ప్రియుడి వంచన తట్టుకోలేక..
యువతి ఆత్మహత్య
సుందరగిరిలో ఘటన
చిన్నముల్కనూర్‌లో బంధువుల ఆందోళన
చిగురుమామిడి : ప్రియుడి వంచన భరించలేక ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు ప్రియుడే కారణమని మూడు పేజీల సూసైడ్ నోట్ రాసింది. దీంతో బంధువులు మృతదేహంతో ప్రియుడి ఇంటి ఎదుట ధర్నా చేశారు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని సుందరగిరి గ్రామానికి చెందిన ఎనగందుల యశోద–రాయమల్లు దంపతుల కూతురు సుజాత(23) కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తోంది. ఈమెకు చిన్నముల్కనూర్‌కు చెందిన దొబ్బల మహేశ్‌తో ఐదేళ్లక్రితం పరిచయం ఏర్పడింది. మహేశ్‌కు ఇదివరకే పెళ్లయింది. ప్రస్తుతం అతడి భార్య గర్భిణి. ఈ విషయం దాచాడు. క్రమంగా వారి పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం పెద్దలకు తెలిసింది. దీంతో మహేశ్ తాను సుజాతను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. సుజాతకు వచ్చే రూ.11వేల వేతనాన్ని మహేశ్ వాడుకున్నాడు. సుజాత డబ్బులతో ఓ ద్విచక్రవాహనం కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో సుజాత తనను పెళ్లి చేసుకోవాలని మహేశ్‌ను వారం రోజులుగా ఒత్తిడిచేస్తోంది. దీంతో మహేశ్ తనకు రూ.5లక్షల కట్నం, ఎకరం పొలం ఇస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. పేదవారైన సుజాత తల్లిదండ్రులు తమకున్న 20గుంటల పొలం ఇస్తామని చెప్పారు. శుక్రవారం సుజాత తల్లి యశోద మహేశ్ ఇంటికి వెళ్లి తన బిడ్డను పెళ్లి చేసుకోవాలని కోరింది. అయితే మహేశ్, అతడి తండ్రి చంద్రయ్య ఆమెను దూషించి పంపించారు. విషయం తెలుసుకున్న సుజాత మనస్తాపం చెందింది. మహేశ్ ఇక తనను పెళ్లిచేసుకోడని భావించింది. ‘మమ్మి నన్ను క్షమించు. మహేశ్ అంటే నాకు చాలా ఇష్టం. అతడిని తప్ప మరెవరినీ పెళ్లి చేసుకోలేను. ఆయనే నా ప్రాణం.. ఐదు లక్షల కట్నం ఇవ్వమనడం బాధ కలిగించింది. ఇప్పుడు మహేశ్ తన మరదలుతో తిరుగుతున్నాడు. ఇది నాకు నచ్చలేదు. నా చావుకు మహేశ్ కారణం’ అని రాత్రి మూడు పేజీల సూసైడ్ నోట్ రాసి గదిలో ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు చూసేసరికి చనిపోయింది.
మృతదేహంతో ఆందోళన
సుజాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు శనివారం చిన్నముల్కనూర్‌లోని మహేశ్ ఇంట్లో వేసి ఆందోళనకు దిగారు. అతడి తల్లి రాజమ్మను మహిళామండలి సభ్యులు చితకబాదారు. ఇంట్లోని సామగ్రి ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న హుస్నాబాద్ ఎస్సై కిరణ్ సంఘటన స్థలానికి చేరుకుని బందోబస్తు ఏర్పాటుచేశారు. బంధువులు హుస్నాబాద్–కరీంనగర్ రహదారిపై గంటసేపు ధర్నా చేశారు. మహేశ్‌ను శిక్షించాలని డిమాండ్ చేశారు. పొద్దుపోయాక మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. అయితే ఈ సంఘటనపై ఇంకా కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.
హత్యానేరం కింద శిక్ష అనుభవించిన మహేశ్..
మహేశ్ గతంలో ఒక హత్యానేరంలో శిక్ష అనేభవించాడు. 2011, జూన్ 26న చిన్నముల్కనూర్‌కు చెందిన బోనగిరి ఎల్లయ్య–కనుకమ్మ దంపతుల ఏకైక కుమారుడు అక్షయ్(11)ను హత్య చేశాడు. అక్షయ్ అక్కను పెళ్లి చేసుకున్న మహేశ్ ఆస్తి కోసం బండరాయితో కొట్టి చంపేశాడు. అక్షయ్ తల్లిదండ్రులకు ఉన్న ఎకరం భూమి కోసం ఈఘాతుకానికి ఒడిగట్టాడు. ఈ కేసులో జైలుకు కూడా వెళ్లొచ్చాడు.