అభినవ రామప్ప
సాక్షి, హన్మకొండ : తమిళనాడులోని నాగపట్నం జిల్లా మైపాడుతురై గ్రామంలో శివకుమార్ జన్మించారు. అప్పటికే ఆయన పెదనాన్న స్వయంభూనాథన్ తిరుమల తిరుపతి దేవస్థానంలో స్థపతిగా పని చేస్తుండడంతో శివకుమార్ దృష్టి అటు వైపు మళ్లింది. తొమ్మిదో తరగతితోనే చదువుకు చుక్క పెట్టిన ఆయన 1988లో తిరుపతిలోని పెద్దనాన్న చెంతకు చేరారు. ఎనిమిదేళ్ల పాటు పెదనాన్నతో ఉండి పలు ఆలయాల నిర్మాణంలో పాల్గొన్నారు.
మొదటిసారి 1994లో తిరుపతిలో ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను సొంతంగా చేపట్టారు శివకుమార్. ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయడంతో టీటీడీ ఆధ్వర్యంలో నారాయణవనంలో ఉన్న వేదనారాయణ ఆలయం ఉత్తర రాజగోపురం, వాయల్పాడులో ఉన్న పట్టాభిరాజస్వామి ఆలయ గోపురం, అప్పలకొండలో ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ రాజగోపుర పునర్నిర్మాణ బాధ్యతలు అప్పగించగా అవన్నీ విజయవంతంగా పూర్తిచేయడంతో శివకుమార్ పేరు వెలుగులోకి వచ్చింది.
విదేశాల్లోనూ ఆలయ నిర్మాణం
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న టీటీడీ ఆధ్వర్యంలో చేపట్టిన రాతి కట్టడాలతో కూడిన ఆలయాల పునర్నిర్మాణ పనులు చేస్తున్న సమయంలోనే శివకుమార్ పనితీరును గుర్తించిన తిరుపతిలోని క్రైస్తవ సంఘాలు ఓ చర్చి నిర్మాణ పనులను ఆయనకు అప్పగించాయి. హిందూ ఆలయాలు నిర్మాణాలు చేపట్టే వ్యక్తికి క్రైస్తవ ప్రార్థన మందిరం నిర్మాణాన్ని అప్పగించడం ఆయన పనితీరుకు కొలమానం. రోమన్ నిర్మాణ శైలికి హిందూ ఆలయాల నిర్మాణశైలిని జోడిస్తూ ఆయన ఏడాది పాటు శ్రమించి తిరుపతిలో జగన్మాత చర్చి నిర్మాణం పూర్తి చేశారు. ఈ చర్చి నిర్మాణంతో శివకుమార్ ప్రతిభ నలుదిశలా వ్యాపించింది.
మారిషస్‌లో ఉన్న హిందూ సంస్థల నుంచి శివకుమార్‌కు 1996లో పిలుపు వచ్చింది. దాదాపు రూ.పది కోట్ల వ్యయంతో అక్కడ హరిహర దేవస్థాన నిర్మాణ పనులు ఆయనకు అప్పగించగా.. నాలుగేళ్లలో పూర్తిచేశారు. ఆ తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌లోని మధురలో హరిదేవ మందిర్, ఢిల్లీలో షాలిమాబాద్లో హనుమాన్ ఆలయ నిర్మాణాల్లో పాలుపంచుకున్నారు. అనంతరం 2005లో వరంగల్ వేయిస్తంభాలగుడి కల్యాణ మండపం పునర్నిర్మాణ పనులను శివకుమార్‌కు అప్పగించారు. ప్రస్తుతం ఈ మండపం పనులు డెబ్భై శాతం మేర పూర్తయ్యాయి.
ఇదే సమయంలో తెలంగాణ కోసం మలిదశ పోరాటం ఉధృతం అవడంతో రాష్ట్ర సాధనలో ఎంతోమంది బలిదానాలు చేశారు. వారి త్యాగాల ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది. అమరుల త్యాగాలను స్మరిస్తూ తెలంగాణ రాష్ట్రంలోనే పెద్దదైన స్థూపాన్ని వరంగల్‌లో నిర్మించాలని నిర్ణయించి ఆ పనులను శివకుమార్‌కు అప్పగించారు.
25 రోజులు 280 టన్నుల గ్రానైట్
హన్మకొండలోని కలెక్టర్ బంగ్లా ముందు అమరవీరుల స్థూపం ఏర్పాటు చేయాలని నిర్ణయం జరగడంతో 2014 మే 7 నుంచి స్థూపం పనులు శివకుమార్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. దీని నిర్మాణ కోసం గ్రానైట్ రాయిని ఖానాపురం మండలం ధర్మారావుపేట నుంచి మే 9న వరంగల్‌కు తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ నిర్మాణ పనుల గురించి శివకుమార్ మాట్లాడుతూ ‘మొత్తం ఆరు బాక్సులుగా 280 టన్నుల గ్రే గ్రానైట్‌ను ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియం ప్రాంగణంలోకి చేర్చాం. అప్పటి నుంచి మొత్తం 60 మంది వ్యక్తులు రోజుకు మూడు షిఫ్టుల వంతున 32 అడుగుల ఎత్తై స్థూపం నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నాం.
ఈ నిర్మాణంలో 22 అడుగుల పొడవైన శిలను శిల్పంగా రూపుదిద్దడం కీలకమైన పని. ఇందుకోసం 60 టన్నుల బరువైన గ్రానైట్ శిలను పది రోజుల పాటు శ్రమించి స్థూలాకార శిల్పంగా మలిచాం. ఈ శిల్పం బరువు దాదాపు 11 టన్నులు ఉంటుంది. శిల్పంపై భాగంలో నల్లగ్రానైట్ పై చెక్కిన అడుగున్నర ఎత్తు ఉండే భూగోళాన్ని ఏర్పాటు చేస్తున్నాం’ అని వివరించారు. కాగా, 47.5 టన్నుల బరువు ఉండే ఈ స్థూపం బరువు తట్టుకునేలా పన్నెండున్నర అడుగుల లోతుతో పునాది నిర్మించారు.