మళ్లీ జైలుకు ఎమ్మెల్యే జైన్
సాక్షి, ముంబై: జల్గావ్ గృహనిర్మాణ పథకం కుంభకోణం కీలక నిందితుడు, అక్కడి ఎమ్మెల్యే సురేష్ జైన్‌ను ఆస్పత్రి నుంచి మంగళవారం మళ్లీ జైలుకు తరలించారు. జైన్ ఏకంగా ఐదుసార్లు బెయిల్ పిటిషన్ పెట్టుకున్నా కోర్టులో ప్రతిసారి చుక్కెదురైన విషయం విదితమే. అయితే ఈ ఎమ్మెల్యే సుమారు ఏడాదిగా అరెస్టులో ఉన్నప్పటికీ ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బెయిల్ రాకపోవడంతో కోర్టు ఆదేశాల మేరకు మంగళవారం తెల్లవారుజామున ఇతణ్ని జల్గావ్ జైలుకు తరలించారు. హౌసింగ్ కుంభకోణం కేసుకు సంబంధించి సురేష్ జైన్‌ను 2012 మార్చి 10న అరెస్టు చేశారు. ఆయన మంత్రి పదవిలో కొనసాగుతున్న సమయంలో ఖాందేశ్ బిల్డర్‌తో చేతులు కలిపి సుమారు రూ.29 కోట్ల మేర గృహనిర్మాణ పథకం నిధులను దుర్వినియోగం చేశారంటూ ఆరోపణలు వచ్చాయి.
దీంతో కేసు నమోదు చేసిన జల్గావ్ పోలీసులు ఈ ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. ఇక స్థానిక కోర్టు తొమ్మిది రోజులపాటు పోలీసు కస్టడీ, అనంతరం మార్చి 30వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే అనారోగ్యానికి చికిత్స నిమిత్తం ఆయనకు తాత్కాలిక బెయిల్ కూడా మంజూరు చేసింది. జైన్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో గత మార్చి 23న ముంబై బ్రీచ్‌కాండీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రి నుంచి కూడా ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నా ఫలితం లేకపోయింది. కోర్టు ఐదుసార్లు ఆయన బెయిల్ అభ్యర్థనలను తిరస్కరించింది. దీంతో పోలీసులు సురేశ్ జైన్‌ను వరోరా జైలుకు తరలించారు.