నీళ్ల కోసం ఘర్షణ
మదనపల్లెక్రైం, న్యూస్‌లైన్: బి.కొత్తకోటలోని అటుకో కాలనీకి నీళ్లు రాకపోవడంతో ట్యాంకర్‌ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. బుధవారం నీళ్లట్యాంకర్ కాలనీకి వచ్చింది. స్థానికంగా ఉంటున్న వెంకట్రమణ భార్య లక్ష్మమ్మ(60) ట్యాంకర్ వద్దకు నీళ్లు పట్టుకునేందుకు వెళ్లింది. ఒక్కో కుటుంబానికి 6 బిందెలు చొప్పున నీళ్లు వదిలారు. అయితే నరసింహులు భార్య రమణమ్మకు, చాకలి వెంకట్రమణ భార్య శిల్పకు 15బిందెల నీళ్లు వదిలారు.
ఇది గమనించిన లక్ష్మమ్మ ఇదేమి న్యాయం అని ట్యాంకర్ తీసుకువచ్చిన వ్యక్తిని ప్రశ్నించింది. తమకు కూడా15 బిందెల నీళ్లు వదలాలని డిమాండ్ చేసింది. అందుకు అతను నిరాకరించాడు. నీళ్ల విషయంలో రమణమ్మ,శిల్ప,లక్ష్మమ్మల మధ్య వివాదం తలెత్తింది. ఉదయం జరిగిన వివాదాన్ని రమణమ్మ,శిల్ప రాత్రి ఇంటికి వచ్చిన భర్తలకు తెలిపారు. దీంతో ఆగ్రహించిన నరసింహులు, అతని కుమారుడు రాజా, చాకలి వెంకట్రమణ, సుధాకర్, విష్ణు తదితరులు లక్ష్మమ్మ ఇంటికి వెళ్లారు. కులంపేరుతో దూషించారు. రాజ గొడ్డలితో లక్షమ్మపై దాడి చేశాడు.
దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. దీనిని గమనించి ఆమె బంధువులు వెంకటరమణమ్మ(25)కదిరప్ప(25),లక్ష్మన్న(34) వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిపై కూడా నరసింహులు,తదితరులు దాడిచేశారు. తీవ్రంగా గాయపడ్డ లక్ష్మమ్మను ఆమె బంధువులు మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు బి.కొత్తకోట ఎస్ఐ సుకుమార్ దాడిచేసిన వారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ మేరకు డీఎస్పీ రాఘవరెడ్డి ఆస్పత్రికి చేరుకుని బాధితురాలిని విచారించారు. నిందితున్ని వెంటనే అరెస్ట్ చేసి రిమాండుకు పంపిస్తామని చెప్పారు.