించాడనే ఆనందం కంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించి విజయుడైనందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు తండ్రి అక్బర్.
 
ఖుర్షీద్ చక్కటి క్రికెట్ క్రీడాకారుడు కూడా. గౌతమ్ మోడల్ స్కూల్‌లో క్రికెట్ జట్టుకి కెప్టెన్. పదవ తరగతిలో తల్లిదండ్రుల హెచ్చరికతో పుస్తకాలకే పరిమితమయ్యాడు. ‘‘క్రికెట్‌లో రాణించాలంటే చదువును పక్కన పెట్టి మరీ ప్రాక్టీస్ చేయాలి. పైగా చాలా ఖర్చవుతుంది. అంత ఖర్చుని భరించడం మాకు కష్టమే. దాంతో ఖుర్షీద్‌ని క్రికెటే కెరీర్ కావాలనుకుంటున్నావా, చదువు మీద ఆసక్తి ఉందా లేదా... అని అడిగితే చదువును పక్కన పెట్టడానికి ఇష్టపడలేదు. దాంతో ఖుర్షీద్ క్రికెట్ ప్రాక్టీస్ పాఠశాల స్థాయిలోనే ఆగిపోయింది. బాబు బెంగపెట్టుకోకూడదనే ఉద్దేశంతో... దేశమంతటా నీ పేరు తెలియాలంటే ఇంకా చాలా మార్గాలున్నాయని చెప్పాను. అలా తన దృష్టి రికార్డుల మీదకు మళ్లింది’’ అంటారు ఖుర్షీద్ తల్లి దిల్‌నాజ్ బేగం.
 
ముక్కుతో టైప్ చేసే క్రమంలో జటిలమైన ఇబ్బందులనే ఎదుర్కొన్నాడు ఖుర్షీద్. టైప్ రైటర్ మీద సాధన చేయడంతో ముక్కు టైప్‌రైటర్ కీస్ మధ్యలో నలిగి, ముక్కు దూలానికి గాయమై రక్తం కారింది. వైద్యం చేసిన డాక్టర్ మందలించారు కూడా. ఆ సందిగ్ధ సమయంలో అమ్మ ఇచ్చిన ప్రోత్సాహమే నన్ను ముందుకు నడిపించింది. ‘‘దేశానికి రికార్డు తీసుకురావడంలో అయిన గాయం ఇది. రికార్డు వస్తే ప్రపంచ రికార్డుల జాబితాలో ఇండియా పేరు మరోసారి నమోదవుతుంది. గాయం నీ ఒక్కడిదే. రికార్డు దేశానిది. ప్రాక్టీస్ అపేసి నీ మనసు కష్టపెట్టుకుని, అసంతృప్తి చెందడం కంటే కొంత విరామం తీసుకుని గాయం తగ్గిన తర్వాత ప్రాక్టీస్ కొనసాగించు...’’ అని చెప్పింది. అంతటితో ఆగిపోలేదు.

‘‘ఖురాన్ చెప్పిన సూక్తులను విశ్వసించు. అవి నీలో ఆత్మవిశ్వాసం సడలకుండా మానసిక ధైర్యాన్నిస్తాయి...’’ అని కూడా చెప్పింది. అలాగే రికార్డు సాధనకు దేహదారుఢ్యం కూడా చక్కగా ఉండాలని శిక్షణ ఇప్పించింది. రోజూ ఉదయం కనీసం మూడు కిలోమీటర్ల దూరం పరుగెత్తడం, ఆ తర్వాత జిమ్‌లో వ్యాయామం తప్పనిసరి చేసింది’’ అని తన విజయంలో అడుగడుగునా ఉన్న తల్లి పాత్రను గుర్తు చేసుకున్నారు ఖుర్షీద్.
 
ఈ ఏడాది బి.టెక్. పూర్తి చేసిన ఖుర్షీద్ పైచదువుల కోసం అమెరికా వెళ్తున్నారు. ఎంఎస్ చేయడానికి చికాగోలోని వాల్‌పరాసియో యూనివర్శిటీలో సీటు వచ్చింది. రానున్న ఆగస్టు ఐదవ తేదీ అమెరికా వెళ్లే విమానం ఎక్కనున్నారు. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసంతోపాటు ఇండియాకు మరిన్ని రికార్డులు సాధించడమే తన లక్ష్యం అంటారు. తల్లి తనకు పేపర్లలో వచ్చిన ప్రముఖులను ఆదర్శంగా చూపించేది. అలాంటిది తమ్ముళ్లిద్దరికీ తాను రోల్‌మోడల్ కావడం గర్వంగా ఉందంటారు.
 
- వాకా మంజులారెడ్డి
 
‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ హ్యావ్ చాలెంజ్‌డ్ మి టు టైప్ దిస్ సెంటెన్స్ యూజింగ్ మై నోస్ ఇన్ ద ఫాస్టెస్ట్ టైమ్’ ఈ వాక్యాన్ని ఇంగ్లిష్‌లో అక్షర దోషాలు, విరామ దోషాలు లేకుండా టైప్ చేయాలి. ఈ వాక్యాన్ని ఆరేళ్ల కిందట దుబాయ్‌లో ఓ అమ్మాయి ఒక నిమిషం 33 సెకన్ల సమయంలో టైప్ చేసి రికార్డు సృష్టించింది. 103 వర్ణాలున్న ఇదే వాక్యాన్ని 47.44 సెకన్ల సమయంలో టైప్ చేసి రికార్డును బ్రేక్ చేశాడు ఓ భారతీయుడు. ఆ కుర్రాడే -ఖుర్షీద్ హుస్సేన్. టైప్‌తో పరిచయం ఉన్న ఎవరికైనా... ఈ వాక్యాన్ని టైప్ చేయడానికి అంత సమయం తీసుకున్నారా? దానికి ప్రపంచ రికార్డు దక్కడమా అనే సందేహం వచ్చి తీరుతుంది. ఇది అలవోకగా చేతివేళ్లతో టైప్ చేయడంలో పోటీ కాదు. ముక్కుతో టైప్ చేయడంలో రికార్డు.
 
గాయం నీ ఒక్కడిదే. రికార్డు దేశానిది. ప్రాక్టీస్ అపేసి నీ మనసు కష్టపెట్టుకుని, అసంతృప్తి చెందడం కంటే కొంత విరామం తీసుకుని గాయం తగ్గిన తర్వాత ప్రాక్టీస్ కొనసాగించు... అని అమ్మ దిల్‌నాజ్ బేగం చెప్పిన మాటలు ఖుర్షీద్‌కు స్ఫూర్తినిచ్చాయి.
 
టైపింగ్‌లో రెండు గిన్నిస్ రికార్డులు సాధించిన తొలి భారతీయుడు ఖుర్షీద్  
2012లో చేతితో 3.43 సెకన్లలో ఇంగ్లిష్ అక్షరమాల టైప్‌చేయడం
ఈ ఏడాది ముక్కుతో టైపింగ్‌లో రికార్డ్.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement