సూర్యదేవుని సౌధం
టూర్‌దర్శన్ – కోణార్క్
సప్తాశ్వ రథమారూఢం
ప్రచండం కశ్యపాత్మజం
శ్వేతపద్మ ధరం దేవం
తమ్ సూర్యం ప్రణమామ్యహం! అంటూ.. ఆ ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే రెండు చేతులు ఆకాశంవైపుగా సాగి మందిరానికి కైమోడ్చుతాయి. లోకానికి ప్రాణనాథుడైన సూర్యదేవునికి కనులు ప్రణామాలు చెల్లిస్తాయి. ఉదయపు భానుడిలా ఎర్రదనంతో ఆకాశమంత ఎత్తులో ఉన్న ఆ భానుని నివాసాన్ని మనసు తనువంతా కనులు చేసుకొని అచ్చెరువొందుతూ వీక్షించడంలో మునిగిపోతుంది.
ఒరిస్సా రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాల్లో శంఖుక్షేత్రం పూరి, చక్ర క్షేత్రం భువనేశ్వరం, గదా క్షేత్రం జాజ్‌పూర్, ఈ కోణార్క్ పద్మక్షేత్రం ప్రసిద్ధమైనవి. కోణార్క్ ఆలయాన్ని ‘నల్ల పగోడా’ అంటారు. ప్రధాన పట్టణమైన భువనేశ్వర్ నుంచి 64 కిలోమీటర్ల దూరంలో జగన్నాథుడు కొలువున్న పూరీ పట్టణానికి కేవలం 34 కిలోమీటర్ల దూరంలో ఉంది కోణార్క్. ప్రపంచ వారసత్వ కట్టడంగా ‘యునెస్కో’ జాబితాలో చేరిన ఈ ఆలయం మనదేశ అద్భుతాల్లో ఒకటి. ఇప్పుడిదొక మాన్యుమెంట్గా గత చరిత ఘనతకు ఆనవాలుగా గాధలను మనకు వివరిస్తుంది. రారమ్మని ఆహ్వానిస్తుంది.
నాటి గాధలు కళ్లకు కట్టే కట్టడం
భువనేశ్వర్ నుంచి బస్సులో కోణార్క్‌కు చేరుకోగానే హృదయం ఒక్కసారిగా ఉద్వేగభరితం అవుతుంది. పరుగులాంటి నడకతో ఆలయం ముంగిట్లో గువ్వపిట్టలా వాలిపోతాం. నాటి గుర్తులను హృదయంలో ఒక్కొక్కటి లిఖించుకుంటాం. ఈ ఆలయం 13వ శతాబ్దిలో రూపుదిద్దుకున్నట్టు పద్మపురాణంలో చెప్పబడింది. ఈ ప్రాంతం గంగావంశానికి చెందిన లాంగులా నరసింహదేవుడు సూర్యభక్తుడు. ఇతని కాలంలో ఈ ఆలయం నిర్మించబడింది. దీనినే మైత్రేయ వనం అనేవారు. ఈ మందిరం ఎత్తు 230 అడుగులు. అప్పటి తామ్ర శాసనంలో ఈ స్థలానికి కోణా లేదా కోణాకమనము అని పేరుంది. బుద్ధదేవుని మరొకపేరు కోణాకమనీ, అందువల్లనే కోణార్కము బుద్ధదేవుని పేరిట నెలకొన్న స్థలమనీ అంటారు. పూరీక్షేత్రానికి ఈశాన్య కోణంలోని అర్క (సూర్య) దేవుని క్షేత్రం గనుక దీనికి కోణార్కమని పేరు వచ్చింది.
సప్తాశ్వరథం
సూర్యుడు 24 చక్రాలతో, ఏడు అశ్వాలతో ఉన్న రథాన్ని అధిరోహించి సౌరమండలాన్ని పాలించడానికి బయల్దేరుతాడట. ఆ ఆకారం పోలికతోనే నిర్మించబడిన ఈ దేవాలయానికి ఇరువైపులా పన్నెండు జతల చక్రాలు, వారంలోని ఏడురోజులను సూచించే విధంగా ఏడు అశ్వాలు చెక్కబడి ఉంటాయి. (ప్రస్తుతం ఆశ్వాలు లేవు) ఈ చక్రాలపై పడే సూర్యకిరణాల ఆధారంగా స్థానికులు కచ్చితమైన సమయాన్ని చెప్పగలుగుతారని గైడ్స్ వివరిస్తారు. సూర్యపరిభ్రమణాన్ని చూపించే విధంగా ఈ చక్రాలు చెక్కబడటం ఓ గొప్ప విశేషం. ఒక్కో రథ చక్రం 3 మీటర్ల వైశాల్యంతో అద్భుత శిల్పచాతుర్యంతో కనిపిస్తుంది. మందిరం మధ్యభాగంలో రత్నఖచితమైన సింహాసనముండేదట. దానిపైన సూర్యభగవానుడు ఆసీనుడై ఉండేవాడట. ఈ మూర్తి ముందు వజ్రం ఉండేదని, సూర్య కిరణాలు ఈ వజ్రం మీద పడి అవి కాంతులు విరజిమ్మేవని చెబుతారు. ఈ సూర్యప్రతిమకు తలపై మకుటం, చెవులకు కుండలాలు, కంఠంలో హారం, మెడలో జంధ్యం, వాటిలో మువ్వలు, కటి ప్రదేశంలో ఆభర ణం, దానికింద గ్రంథిమాల.. జీవకళ తొణికినట్టు కనిపించేదట. 1627లో రాజ కుద్ర సూర్య మూర్తిని కోణార్క్ నుంచి పూరీలో జగన్నాథ ఆలయానికి తరలించారని చెబుతారు. దేవాలయం పైన పద్మం, కలశము ఆకర్షణీయంగా చెక్కబడి ఉన్నాయి. ఖజురహో మాదిరి ఇక్కడా శృంగార రసభరిత శిల్పాలు ఎన్నో ఉన్నాయి.
నిర్మాణానికి 16 ఏళ్లు..
ఈ మందిరాన్ని 1200 మంది శిల్పులు 16 సంవత్సరాల పాటు నిర్మించారని చరిత్ర విశదం చేస్తుంది. దేవాలయంతో పాటు దీంట్లోని ప్రధాన హాలు ఒక తామరపూవు మీద ఉన్నట్టు చెక్కి ఉంటుంది. ఈ విశాలమైన హాలుకు నాలుగువైపులా ద్వారాలు, వాటి మీద చెక్కిన లతలు, పువ్వులు.. నాటి అద్భుత కళాసృష్టికి నీరాజనాలు పలుకకుండా ఉండలేం. ఈ హాలు ముందు భాగంలో మరో నాట్యమందిరం నిర్మింపబడి ఉంది. దీనిని భోగమంటపమని, నాట్యమందిరం అని అంటారు. అన్ని వైపులా రాతిపైన చెక్కిన నర్తకుల బొమ్మలు బాజభజంత్రీలతో దేవతార్చన చేయటం కనపడుతుంది. హాలుకి ఉత్తరం వైపు రెండు ఏనుగుల విగ్రహాలు ఉన్నాయి. అవి నిజం ఏనుగులనే తలపించేలా ఉంటాయి. ఒక్కో ఏనుగు ఎత్తు 9 అడుగులు, వెడల్పు 5 అడుగులు ఉంటుంది. హాలుకు దక్షిణం వైపు విరాట్ స్వరూపంతో రెండు గుర్రాలుండేవట. ఇప్పుడవి కానరావు. వీరావేశంతో ఉండే ఆ విగ్రహాలను చూసి దర్శకులు భయపడేవారట. ఈ ఆలయం తూర్పు–పడమరల దిక్కులుగా ఉంటుంది. ప్రధాన హాలులో భక్తజనం ప్రార్థనలు జరిపేవారు. అయితే ప్రస్తుతం ఇది మూసి వేసి ఉంటుంది. ఈ ప్రాంత సమీపంలోనే భక్తకబీరుదాసు సమాధి ఉండేదని అబుల్‌ఫజల్ అయినీ అక్బరీ చెబుతోంది.
సూర్యుడే తపమాచరించిన చోటు
శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు ఒకనాడు నీళ్లరేవులో అభ్యంగన స్నానం చేస్తున్న స్త్రీలను చూశాడని తండ్రి శపించాడట. ఆ శాపం వల్ల సాంబుడు కుష్టురోగి పీడితుడయ్యాడు. దీంతో ఇక్కడి మైత్రేయవనంలో చంద్రభాగా తీరాన సూర్యారాధన చేసి రోగవిముక్తుడయ్యాడట. ఈ ప్రాంత పవిత్రతను బట్టి సాంబుడు సూర్యప్రతిమను ప్రతిష్టించి పూజలు జరిపాడని చెబుతారు. ఆ తర్వాతి కాలంలో లాంగులా నరసింహదేవుడు నేటి ఆలయాన్ని నిర్మించారని కథలున్నాయి.
స్వయంగా సూర్యభగవానుడే ఇక్కడ తపస్సు చేశాడని, అందుకే ఈ మందిరానికి, ఈ ప్రాంతానికి పవిత్రత చేకూరందని చెబుతారు. అంటే ఈ ప్రాంతంపై సూర్యదేవుని మహిమలు అధికమన్నమాట. ఎంతటి దీర్ఘకాల వ్యాధులైనా ఈ ప్రాంత సందర్శనంతో నయమవుతాయని భక్తుల విశ్వాసం. అనూరుడు సూర్యుని రథసారధి. చేతులు జోడించి సూర్యుని ధ్యానిస్తున్నట్లు ఉంటుంది ఆకృతి. ఇక్కడ గల రామచండీ మందిరం కోణార్కు అధిష్ఠాత్రిదేవీ మందిరం (దీనినే బుద్ధుని తల్లి మాయాదేవి మందిరం) అంటారు. దీనిలోని ప్రతిమ ఇప్పుడు దేవాలయానికి దగ్గరగా ఉన్న లియాఖియా అనే గ్రామంలో ఉంటుంది. ఇక్కడి నవగ్రహాలు తప్పక దర్శించవలసినవి. ఈ గ్రహాలు మనుష్యాకారంలో కాంతులు వెదజల్లుతున్నట్టు మెరుస్తుంటాయి. ఇవన్నీ.. తలలపై మకుటం, పద్మాసనం వేసినట్లు చెక్కబడ్డాయి. ఇంకా ఎన్నో ప్రతిమలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఈ ఆలయం పక్కనే ఉండే మర్రివృక్షం అతి ప్రాచీనమైనది, విశాలమైనది. ఇక్కడ బుద్ధుడు తపస్సు చేసినట్టు కథలుగా చెబుతారు.
అలంకారాలెన్నో!
ఆ నిర్మాణ కౌశలం, ఆ శోభ ఆనవాలుగా కనిపిస్తున్న ఆ దర్బారు హాలు, ఆ అలంకారాలు, ఆ మందిరాలు.. ఎన్నో గాలి తుపానులకు, మరెన్నో భూకంపాలకు లోనైంది. ఇంకా తనవితీరక విదేశీయుల చేతిలో విధ్వసం చేయబడింది. కర్కోటకుడైన కళాపహాడు, 17వ శతాబ్ది జహంగీర్ ఈ దేవాలయం ధ్వంసం చేసినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. మహమ్మదీయ నావికులు ఉత్కలకళామణిని కనుమరుగు చేసే ప్రయత్నం చేశారు. కోణార్క దేశం పతనం చెందింది. ఇక్కడ దేవ దేవీల దివ్యమందిరం, జాతీయ కాంతి సౌధం పోర్చుగీసుల ఆశ్రయ స్థలం ముక్కలై జీర్ణ చిహ్నమై కనిపిస్తుంది. అయినా, నాటి కళావైభవం చెక్కుచెదరక కనులకు విందు చేస్తూనే ఉంది. దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుతూనే ఉంది.
మార్గం సులభం
హైదరాబాద్ నుంచి భువనేశ్వర్‌కి విమానమార్గం, రైలుమార్గం, రోడ్డుమార్గం ద్వారా చేరుకోవచ్చు. దేశంలోని అన్ని ముఖ్య పట్టణాల నుంచి భువనేశ్వర్ చేరుకోవచ్చు. భువనేశ్వర్ విమానాశ్రయం నుంచి 64 కిలోమీటర్లు. పూరీ నుంచి 34 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి టాక్సీలు, బస్సు సదుపాయాలు ఉన్నాయి. పూరీలో రైల్వేస్టేషన్ ఉంది. కోణార్క్ చుట్టుపక్కల చూడదగిన సుందర ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో పూరీ జగన్నాథ మందిరం, భువనేశ్వర్‌లోని సోమేశ్వర ఆలయం, భువనేశ్వరి మాత ఆలయం, చంద్రభాగా బీచ్, రామచండీ టెంపుల్, బీచ్, బౌద్ధ ఆరామాలు... ప్రధానమైనవి.
విశేష యాత్ర
ఈ పుణ్య క్షేత్రంలో మాఘ సప్తమినాడు విశేష యాత్ర జరుగుతుంది. ఘనత వహించిన యాత్రలెన్నో పూర్వం ఇక్కడ వైభవంగా జరిగేవట. వీటిలో ముఖ్యమైనవి చైత్రయాత్ర, రథయాత్ర, చంద్రభాగయాత్ర.700 ఏళ్ల ఘనచరిత్ర గల ఈ నిర్మాణ ప్రాంగణంలో కోణార్క్ డ్యాన్స్ ఫెస్టివల్‌ను ప్రతియేటా ఒరిస్సా ప్రభుత్వం జరుపుతుంది. ఈ ఉత్సవాలు ఈ ఏడాది ఫిబ్రవరి 19న జరగనున్నాయి.పూరి నుంచి కోణార్క్‌తో పాటు మరో 10 చూడదగిన ప్రదేశాలను సందర్శించడానికి టూరిస్ట్ బస్సులు ప్యాకేజీలను అందిస్తుంటాయి. ఒకరికి 200 రూపాయల నుంచి టికెట్ ఉంటుంది.భువనేశ్వర్, పూరీ క్షేత్రంలో బస సదుపాయాలకు లోటు లేదు.ఈ ప్రాంత స్థానిక వంటల రుచి తప్పక ఆస్వాదించాల్సిందే!సముద్రతీర ప్రాంతం గనుక ఇక్కడ దొరికే గవ్వలతో తయారుచేసే హస్తకళా వస్తువులు, పూసలు కారుచవకగా దొరుకుతాయి.
– నిర్మలారెడ్డి చిల్కమర్రి