గిరిజన సంక్షేమ శాఖ డీడీ సరెండర్
ఏటూరునాగారం : గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ పోచం అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయనను మాతృశాఖకు సరెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్పెషల్ డీఎస్సీ 2012–13కు సంబంధించిన ఉపాధ్యాయ పోస్టుల్లో ట్రైబల్ వెల్ఫేర్ డీడీ పోచం పది మంది గిరిజన అభ్యర్థులను నియమించార న్నారు. అయితే ప్రాథమిక విచారణలో ఆ నియామకాలు ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా జరిగాయని, అలాగే ఉన్నతాధికారుల పేర్లు చెప్పి అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు రావడంతో.. కలెక్టర్ కరుణ ఆయనను మాతృశాఖ గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌కు సోమవారం సరెండర్ చేశారన్నారు. అలాగే టీడీడబ్ల్యూఓ చందన్‌కు డీడీగా పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారన్నారు. కాగా, డీడీ పోచం హయాంలో జరిగిన అన్ని నియామకాలను ఒక సీనియర్ అధికారి ద్వారా విచారించేందుకు నిర్ణయించినట్లు పీఓ తెలిపారు.