Sundai Koli-2
-
తంగమాన పొన్ను
...అని పొగుడుతున్నారట కీర్తీ సురేశ్‌ను ‘సండై కోళి 2’ (పందెం కోడి 2) టీమ్. ఇంతకీ ఆ పొగడ్తకు అర్థం ఏంటో అనుకుంటున్నారా? మరేం లేదు.. బంగారంలాంటి అమ్మాయి అని అర్థం. బంగారు వర్ణమంత అందంగా ఉంటారని ఇలా పొగడ్తల వర్షం కురిపించారని అనుకుంటే పొరబాటే. ఈ పొగడ్తలకు కారణం కీర్తి మేని ఛాయ కాదు మనసు. కీర్తీ సురేశ్‌కు ఏదైనా సినిమా చేసిన తర్వాత ఆ సినిమాకు పని చేసిన చిత్రబృందానికి ఏదో ఓ గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేయడం అలవాటులా ఉంది. ‘మహానటి’ సినిమాకు పని చేసిన అందరికీ బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చారు. ఇప్పుడు ‘సండై కోళి 2’ టీమ్‌కి అలానే చేశారు. లింగుస్వామి దర్శకత్వంలో విశాల్, కీర్తీ సురేశ్ జంటగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘సండై కోళి 2’. 2005లో సూపర్ హిట్ అయిన ‘సండై కోళి’ చిత్రానికి సీక్వెల్. వరలక్ష్మీ శరత్ కుమార్ ముఖ్య పాత్ర చేశారు. ఈ చిత్రంలో తన భాగం షూటింగ్ పూర్తి అవ్వగానే తనతో పాటు పని చేసిన టీమ్ అందరికీ గోల్డ్ కాయిన్స్ బహుమతిగా ఇచ్చారట కీర్తీ. దీంతో టీమ్ అంతా ఫుల్ ఖుష్ అయిందట. నెలల తరబడి తనతో పాటు పని చేసిన టీమ్‌కి ఇచ్చిన రెస్పెక్ట్ చూస్తుంటే కీర్తీ సురేశ్ నిజంగానే బంగారం అనకుండా ఉండక మానలేరు కదా? -
పాటతో సండైకోళి –2 ప్రారంభం
తమిళసినిమా: సండైకోళి–2 చిత్రానికి బుధవారం శ్రీకారం చుట్టారు. చాలాకాలంగా ఈ చిత్రంపై పలు రకాల వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు చిత్ర షూటింగ్ సాంగ్‌తో బుధవారం ప్రారంభమైంది. విశాల్, దర్శకుడు లింగుస్వామిలది సక్సెస్ఫుల్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. వీరి కలయికలో 2005లో వచ్చిన సండైకోళి చిత్రం సంచలన విజయాన్ని సాధించడంతో పాటు, విశాల్‌కు మాస్ హీరో ఇమేజ్ కట్టబెట్టిన చిత్రంగా నమోదైంది.ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కనున్న చిత్రమే సండైకోళి–2. మొదటి భాగంలో నటించిన నటుడు రాజ్‌కిరణ్ ఈ చిత్రంలోనూ నటిస్తున్నారు. ఇక హీరోయిన్లుగా త్రిష, కీర్తీసురేశ్ నటిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. శక్తి ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం కోసం చెన్నైలోని బిన్ని మిల్లులో మదురై ఉత్సవాలను తలపించే విధంగా భారీ సెట్‌ను వేశారు. ఆ సెట్లో విశాల్, కీర్తీసురేశ్ పాటతో చిత్రీకరణను ప్రారంభించారు. సండైకోళి చిత్రం తరువాత విశాల్, లింగుసామి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సండైకోళి–2 చిత్రంపై కచ్చితంగా భారీ అంచనాలు నెలకొంటాయని వేరే చెప్పాలా? ఈ చిత్రాన్ని విశాల్ తన విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్నారు.