స్కూల్లో ఉల్లి దానం!
గచ్చిబౌలి (రంగారెడ్డి) : ఇప్పటివరకు అన్నదానం, వస్త్రదానం లాంటివి చాలా చూశాం, చేశాం. ఇక ఇప్పుడు లేటెస్ట్గా ఉల్లి దానం! ఉల్లి ధర కొండెక్కి కూర్చున్న తరుణంలో ఓ స్కూల్ యాజమాన్యం కాలనీ వాసులకు ఉచితంగా ఉల్లిగడ్డలు పంపిణీ చేసింది. గచ్చిబౌలిలోని సన్‌షైన్ ప్రీ స్కూల్ యాజమాన్యం జీపీఆర్ఏ క్వార్టర్స్‌లో మంగళవారం చిన్నారుల తల్లిదండ్రులకు ఉచితంగా ఉల్లిగడ్డలు పంపిణీ చేసింది.
మొత్తం 256 కిలోలు ఉచితంగా పంపిణీ చేసినట్లు సన్‌షైన్ కార్పొరేట్ అడ్మిన్ మేనేజర్ నాగరాజు తెలిపారు. నగరంలో తమ స్కూల్‌కు 25 బ్రాంచ్‌లు ఉన్నాయని, ప్రతిచోటా ఉల్లిగడ్డలను ఉచితంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. దాతృత్వం.. చక్కటి ప్రచారం.. అంతా ఉల్లి చలవే. ఉల్లిచేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. ఈ రకంగా కూడా ఉల్లి ఉభయులకూ మేలు చేస్తోందన్న మాట!!