మైక్రోమాక్స్ పెద్ద టార్గెటే పెట్టుకుంది!
న్యూఢిల్లీ: దేశీయ ముబైల్ హ్యాండ్‌సెట్ మేకర్ మైక్రోమాక్స్ అంతర్జాతీయంగా తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించాలని భావిస్తోంది. మద్యప్రాచ్యం, ఆఫ్రికా, కామన్‌వెల్త్ దేశాల మార్కెట్లలోకి ప్రవేశించి.. ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటాలని నిర్ణయించుకుంది. రానున్న మూడు నాలుగేళ్లలో అంతర్జాతీయంగా ఐదు అగ్రశేణి ముబైల్ ఫోన్ సంస్థల్లో ఒకటిగా నిలువాలని మైక్రోమాక్స్ సంస్థ తాజాగా టార్గెట్ పెట్టుకుంది.
గార్ట్‌నెర్ సంస్థ ప్రకారం 2015 జూన్‌తో ముగిసే త్రైమాసికానికి మైక్రోమాక్స్ సంస్థ అంతర్జాతీయంగా పదోస్థానంలో నిలిచింది. ఇప్పటికే తమకు రష్యా, బంగ్లాదేశ్, నేపాల్‌లో బలమైన మార్కెట్ ఉందని, ఇకముందు మరింత విస్తరిస్తామని మైక్రోమాక్స్ సంస్థ తాజాగా వెల్లడించింది.
'నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి మార్కెట్లలో కొన్ని సంవత్సరాల కిందటే మా అంతర్జాతీయ వ్యాపారాన్ని ప్రారంభించాం. ఇతర మార్కెట్లలోనూ మేం బాగా వృద్ధి చెందాం. రష్యా మార్కెట్లో మాకు ఐదుశాతం వాటా ఉంది' అని మైక్రోమాక్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఇంటర్నేషనల్ బిజినెస్) అమిత్ మథూర్ పీటీఐ వార్తాసంస్థకు తెలిపారు. రానున్న మూడు నాలుగేళ్లలో అంతర్జాతీయంగా టాప్ 5లో ఒకరిగా ఉండటమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో మైక్రోమాక్స్ రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ మేకర్‌గా ఉంది. దేశంలో మొబైల్ అమ్మకాల్లో శామ్‌సంగ్ తర్వాత రెండోస్థానంలో మైక్రోమాక్స్ ఉంది.