ఇక తగ్గేదే లే.. ఈవీ రంగంలో సుజుకి మోటార్ భారీ పెట్టుబడులు!
గత కొంత కాలంగా ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో, చాలా మంది ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే చాలా దిగ్గజ కంపెనీలు తమ ఉత్పత్తులను ఈవీ మార్కెట్లోకి తీసుకొని వచ్చేందుకు సిద్దం అవుతుంటే, కొద్దిగా ఆలస్యంగా అయిన జపాన్ ఆటో తయారీదారు సుజుకి మోటార్ కార్పొరేషన్(ఎస్ఎంసీ) మన దేశంలో భారీగా పెట్టేందుకు సిద్దం అవుతుంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీలు), బ్యాటరీల తయారీ కోసం రూ.10,440 కోట్లు (సుమారు 150 బిలియన్ యెన్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు సుజుకి మోటార్ కార్పొరేషన్(ఎస్ఎంసీ) ఆదివారం ప్రకటించింది.
స్థానికంగా ఎలక్ట్రిక్ వాహనాలు(బీఈవీ), బీఈవీ బ్యాటరీల తయారీకి 150 బిలియన్ ఎన్(సుమారు రూ.10,440 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు సుజుకి మోటార్ కార్పొరేషన్ (ఎస్ఎంసీ) గుజరాత్ రాష్ట్రంతో ఎంవోయూ కుదుర్చుకుంది. 2025లో సుజుకీ మోటార్ గుజరాత్లో ఈవీల తయారీ సామర్థ్యాన్ని పెంచడానికి రూ.3,100 కోట్లు, 2026లో ఈవీల బ్యాటరీల ఉత్పత్తి కోసం ప్లాంట్ ఏర్పాటుకు రూ.7,300 కోట్లు కేటాయించారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, ప్రధాని నరేంద్ర మోదీల సమక్షంలో న్యూఢిల్లీలో జరిగిన ఇండియా-జపాన్ ఎకనామిక్ ఫోరంలో గుజరాత్ రాష్ట్రంతో ఎస్ఎంసీ ఒక ఎంఒయుపై సంతకాలు చేసింది.
ఫోరంలో తోషిహిరో సుజుకి మాట్లాడుతూ.. "చిన్న కార్లతో కార్బన్ న్యూట్రాలిటీని సాధించడమే సుజుకి భవిష్యత్తు లక్ష్యం" అని అన్నారు. స్వావలంబన భారత్(ఆత్మనిర్భర్ భారత్)ను సాకారం చేసుకునేందుకు భారత దేశంలో క్రియాశీల పెట్టుబడులను కొనసాగిస్తామని చెప్పారు. ద్వైపాక్షిక భాగస్వామ్యం విస్తరణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు, ఛార్జింగ్ స్టేషన్లు, సోలార్ ఎనర్జీ అభివృద్ధి వంటి రంగాల్లో ఇరు దేశాలు సహకారాన్ని ప్రకటించాయి. తమ క్లీన్ ఎనర్జీ పార్టనర్ షిప్(సీఇపీ) కింద, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలతో సహా నిల్వ వ్యవస్థలు, ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోలార్ ఎనర్జీ అభివృద్ధి వంటి రంగాలలో ఇరు దేశాలు సహకారాన్ని ప్రకటించాయి. మోదీ, కిషిడా మధ్య చర్చల జరిగిన అనంతరం వచ్చే ఐదేళ్లలో భారత్లో ఐదు ట్రిలియన్ ఎన్(రూ.3,20,000 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు జపాన్ ప్రకటించింది.
(చదవండి: 'ఫోర్డ్' చేతులెత్తేసింది, రంగంలోకి దిగిన రతన్ టాటా!)