Super Blue Blood Moon
-
ఆలయాల్లో పునఃదర్శనం
అలంపూర్ రూరల్ : జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర ఆలయంలో గురువారం ఉదయం భక్తులను దర్శనానికి అనుమతించారు. బుధవారం సాయంత్రం చంద్రగ్రహణం ఉండడంతో అర్చకులు ఆలయాలను మూసి ఉంచారు. గురువారం ఉదయం 5:30 గంటల నుంచి ఆలయ శుద్ధి చేపట్టారు. ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. మహాసంప్రోక్షణ అనంతరం 10గంటల తర్వాత భక్తులను అనుమతించారు. నాగకన్యల బావి నుంచి జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర సేవాసమితి అధ్యక్షుడు శ్రీను ఆధ్వర్యంలో శివస్వాములు 108 బిందెలతో ఇటీవల ప్రతిష్టించిన జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి నమూన విగ్రహాలను అభిషేకించారు. ఆలయ ముఖ్య అర్చకులు ఆనంద్‌శర్మ, వనం శ్రీకాంత్ శర్మ, జానకిరామ శర్మ, శ్రీనివాస శర్మ , ధనుంజయ శర్మ, జూనియర్ అసిస్టెంట్ శ్రీను, శేఖర్ పాల్గొన్నారు. -
కనువిందు చేసిన జాబిల్లి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా సూపర్ బ్లూ బ్లడ్‌మూన్ బుధవారం కనువిందు చేసింది. అమెరికాతోపాటు ఆస్ట్రేలియా, పలు ఆసియా దేశాలు, రష్యాలోని కొన్ని భాగాల్లో కోట్లాది మంది ప్రజలు ఈ ఖగోళ అద్భుతాన్ని ఉత్సాహంగా వీక్షించారు. కాలిఫోర్నియాతోపాటు పశ్చిమ కెనడాలోని ప్రజలు చంద్ర గ్రహణాన్ని పూర్తిగా చూశారని నాసా వెల్లడించింది. దక్షిణ అమెరికా ఖండం, పశ్చిమ యూరప్‌తోపాటు ఆఫ్రికాలోని చాలా దేశాల్లో సూపర్ బ్లూ బ్లడ్ మూన్ కనిపించలేదు. ఇటు భారత్‌లోనూ అనేక మంది ప్రజలు చంద్రగ్రహణాన్ని మరింత స్పష్టంగా వీక్షించేందుకు వివిధ నగరాల్లోని నక్షత్రశాలలకు క్యూ కట్టారు. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద వేలాది మంది విద్యార్థులు ఖగోళ వింతను చూసేందుకు గుమిగూడారు. దక్షిణ భారతంలోని పలు నగరాల్లోనూ ప్రజలు ఖగోళ వింతను ఆసక్తిగా తిలకించారు. పౌర్ణమినాడు చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా వచ్చినప్పుడు సూపర్‌మూన్ అంటారు. అలాగే ఒకే నెలలో రెండుసార్లు పౌర్ణమి వస్తే దానిని బ్లూ మూన్ అంటారు. చంద్రగ్రహణం నాడు ముదురుఎరుపు రంగులో కనిపించే చంద్రుడిని బ్లడ్‌మూన్ అంటారు. బుధవారం ఈ మూడు ఏకకాలంలో ఆవిష్కృతమయ్యాయి. హాంకాంగ్‌లో సాయంత్రంవేళ టెలిస్కోప్‌తో సూపర్‌మూన్‌ను వీక్షిస్తున్న దృశ్యం -
ఆకాశంలో సెలీన్ సుందర కావ్యం
వెబ్‌డెస్క్, హైదరాబాద్ : సుమారు 36 ఏళ్ల తర్వాత ఆకాశంలో చంద్రుని సుందర దృశ్యం ఆవిష్కృతమైంది. సూపర్ మూన్, బ్లూ మూన్, సంపూర్ణ చంద్ర గ్రహణం మూడు కలసి ఒకేసారి కనిపించి ప్రపంచంలోని పలు దేశాల ప్రజలను కనువిందు చేశాయి. సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా భూమి పూర్తిగా నీడలోనే ఉండిపోవడంతో జాబిల్లి ముదురు ఎరుపురంగులో(బ్లడ్ మూన్‌గా) కనిపించింది. సాయంత్రం 04.21 గంటలకు ప్రారంభమైన గ్రహణం రాత్రి దాదాపు ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ముగిసింది. ఆసియా, తూర్పు రష్యా, మధ్య ప్రాచ్యప్రాంతం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ఈ ఖగోళ వింత చోటు చేసుకుంది. భారత్ వ్యాప్తంగా... దేశ వ్యాప్తంగా సంపూర్ణ చంద్ర గ్రహణం దర్శనమిచ్చింది. చందమామ(సెలీన్)పై పాక్షిక నీడ లేదా భూమికి చెందిన పెన్యుంబ్రా నీడతో బుధవారం సాయంత్రం 5.20కి మన దేశంలో కనిపించడం ప్రారంభమైంది. ప్రధాన గ్రహణం మాత్రం సూర్యాస్తమయం తర్వాత 6.25 నిమిషాలకు ప్రారంభమై, తూర్పు వైపు ఆకాశంలో కనిపించింది. ఈ నెల 1వ తేదీన తొలి పౌర్ణమి ఏర్పడింది. తిరిగి 28 రోజుల్లోనే మళ్లీ పౌర్ణమి రావటంతో దీన్ని బ్లూ మూన్‌గా పిలుస్తున్నారు. సూపర్ మూన్... చంద్రుడు గుండ్రంగా ఒక స్థిర కక్ష్యలో కాకుండా కొంచెం అటూ ఇటూగా (అప్సిడల్ ప్రిసిషన్)లో భ్రమిస్తుండటంతో కొన్ని పర్యాయాలు భూమికి కొంత సమీపంగా వస్తాడు. ఇలాంటి సందర్భాల్లో.. పున్నమి రోజుల్లో సూర్యుడికి ఎదురుగా వస్తాడు. ఈ కారణంగా చంద్రుడి పరిమాణం పెరిగినట్లుగా అనిపిస్తుంది. చంద్రుడు ఇలా పెద్దగా కనిపించడాన్ని సూపర్ మూన్‌గా అభివర్ణిస్తారు.