షఫాలీ వర్మ ఆశాభావం
న్యూఢిల్లీ: దాదాపు ఐదేళ్ల పాటు భారత మహిళల క్రికెట్ జట్టులో కీలక ప్లేయర్‌గా పలు విజయాల్లో భాగంగా ఉన్న షఫాలీ వర్మ(Shafali Verma) మూడు నెలల క్రితం టీమ్‌లో చోటు కోల్పోయింది. ముందుగా ఆస్ట్రేలియాతో, ఆపై స్వదేశంలో వెస్టిండీస్, ఐర్లాండ్‌లతో సిరీస్‌లకు కూడా ఆమెను ఎంపిక చేయలేదు. అయితే ఆ తర్వాత దేశవాళీ క్రికెట్‌లో చెలరేగిన షఫాలీ పరుగుల వరద పారించింది. సీనియర్ వన్డే చాలెంజర్ టోర్నీలో 5 మ్యాచ్‌లలోనే 82.80 సగటుతో 414 పరుగులు సాధించింది.
ఇదే జోరులో తాను భారత జట్టులోకి పునరాగమనం చేస్తాని షఫాలీ విశ్వాసం వ్యక్తం చేసింది. ‘గత కొన్ని నెలలు నా జీవితంలో కఠినంగా గడిచాయి. నాన్నకు అనూహ్యంగా గుండెపోటు వచ్చిన రెండు రోజులకే టీమ్‌లో స్థానం కోల్పోయాను. మానసికంగా ఎంతో ఇబ్బంది పడ్డా. అయితే నా కుటుంబం నాకు అండగా నిలిచి ప్రోత్సహించింది. అందుకే మళ్లీ మైదానంలో పట్టుదలగా ఆడగలిగా. నాకు అవకాశం వచ్చిన ప్రతీసారి భారీగా పరుగులు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా.
పూర్తిగా దానిపైనే దృష్టి పెట్టా. అందు కోసం పట్టుదలగా సిద్ధం కావడమే నేను చేయగలిగింది. ఇలాగే ప్రాక్టీస్ కొనసాగించి పరుగులు సాధిస్తే తిరిగి భారత జట్టులో రాగలను’ అని షఫాలీ వ్యాఖ్యానించింది. డబ్ల్యూపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న షఫాలీ ప్రస్తుతం సన్నాహకాల్లో ఉంది. సీజన్ ఆరంభానికి ముందు క్యాపిటల్స్ నిర్వహిస్తున్న ప్రత్యేక క్యాంప్‌లో ఆమె పాల్గొంటోంది.
డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌ల ద్వారా ఇన్నింగ్స్ ఎలా నిర్మించాలో తాను నేర్చుకున్నానని ఆమె వెల్లడించింది. ‘డబ్ల్యూపీఎల్‌లో ప్లేయర్లకు ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం లభిస్తుంది. ఆటలో స్వల్ప మార్పులు కూడా చేసుకోవచ్చు. వ్యక్తిగతంగా చూస్తే ఇన్నింగ్స్ ఎలా నిర్మించాలో నేర్చుకోగలిగాను. అనుభవజు్ఞలైన విదేశీ క్రికెటర్లతో కలిసి ఆడే అవకాశం రావడం ఎంతో మేలు చేస్తుంది.
మైదానంలో కీలక సమయాల్లో, మైదానం బయట కూడా ప్రశాంతంగా ఎలా ఉండవచ్చో వారిని చూస్తే తెలుస్తుంది. తాజా సీజన్ కోసం మా జట్టు సన్నాహాలు చాలా బాగా సాగుతున్నాయి’ అని షఫాలీ పేర్కొంది. డబ్ల్యూపీఎల్ రెండు సీజన్లలో కూడా ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ టైటిల్ సాధించడంలో మాత్రం విఫలమైంది.
Comments
Please login to add a commentAdd a comment