రామభద్రపురంవిద్యార్థులతో పుస్తక పఠనం
వేసవి సెలవుల్ని సద్వినియోగపరచండి. విద్యార్థులకు ఆటపాటలపై శిక్షణ ఇవ్వండి. పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేయండి. మజ్జిగ.. తినుబండరాలు అందజేయండి.. అంటూ గ్రంథాలయాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. సెలవులు గడిచిపోతున్నాయి. శిక్షణ శిబిరాలు సాగుతున్నాయి. గ్రంథాలయ నిర్వాహకుల జేబులు ఖాళీ అవుతున్నాయి. ఇంతవరకు పైసా కూడా ప్రభుత్వం విదల్చలేదు. రెండు నెలలుగా వేతనాల్లేక.. అప్పులతో శిబిరాలను నిర్వహించలేక గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయ నిర్వాహకుల ఆవేదనకు అక్షర రూపమిది.
రామభద్రపురం (బొబ్బిలి): వేసవి సెలవులు సద్వినియోగం కావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసింది. వీటిని ఏప్రిల్ 25 నుంచి జూన్ 7 వరకు 45 రోజుల పాటు నిర్వహిస్తారు. శిక్షణ శిబిరాల్లో 5 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న విద్యార్థులు పాల్గొంటారు. రోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు.
ప్రతిపాదనలే.. పైసల్లేవ్
శిబిరాల్లో విద్యార్థులతో పుస్తకాలు చదివించాలి. కథలు చెప్పించాలి. చిత్రలేఖనం, సంగీతం, నృత్యం, ఆటపాటలు, స్టేజి డ్రామాలకు శిక్షణ ఇప్పించాలి. అటలు, పాటలు, నృత్యం, కథల పోటీలు నిర్వహించాలి. విజేతలకు బహుమతులు ఇవ్వాలి. శిక్షణ పొందేవారికి మజ్జిగ, తినుబండారాలు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. శిబిరాల నిర్వహణకు ఒక్కొక్క కేంద్ర గ్రంథాలయానికి రూ.25 వేలు, ద్వితీయ శ్రేణి గ్రంథాలయాలకు రూ.12 వేలు, తృతీయ శ్రేణి గ్రంథాలయాలకు రూ.10 వేలు, గ్రామీణ ప్రాంత గ్రంథాలయాలకు రూ.8 వేల చొప్పున నిర్వహణ ఖర్చులు ఇవ్వాలని నిర్ణయించినా ఇప్పటి వరకు పైసా కూడా మంజూరు చేయలేదు. దీంతో గ్రంథాలయ నిర్వహకులు సొంత నిధులు ఖర్చు పెట్టి శిబిరాలను నిర్వహించాల్సి వస్తోంది. రోజుకు రూ.300 నుంచి రూ.400 వరకు ఖర్చవుతోందని సిబ్బంది చెబుతున్నారు.
రెండు నెలలుగా వేతనాల్లేవ్
జిల్లా వ్యాప్తంగా పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో 42 శాఖా గ్రంథాలయాలను నిర్వహిస్తున్నారు. వీటిలో శాశ్వత సిబ్బంది 38 మంది, ఔట్ సోర్సింగ్ సిబ్బంది 12 మంది, తాత్కాలిక సిబ్బంది 9 మంది పనిచేస్తున్నారు. వీరందరికి మార్చి, ఏప్రిల్ వేతనాలు ఇంత వరకూ ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణకు నానా పాట్లు పడుతున్నారు. విద్యుత్, పేపర్, స్వీపర్ ఖర్చులు కూడా రెండు నెలలుగా అందక పోవడంతో సొంత నిధులు వెచ్చించాల్సి వస్తోందని గ్రంథాలయ నిర్వాహకులు వాపోతున్నారు.
అప్పులు చేస్తున్నాం
ప్రభుత్వం గ్రంథాలయాల్లో వేసవి శిక్షణ శిబిరాల నిర్వహణకు నిధులు విడుదల చేయక పోవడంతో సొంత నిధులు ఖర్చు చేస్తున్నాం. రెండు నెలలుగా వేతనాలు, విద్యుత్, పేపర్ బిల్లులు చెల్లించలేదు. ప్రతి నెలా అప్పు చేయాలంటే ఇబ్బందిగా ఉంది. – కృష్ణమూర్తి, నిర్వాహకుడు,శాఖా గ్రంథాలయం
Comments
Please login to add a commentAdd a comment