కోవిడ్ ఎఫెక్ట్... శాంసంగ్ దూకుడు!
న్యూఢిల్లీ: కోవిడ్–19(కరోనా) వైరస్ చైనా ఎలక్ట్రానిక్ కంపెనీలను కలవరపెడుతుంటే.. భారత మార్కెట్లో ఆధిపత్యం కోసం తీవ్రంగా శ్రమిస్తున్న దక్షిణ కొరియా కంపెనీ శాంసంగ్ ఈ వైరస్ రూపంలో లాభపడనుంది.! చైనా మొబైల్ తయారీ కంపెనీలు, ఎలక్ట్రానిక్ సంస్థల ప్రణాళికలపై కోవిడ్ ప్రభావం చూపిస్తోంది. యాపిల్‌తోపాటు చైనాకు చెందిన షావోమీ, ఒప్పో, వివో, రియల్మీ తదితర ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తుల విడుదల ప్రణాళికల ను సమీక్షించుకుంటున్నాయి. కానీ, శాంసంగ్ మాత్రం తన ప్రణాళికలను వాయిదా వేసుకోకుండా మరింత దూకుడుగా ఉత్పత్తులను విడుదల చేసే కార్యక్రమంలో ఉంది. భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) గణాంకాల ప్రకారం.. శాంసంగ్ ఇండియా 2020 ప్రారంభంలోనే 9 నూతన మొబైల్ ఫోన్లకు సంబంధించి బీఐఎస్ రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకుంది. కానీ, ఇదే సమయంలో షావోమీకి చెందిన రెడ్మీ, దక్షిణ కొరియాకు చెందిన మరో సంస్థ ఎల్జీ రెండేసి ఉత్పత్తులకు రిజిస్ట్రేషన్ కోరడం చూస్తుంటే.. శాంసంగ్ దూకుడు పెంచినట్టు తెలుస్తోంది. ఇక ఇదే కాలంలో మోటరోలా, కూల్‌ప్యాడ్ సంస్థలు ఒక్కొక్క ఉత్పత్తి రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు పెట్టుకున్నాయి.
దేశీయ కంపెనీలదీ దూకుడే..: ఈ సమయంలో దేశీయ కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల విడుదలలో వేగాన్ని పెంచడాన్ని పరిశీలించాలి. ఢిల్లీకి చెందిన సెల్కార్ జనవరి 1 నుంచి ఇప్పటికే 15 మోడళ్లకు బీఐఎస్ రిజిస్ట్రేషన్ తీసుకుని చార్ట్‌లో అగ్రస్థానంలో ఉంది. మరో స్థానిక బ్రాండ్ హైటెక్ కూడా మూడు మోడళ్లకు ఈ కాలంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం గమనార్హం. ‘‘పెద్ద తయారీ సంస్థలు (ఓఈఎంలు) తమ ఉత్పత్తుల విడుదలను జాప్యం చేస్తున్నట్టు కనిపిస్తోంది. సాధారణంగా బీఐఎస్ రిజిస్ట్రేషన్ తర్వాత ఉత్పత్తుల విడుదలకు 4–6 వారాలు తీసుకుంటుంది. ప్రస్తుత పరిస్థితి శాంసంగ్‌కు అనుకూలం. ఎందుకంటే ప్రముఖ తయారీ కంపెనీగా కొరియా, ఇతర ప్రాంతాల నుంచి విడిభాగాలను సమీకరించుకుంటుంది. దీంతో కంపెనీ సరఫరా వ్యవస్థపై వైరస్ ప్రభావం ఉండదు’’ అని టెక్‌ఆర్క్‌కు చెందిన ముఖ్య అనలిస్ట్ ఫైసల్కవూసా తెలిపారు.
చైనా కంపెనీలకు ఇబ్బందులు..
చైనాలో కోవిడ్ వైరస్ తీవ్రతతో కొన్ని ప్రాంతాల్లో తయారీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇది సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపించనుంది. దీని తాలూకూ వేడి భారత్‌లో కార్యకలాపాలు కలిగి ఉన్న చైనా కంపెనీలకు ఇప్పటికే తాకింది. చైనాకు చెందిన ప్రముఖ కంపెనీలకు భారత్‌లో తయారీ కేంద్రాలు ఉన్నప్పటికీ.. విడి భాగాల కోసం అవి మాతృదేశంపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. కానీ, వైరస్ ప్రభావం శాంసంగ్‌పై తక్కువే ఉండనుంది. ఎందుకంటే అధిక శాతం మొబైల్ ఫోన్లను ఈ సంస్థ నోయిడాలోని కేంద్రంలోనే తయారు చేస్తోంది. పైగా 2018లో తయారీ సామర్థ్యాన్ని కూడా గణనీయంగా పెంచుకుంది. అంతకుముందు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 68 మిలియన్ యూనిట్లుగా ఉంటే, 120 మిలియన్ యూనిట్లకు విస్తరించింది. ఇక విడిభాగాలను కూడా స్థానికంగానే సమీకరించుకుంటోంది. అలాగే, వియత్నాంలో భారీ తయారీ కేంద్రం కూడా కలిగి ఉంది. ‘‘చైనా సంస్థలతో పోలిస్తే శాంసంగ్ కార్యకలాపాలు ఎన్నో ఖండాల్లో విస్తరించి ఉన్నాయి. కనుక అతిపెద్ద నిల్వలను కలిగి ఉంటుంది. చైనా నుంచి సరఫరా పరంగా ఉన్న ఇబ్బందులు మొదటి త్రైమాసికంలో శాంసంగ్‌కు కలసి రానున్నాయి’’ అని రీసెర్చ్ సంస్థ ఐడీసీ డైరెక్టర్ నవకేందర్సింగ్ తెలిపారు.
పెద్దగా ప్రభావం ఉండదు..
‘‘చాలా వరకు విడిభాగాలను భారత్‌లోనే తయారు చేస్తున్నాం. అంతేకాదు వియత్నాంలో భారీ తయారీ కేంద్రం కూడా ఉంది. కరోనా వైరస్ సంక్షోభ ప్రభావం మా కార్యకలాపాలపై పెద్దగా ఉండదు’’ అని శాంసంగ్ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. ఫ్లాగ్షిప్ మోడళ్లు అయిన గెలాక్సీ జెడ్ ఫ్లిప్, ఎస్20 ప్లస్ మోడళ్లను మార్చి నాటికి విడుదల చేయనున్నట్టు చెప్పారు. ఒకప్పుడు దేశీయ మార్కెట్లో టాప్‌లో ఉన్న శాంసంగ్ 2019 డిసెంబర్ నాటికి మూడో స్థానానికి పడిపోయింది. షావోమీ, వివో తొలి రెండు స్థానాలను ఆక్రమించేశాయి. 2019 జూన్ క్వార్టర్ నాటికి శాంసంగ్‌కు 25.3% మార్కెట్ వాటా కలిగి ఉండగా, డిసెంబర్ నాటికి అది 15.5%కి తగ్గింది.
భారత మార్కెట్లో ‘గెలాక్సీ జెడ్ ఫ్లిప్’ ధర రూ.1.10 లక్షలు
న్యూఢిల్లీ: శాంసంగ్.. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ జెడ్ ఫ్లిప్’ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. గతవారంలోనే అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో తన ఆల్ట్రా–ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను ప్రదర్శించిన కంపెనీ.. ఇక్కడ మార్కెట్లో దీన్ని గురువారం విడుదలచేసింది. ధర రూ. 1.10 లక్షలు కాగా, రెండు యాప్‌లను ఒకేసారి తెరవగలిగే సౌలభ్యం ఇందులో ఉందని, సాంకేతిక ఆవిష్కరణలో మైలురాయిగా నిలిచిపోయే హ్యాండ్‌సెట్‌గా జెడ్ ఫ్లిప్ నిలిచిపోనుందని ఈ సందర్భంగా కంపెనీ ఇండియా డైరెక్టర్(మొబైల్) ఆదిత్య బబ్బర్ వ్యాఖ్యానించారు. ఇక స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. 6.7 అంగుళాల పూర్తి హెచ్డీ డైనమిక్ అమోలెడ్ ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్ప్లే, 8 జీబీ ర్యామ్, 256 స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10 ఓఎస్, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, వెనుకవైపు రెండు 12 మెగాపిక్సెల్ కెమెరాలు, 10ఎంపీ సెల్పీ కెమెరా ఉన్నాయి.