స్వామిని చేరని సూర్య కిరణాలు
అరసవెల్లి: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవెల్లి సూర్యదేవాలయంలో కిరణ దర్శనం భక్తులకు నిరాశ మిగిల్చింది. సూర్యకిరణాలు మూలవిరాట్ను తాకలేదు. దీంతో భక్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రతియేటా మార్చి 9, 10, 11న సూర్యకిరణాలు సూర్యదేవుని మూలవిరాట్ను తాకుతాయి. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తారు.
ఈసారి కూడా భారీగా వచ్చిన భక్తులు ఎగబడటంతో సూర్యకిరణాలు.. మూలవిరాట్ను తాకలేదు. భక్తులు అడ్డుగా నిల్చోవడంతో భానుడి కిరణాలు స్వామివారిని చేరలేదు. దీంతో ఎంతో దూరం నుంచి వచ్చిన భక్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆలయవర్గాల తీరు వల్లే అపూర్వ ఘట్టాన్ని చూడలేకపోయామని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఇలా జరిగిందని విమర్శించారు. అయితే ప్రతికూల వాతావరణంతో కిరణ దర్శనం రద్దు చేసినట్టు ఆలయ అధికారులు చెబుతున్నారు. రేపు, ఎల్లుండి సూర్యకిరణాలు స్వామివారిని తాకుతాయని భక్తులు ఎదురుచూస్తున్నారు.