టెస్టుల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన భారత ఓపెనర్
స్మృతి మంధాన సెంచరీ
తొలి వికెట్‌కు ప్రపంచ రికార్డు భాగస్వామ్యం
తొలి రోజే 525 పరుగులు చేసిన భారత మహిళల జట్టు
భారత మహిళా క్రికెటర్లా... మజాకా! దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో చెన్నైలో ఆరంభమైన ఏకైక టెస్టును టీమిండియా రికార్డుల జడివానతో మొదలుపెట్టింది. ‘ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ’... తొలి వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం... ఒకేరోజు అత్యధిక జట్టు స్కోరు... ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు... ఇలా ఒకటేమిటి అన్ని కలగలిపి అతివల క్రికెట్లో అపూర్వ రికార్డుల జాతరను మన మహిళల జట్టు ఆవిష్కరించింది.
ఈ మ్యాచ్‌ను చూసిన వారందరికి ఆడుతోంది అమ్మాయిలేనా? జరుగుతోంది టెస్టా లేదంటే వన్డేనా అన్న అనుమానం కలగకమానదు. అంతలా... ఆకాశమే హద్దన్నట్లుగా హర్మన్‌ప్రీత్ బృందం సఫారీపై సూపర్‌గా ఆడింది.
చెన్నై: భారత మహిళల క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో విశ్వరూపమే చూపెట్టింది. డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ (197 బంతుల్లో 205; 23 ఫోర్లు, 8 సిక్స్‌లు) అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించింది.
మరో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (161 బంతుల్లో 149; 27 ఫోర్లు, 1 సిక్స్) కూడా సఫారీ బౌలర్లను చితగ్గొట్టి మరీ శతకాన్ని పూర్తి చేసుకుంది. దీంతో శుక్రవారం మొదలైన ఈ ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు తొలి రోజు ఆట ముగిసేసరికి 98 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి 525 పరుగుల భారీస్కోరు కాదు... ఒక్క రోజే రికార్డు స్కోరు నమోదు చేసింది.
పరుగు... ప్రవాహమైందిలా!
టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ చేపట్టింది. ఓపెనర్లు స్మృతి, షఫాలీ పరుగులు మొదలుపెట్టారు. ఇది పట్టాలెక్కగానే ప్రవాహం ఆ వెంటే రికార్డుల విధ్వంసం రోజంతా కొనసాగింది. 14వ ఓవర్లో భారత్ స్కోరు 50కి చేరింది. స్మృతి 78 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. దీంతోనే ఇది టెస్టు కాదని వన్డేనేమో అనే అనుమానం మొదలైంది.
షఫాలీ 66 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించడం, జట్టు స్కోరు వన్డేలకు దీటుగా 24.4 ఓవర్లలోనే 100కు చేరడంతో ఇది ఏ మ్యాచ్ అబ్బా అని అభిమానులు క్రికెట్‌కు సంబంధించిన వెబ్‌సైట్‌లలో ఏ ఫార్మాట్ అనే ఎంక్వైరీ చేసుకునేలా చేసింది. లంచ్ విరామానికి 130/0 స్కోరు చేసింది.
ఆ తర్వాత రెండో సెషన్‌లోనూ ఓపెనర్లు షఫాలీ, స్మృతిల బ్యాటింగ్ దూకుడుతో 39 ఓవర్లలోనే భారత్ 200 స్కోరును అవలీలగా దాటేసింది. ఈ క్రమంలో ముందుగా షఫాలీ 113 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకోగా, స్మృతి 122 బంతుల్లో శతకాన్ని సాధించింది.
194 బంతుల్లో ‘ద్విశతకం’
ఎట్టకేలకు 52వ ఓవర్లో స్మృతి అవుటైంది. 54వ ఓవర్లో జట్టు స్కోరు 300 పరుగులకు చేరుకుంది. అప్పుడు తెలిసొచ్చింది స్కోరైతే వన్డే తీరు... ఫార్మాట్ అయితే సంప్రదాయ పోరు అని! కాసేపటికే శుభా సతీశ్ (15) వెనుదిరిగింది. 334/2 స్కోరు వద్ద టీ బ్రేక్‌కు వెళ్లారు. తర్వాత జెమీమా రోడ్రిగ్స్ (94 బంతుల్లో 55; 8 ఫోర్లు) అండతో షఫాలీ 194 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించింది.
73వ ఓవర్లోనే భారత్ 400 పరుగుల మైలురాయిని వేగంగా అందుకుంది. షఫాలీ రనౌట్ కాగా... క్రీజులో పాతుకుపోయినా జెమీమా కూడా (85 బంతుల్లో) ఫిఫ్టీ సా«ధించింది. 95వ ఓవర్లో భారత్ 500 అసాధారణ స్కోరును ఒక్కరోజులోనే సాధించింది.
స్కోరు వివరాలు
భారత మహిళల తొలి ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (రనౌట్) 205; స్మృతి (సి) డెర్క్‌సెన్ (బి) టకర్ 149; శుభ (సి) జాఫ్తా (బి) డి క్లెర్క్ 15; జెమీమా (సి) డి క్లెర్క్ (బి) టకర్ 55; హర్మన్‌ప్రీత్ (బ్యాటింగ్) 42; రిచా ఘోష్ (బ్యాటింగ్) 43; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (98 ఓవర్లలో 4 వికెట్లకు) 525. వికెట్ల పతనం: 1–292, 2–325, 3–411, 4–450.
బౌలింగ్: క్లాస్ 14–2–63–0, డెర్క్‌సెన్ 11–0–60–0, నదినె 10–1–62–1, టుమి 10–0– 55–0, నొంకు లులెకొ లబ 24–1–113–0, డెల్మి టకర్ 26–1–141–2, సునె లుస్ 3–0–15–0.
1 మహిళల క్రికెట్లో షఫాలీ 194 బంతుల్లో సాధించిన వేగవంతమైన డబుల్ సెంచరీ కొత్త రికార్డు. ఇదే ఏడాది దక్షిణాఫ్రికా జట్టుపైనే అనాబెల్ సదర్లాండ్ (ఆ్రస్టేలియా) 248 బంతుల్లో ద్విశతకం చేసింది.
2 మిథాలీ రాజ్ (214; 2002లో ఇంగ్లండ్‌పై) తర్వాత టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారతీయ మహిళా క్రికెటర్‌గా షఫాలీ నిలిచింది.
292 తొలి వికెట్‌కు షఫాలీ, స్మృతి జోడించిన పరుగులు. ఇది కొత్త ప్రపంచ రికార్డు. 2004లో పాక్ ఓపెనర్లు సాజీదా, కిరణ్ బలూచ్‌లు విండీస్‌పై తొలి వికెట్‌కు 241 పరుగులు జతచేశారు.
525 టెస్టు క్రికెట్‌లో మ్యాచ్ తొలిరోజుతోపాటు ఒకే రోజు అత్యధిక పరుగులు చేసిన జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. 1935లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ తొలిరోజు 431 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment