సన్నీలో కొత్త వెర్షన్
న్యూఢిల్లీ : జపనీస్ ఆటో దిగ్గజం నిస్సాన్ తన మిడ్ సెజ్ సెడాన్ సన్నీలో కొత్త వెర్షన్ కారును ఆవిష్కరించింది. రూ.7.91 లక్షల(ఎక్స్-షోరూం ఢిల్లీ ) ప్రారంభ ధరతో ఈ కారును భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. '' నిస్సాన్ ఇండియా వినియోగదారుల అభిప్రాయాలను నిరంతరం తీసుకుంటూ ఉంటుంది. కొత్త సన్నీ 2017లో విశాలమైన ఇంటీరియర్ ఉంటుంది. ఈ కారు మంచి ఇంధన సామర్థ్యం కలిగి ఉంది'' అని నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ మల్హోత్రా చెప్పారు.
పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లలో ఈ కారును నిస్సాన్ వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. పెట్రోల్ వెర్షన్ 1,498సీసీ ఇంజిన్, డీజిల్ వేరియంట్ 1,461 సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగి ఉంది. పెట్రోల్ ఆప్షన్ ధర రూ.7.91 లక్షల నుంచి రూ.10.89 లక్షల మధ్య ఉండగా.. డీజిల్ వేరియంట్ ధరలు రూ.8.8 లక్షల నుంచి రూ.10.76 లక్షల మధ్య ఉంది. యాంటీ లాక్ బ్రేకింగ్(ఏబీఎస్), ఎలక్ట్రిక్ బ్రేక్ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్(ఈబీడీ), బ్రేక్ అసిస్ట్(బీఏ), డ్యూయల్ ఫ్రంట్, సైడ్ ఎయిర్బ్యాగ్స్ దీనిలోని సేఫ్టీ ఫీచర్లు. నిస్సాన్ లైన్-అప్లో సన్నీకి మంచి డిమాండ్ ఉంది. ఈ కారు గ్లోబల్గా 16 మిలియన్ యూనిట్లు అమ్ముడుపోయింది.